ప్రజాశక్తి-సాలూరు: మండలంలోని కూర్మరాజుపేటలో లక్ష్మీసాగరం చెరువుకు ఓ భూస్వామి దర్జాగా గండి కొట్టారు. నీటిపారుదల శాఖ అధికారుల అండతో చెరువుకు గండి కొట్టడంతో ఆయకట్టు రైతులు లబోదిబోమంటున్నారు. ఖరీఫ్ సీజన్లో నీరు చెరువులో నిల్వ లేకపోతే వరిసాగు కష్టమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సర్వే నంబర్ 95లో ఉన్న లక్ష్మీసాగరం చెరువు కింద సుమారు 230 మంది రైతులున్నారు. వీరంతా చిన్న సన్నకారు రైతులే. సుమారు 110 ఎకరాల ఆయకట్టు ఉంది. నెల క్రితం ఈ చెరువు మీదనున్న భూస్వామి గోపిరాజు తన పామాయిల్ తోట ముంపునకు గురవుతోందని నీటిపారుదల శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. గోపిరాజు పామాయిల్ తోటలో కొంతభాగం చెరువు పూర్తిగా నిండిన తర్వాత మునిగే అవకాశం ఉంది. భూస్వామి పామాయిల్ తోట మునిగి పోకుండా ఉండాలంటే తోట, చెరువు సరిహద్దు మధ్య గట్టు నిర్మిస్తే సరిపోతుంది. అలా చేయకుండా ఇరిగేషన్ అధికారులు చెరువు చప్టాకి గండి కొట్టుకోమని భూస్వామి గోపిరాజుకు అనుమతి ఇచ్చారు. దీంతో ఆయన గుట్టుచప్పుడు కాకుండా చెరువు చప్టాకు గండి కొట్టారు. ఈ విషయంపై రైతులు మండల తహశీల్దార్ బాలమురళీకృష్ణ, కలెక్టర్ నిశాంత్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. డిప్యూటీ సిఎం రాజన్నదొర దృష్టికీ తీసుకెళ్లారు. అయినా ఇంతవరకు ఇరిగేషన్ అధికారులలో చలనం లేదు. అందుకు భూస్వామికి ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారి అండదండలు పుష్కలంగా ఉండడమే కారణంగా తెలుస్తోంది. ఉన్నతాధికారి అండ చూసుకుని భూస్వామి గోపిరాజు స్థానిక ఇరిగేషన్ అధికారుల అనుమతి తీసుకుని చెరువు చప్టాకు దర్జాగా గండి కొట్టినట్లు రైతులు ఆరోపిస్తున్నారు.
మరో వైపు వర్షాలు పడుతుండడంతో చెరువులోకి నీరు చేరుతోంది. క్రమేణా చెరువు నిండుతూ వస్తోంది. ఇలాంటి సమయంలో చెరువు చప్టాకి కొట్టిన గండి పూడ్చకపోతే నీరు వృథాగా పోయే అవకాశముంది. దీంతో ఆయకట్టు రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కలెక్టర్, డిప్యూటీ సిఎం రాజన్నదొరకి ఫిర్యాదు చేసినా ఇరిగేషన్ అధికారులు స్పందించక పోవడమేమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. తమ జీవనాధారమైన వరి సాగుకు నష్టం వాటిల్లితే ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు. భూస్వామి గోపిరాజు పామాయిల్ తోటని కాపాడడానికి 200 మంది రైతుల బతుకులపై నీళ్లు చల్లుతారా? అంటూ ఆగ్రహం చెందుతున్నారు. దీనిపై సిఎం జగన్ మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేస్తామని వారు తెలిపారు.
చిన్న, సన్నకారు రైతులమే
లక్ష్మీసాగరం చెరువు కింద భూములున్న రైతులంతా చిన్న, సన్నకారు రైతులే. ఎకరా, అర ఎకరా భూమి సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. చెరువు చప్టాకి గండి కొట్టడంతో ఆయకట్టు రైతులు తీవ్రంగా నష్టపోతారు. నాలుగు నెలల పాటు చెరువులో నీరు నిల్వ ఉంటే వరి సాగవుతుంది. చెరువు నీరు తప్ప మరో మార్గం లేదు. చెరువు చప్టాకి కొట్టిన గండి వెంటనే పూడ్చాలి. భూస్వామికి ఇరిగేషన్ అధికారులు అండగా నిలబడటం విడ్డూరం.
- ఆముదాల అప్పారావు, రైతు, కూర్మరాజుపేట
గండి పూడ్చకపోతే రోడ్డెక్కుతాం
చెరువు చప్టాకి గండి కొట్టడంపై జిల్లా కలెక్టర్ నిశాంత్‌కుమార్, డిప్యూటీ సిఎం రాజన్నదొరకి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. వరి ఉబాలు ప్రారంభానికి ముందు గండి పూడ్చకపోతే రైతులంతా కలిసి రోడ్డెక్కుతాం. అధికారుల తీరుపై సిఎం జగన్ మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేస్తాం.
- కొల్లాయి సూర్యనారాయణ, రైతు, కూర్మరాజుపేట










