ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: నిషేధిత భూముల జాబితా నుంచి వందేళ్ల తర్వాత రైతుల భూములకు శాశ్వతంగా విముక్తి కలిగిందని జిల్లా కలెక్టర్ పి రంజిత్‌బాషా తెలిపారు. చుక్కల భూముల రైతులకు శాశ్వత భూ హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమం శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లోని స్పందన సమావేశంలో జరిగింది. రైతులకు భూ హక్కు పత్రాల పంపిణీ రాష్ట్రవ్యాప్త కార్యక్రమాన్ని కావలి పట్టణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించగా రైతులు తిలకించేలా అధికారులు ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాట్లు చేశారు. తదుపరి జిల్లాలోని లబ్ధిదారు లైన రైతులకు, ఏపీ లెజిస్లేటివ్ చీఫ్‌విప్ ఉమ్మారెడ్డి వెంక టేశ్వర్లుతో కలిసి జిల్లా కలెక్టర్ హక్కు పత్రాలను పంపిణీ చేశారు. చుక్కల భూముల జాబితాలో వందేళ్లుగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 3,514 సర్వే నెంబర్లలోని 7,833.87 ఎకరాల భూమిని నిషేధిత జాబితా నుంచి శాశ్వతంగా విముక్తి కల్పించామన్నారు. బాపట్లలో 4,257 రైతు కుటుంబాలు లబ్ధి పొందుతాయన్నారు. బ్రిటిష్ కాలం నుంచి చుక్కల భూమి ఎవరిదో స్పష్టత లేదన్నారు. ప్రభుత్వానికి చెందినవా,.. ప్రైవేట్ వ్యక్తుల భూములా అనే విషయంలో సందిగ్ధత నెలకొందన్నారు. రైతుల సమస్యలను గుర్తించిన ముఖ్యమంత్రి ప్రత్యేక చట్టాన్ని తెచ్చారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలతో రైతుల సమస్యలన్నీ ఇక శాశ్వతంగా పరిష్కారమయ్యాయని అన్నారు.
రైతుల భూ సమస్యలను ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి శాశ్వతంగా పరిష్కరించారని ఏపీ లెజిస్లేటివ్ చీఫ్‌విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. రైతులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో సిఎం గొప్ప నిర్ణయాలు తీసుకున్నారని కితాబిచ్చారు. ఇలాంటి గొప్ప నిర్ణయాలు తీసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రికి రైతులంతా రుణపడి ఉన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కె లక్ష్మీశివజ్యోతి, కలెక్టరేట్ ఏవో సుశీల, రైతులు పాల్గొన్నారు.










