ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : వ్యవసాయ అవసరాల కోసం రైతులు బ్యాంకుల్లో తనఖా పెట్టిన బంగారం ఏమైందో బ్యాంక్ అధికారులు, ప్రభుత్వం నిగ్గు తేల్చాలని సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజరుకుమార్ డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని పల్నాడు విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. క్రోసూరు, అచ్చంపేట మండలాల్లోని బ్యాంకుల్లో రైతులు తనఖా పెట్టిన బంగారాన్ని అప్రయిజర్లు, మేనేజర్లు కుమ్మక్కై కాజేశారని విమర్శించారు. బంగారం ధర రోజురోజుకూ పెరుగుతున్నా రైతులకు మాత్రం సాధారణ ధరలే వర్తింపజేశారని అన్నారు. బాధిత రైతులకు న్యాయం చేయకుంటే ఉద్యమిస్తామన్నారు. పల్నాడు జిల్లాలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఏ పంటలు సాగు చేయాలో ప్రభుత్వం రైతులకు సూచించాలని, నీరెప్పుడు సరఫరా చేస్తారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాకు చెందిన జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు జులై 17న సాగునీరు సాగునీటి విడుదల చేస్తామని చెప్పినా చేయలేదని, నీటి విడుదలపై ఇప్పటికైనా స్పష్టమైన విధి విధానాలు ప్రకటించాలని కోరారు. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు నుండి రూ.1600 కోట్లను ప్రభుత్వం ఇతర పథకాలకు మళ్లించిందని, వాటిని వెంటనే బోర్డుకు జమ చేయాలని డిమాండ్ చేశారు. అందుకు అడ్డంకిగా ఉన్న జీవో 1214ను వెంటనే రద్దు చేయాలన్నారు. సంక్షేమ బోర్డు నిధులంటే కార్మికులు కష్టపడి రూపాయి రూపాయి పోగు చేసి దాచుకున్నవనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలన్నారు. పల్నాడు జిల్లాకు సంబంధించి రూ.7.55 కోట్ల క్లెయిములను పెండింగ్‌లో పెట్టారని, వాటిని పరిష్కరించి కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ కార్మికులు నెలకుపైగా ఆందోళన చేస్తున్నారని, అయినా నాయకులతో చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదని విమర్శించారు. సమస్యలను ఇప్పటికైనా పరిష్కరించాలని, హామీలను అమలు చేయలేకుంటే ఎందుకు చేయలేరో వివరణివ్వాలని డిమాండ్ చేశారు. సాధ్యపడే హామీలను తక్షణమే అమలు చేయాలని కోరారు. మొన్నటి వరకు టమాట ధర ఆకాశాన్ని తాకితే ప్రస్తుతం ఉల్లి ధర పెరుగుతోందని, ధరల స్థిరీకరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సత్వరం చర్యలు చేపట్టాలన్నారు. పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, వివిధ రకాల ఛార్జీలు ప్రజలకు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు తెచ్చిపెడుతున్నారని, ఈ నేపథ్యంలో ప్రజల సమస్యలపై ఈనెల 30వ తేదీ నుండి వచ్చేనెల 6వ తేదీ వరకు సిపిఎం ఆధ్వర్యంలో గ్రామగ్రామాన ప్రచార కార్యక్రమం నిర్వహించనున్నట్లు విజరుకుమార్ ప్రకటించారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా సచివాలయాల వద్ద నిరసనలు, అధికారులకు వినతిపత్రాలు ఇస్తామని, ప్రజలు పెద్దఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
పరిశోధనలకు మరిన్ని నిధులివ్వాలి
చంద్రయాన్-3 విజయవంతం ద్వారా దేశ ఖ్యాతిని ఇస్రో శాస్త్రవేత్తలు ప్రపంచవ్యాప్తంగా మరింతగా విస్తరింపజేశారని విజరుకుమార్ అన్నారు. శాస్త్రవేత్తలకు సిపిఎం పల్నాడు జిల్లా కమిటీ తరఫున ప్రత్యేక అభినందనలు తెలిపారు. పరిశోధనలు తీసుకెళ్లడానికి మరిన్ని నిధులను సమకూర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సమావేశంలో సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.ఆంజనేయ నాయక్, నాయకులు జి.మల్లీశ్వరి పాల్గొన్నారు.










