ప్రొద్దుటూరు(పుట్టపర్తి సర్కిల్) : వైసిపి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని రైతుల గురించి ముఖ్యమంత్రి పట్టించుకున్న పాపాన పోలేదని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి విమర్శించారు. మంగళవారం స్థానిక ఆర్‌అండ్‌బి గెస్ట్‌హౌస్ నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు రైతులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహశీల్దార్ నజీర్ అహ్మద్‌కు వినతిపత్రమిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వర్షాభావంతో రైతులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరించే మార్గం చూపడం లేదని వరద విమర్శించారు. రైతు రోడ్డున పడితే ప్రభుత్వాల పరిస్థితి ఎట్లా ఉంటుందో పాలకులు అర్థం చేసుకోవాలన్నారు. వెంటనే రాష్ట్రంలోని రైతుల సమస్యలు పరిష్కరించాలని ప్రొద్దుటూరులో రైతులతో భారీ ర్యాలీ నిర్వహించమన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, టిడిపి రాష్ట్ర నాయకుడు సీఎం సురేష్ నాయుడు, టిడిపి మాజీ పట్టణ అధ్యక్షుడు ఘంటసాల వెంకటేశ్వర్లు, రాజుపాలెం మాజీ జెడ్పిటిసి మహేశ్వర్‌రెడ్డి, టిడిపి నాయకులు నాగమునిరెడ్డి, రాజుపాలెం మండల రైతులు, పొద్దుటూరు మండల రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.