
మడకశిర: అతివృష్టి, అనావృష్టి గత ఐదేళ్లుగా రైతులను వ్యవసాయం నష్టాల ఊబిలోకి నెట్టేస్తోంది. మడకశిర నియోజకవర్గం వ్యాప్తంగా వ్యవసాయం ఆధారపడి ఎక్కువ మంది జీవనం సాగిస్తుంటారు. గత రెండేళ్లు అతివష్టితో నియోజకవర్గ వ్యాప్తంగా రైతులు పంటలను నష్టపోయారు. సాగుకు ఖర్చు చేసిన పెట్టుబడులు కూడా చేతికందలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి అయినా తమ ఆశలు పండుతాయి అని ఎన్నో ఆశలతో రైతులు ఖరీఫ్ సాగుకు సిద్ధం అయ్యారు. ఈ ఏడాది ఖరీఫ్ ప్రారంభం నుంచే వర్షాలు సరిగా రాలేదు. అరకొర వచ్చిన వర్షానికి విత్తనం వేసినా వర్షాభావంతో అది కూడా ఎండిపోతోంది. పశువులకు కూడా మేతదొరకని పరిస్థితి నెలకొంది. మడకశిర నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో వేరుశనగ, మొక్కజొన్న, రాగులు, కందులు సాగు చేశారు. మడకశిర మండలంలో 18,464 హెక్టార్లలో వేరుశనగ, 264 హెక్టార్లలో మొక్కజొన్న, 163 హెక్టార్లలో రాగులు, 124 హెక్టార్లలో కంది పంటను సాగు చేశారు. రొళ్ల మండలంలో 4002 హెక్టార్లలో వేరుశనగ, 300 హెక్టార్లలో మొక్కజొన్న, 350 హెక్టార్లలో రాగులు, 255, హెక్టార్లలో కందులు సాగు చేశారు. గుడిబండ మండలంలో 4600 హెక్టార్లలో వేరుశనగ, 480 హెక్టార్లలో మొక్కజొన్న, 800 హెక్టార్లలో రాగులు, 510 హెక్టార్లలో కంది పంటను సాగు చేశారు. అమరాపురం మండలంలో 2170 హెక్టార్లలో వేరుశనగ, నాలుగు హెక్టార్లలో మొక్కజొన్న, 112 హెక్టార్లలో రాగులు, 50 హెక్టార్లలో కంది పంటను సాగు చేశారు. ఆగళి మండలంలో 3258 హెక్టార్లలో వేరుశనగ, 290 హెక్టార్లలో మొక్కజొన్న, 692 హెక్టార్లలో రాగులు, 155 హెక్టార్లలో కంది పంటను సాగు చేశారు. గత సంవత్సరంలో 33,770 హెక్టార్లలో వేరుశనగ పంటను సాగు చేయగా, ఈసారి 15,876 హెక్టార్లలో మాత్రమే సాగు అయ్యింది. పంట వేసినప్పటి నుంచి ఇప్పటివరకు అడపాదడపా వర్షాలు వచ్చాయి తప్పా, ఆశించన స్థాయిలో వర్షాలు రాలేదు. వర్షాలు లేక సాగు చేసిన అరకొర పంట కూడా ఎండుదశకు చేరుకుంది. ప్రతిసారీ ఏదో ఒక రూపంలో నష్టాలు తప్పా, ఎలాంటి లాభాలు తాము కళ్లుచూడలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటలు లేకపోవడంతో మడకశిర నియోజకవర్గంలో ఇటీవల వలసలు అధికం అయ్యాయి. రైతు కుటుంబాలు ఇక్కడి నుంచి బెంగుళూరు లాంటి నగరాలకు వలస వెళ్లి కూలి పనులు చేసుకంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకునే చర్యలను చేపట్టాలని పలువురు కోరుతున్నారు.