Dec 13,2022 22:21

ప్రజాశక్తి - ముదినేపల్లి
      మాండూస్‌ తుపాన్‌ ప్రభావంతో కురిసిన వర్షాలకు అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. మండలంలో ధాన్యపు రాసులు తడిసి గింజలు మొలకెత్తాయి. మండలంలోని 32 గ్రామ పంచాయతీల పరిధిలో 15వేల ఎకరాల్లో రైతులు వరిసాగు చేపట్టారు. చిగురుకోట, వడాలి, పెదకామనపూడి, చినకామనపూడి, ముదినేపల్లి, పెయ్యేరు తదితర గ్రామాల్లో మాత్రమే వరికోతలు కోశారు. కోతలు కోసిన పంట మొత్తం తడిసి ముద్దయింది. ఫలితంగా ధాన్యం గింజ రాలిపోతోందని రైతులు అవేదన వ్యక్తం చేస్తునారు. ఎకరాకు రూ.30 వేలకు పైబడి పెట్టుబడి పెట్టి కష్టపడి పండించిన పంట చేతికందే దశలో వర్షాలకు నీట మునిగిపోతుంటే అన్నదాతలకు ఏమి చేయాలో తెలియక అయోమయ పరిస్థితిలో ఉన్నారు. వర్షపు నీటిలో తడిసి, రంగుమారిన ధాన్యం ప్రభుత్వం నిబంధనలు సడలించి కొనుగోలు చేసి రైతన్నలను ఆదుకోవాలని ముదినేపల్లి, గురజ, వడాలి తదితర గ్రామాలకు చెందిన రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తుపాన్‌ ప్రబావంతో చేతికందే వరి పంట ఈదురు గాలులకు నేల కొరిగింది. కోసిన వరిపైరును చేలల్లో కుప్పలు వేయడానికి ఆవకాశం లేకుండా పోయింది. కుప్పలు వేద్దామంటే గింజలు రాలిపోతున్నాయని, తీవ్రంగా నష్టం వాటిల్లుతున్నామని పలువురు రైతులు ఆవేనద వ్యక్తం చేస్తున్నారు. కోతదశలో ఉన్న వరి చేలు నేల కొరిగిపోవడంతో రైతులు వాటిని నిలబటే ప్రయత్నం చేస్తున్నారు. ఒక పక్క వర్షం, కురుస్తున్నప్పటికీ గత్యంతరం లేక రైతులు కోతలు కోస్తున్నారు. చేతికి వచ్చిన పంట దెబ్బతినడంతో రైతులు లబోదిబోమంటున్నారు.
స్పందించని ఆర్‌బికె, సచివాలయాల సిబ్బంది
గ్రామ సచివాలయ, రైతు భరోసా కేంద్రాల్లో సిబ్బంది అందుబాటులో ఉండటం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. వర్షానికి దెబ్బతిన్న పంటను కాపాడుకునేందుకు సరైన సలహాలు, సూచనలు ఇచ్చే వారు కరువయ్యారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రమించి పెట్టుబడులు పెట్టి పంట చేతికి వచ్చే దశలో వర్షాల పాలుకావడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యానికి గిట్టుబాటు ధర రాదని తెలిసి, దళారులకే తక్కువ ధరకు అమ్ముకోవాల్సి రావడంతో ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతున్నారు. దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయని సంతోషించే సమయంలోనే వర్షాలు ఆశలను అడియాశలు చేశాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.