Oct 17,2022 23:41

రైతులకు చెక్కును పంపిణీ చేస్తున్న కలెక్టర్‌, ఎంపి, ఎమ్మెల్యే

ప్రజాశక్తి-పాడేరు: వ్యసాభివృద్ధికి, రైతుల ఆర్ధిక ప్రగతికి రాష్ట్ర ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తోందని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రం పాడేరులోని కాఫీ హౌస్‌లో వైఎస్‌ఆర్‌ రైతు భరోసా-పిఎం కిసాన్‌ పథకం సాయం పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, జిల్లాలో ఒక లక్షా 63 వేల లక్షల మంది రైతులకు రూ.68.71 కోట్ల రైతు భరోసాను ప్రభుత్వం రైతుల ఖాతాలకు జమ చేసిందన్నారు. ఏజెన్సీలో ప్రధానంగా వ్యవసాయ, అటవీ భూములు ఉన్నాయన్నారు. 2019 నుండి ఇప్పటి వరకు 69 వేల ఎకరాల అటవీ భూములకు ఆర్‌ఒఎఫ్‌ఆర్‌ పట్టాలు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. మరో ఆరు వేల ఎకరాలకు పట్టాలు పంపిణీ చేయడానికి సిద్దంగా ఉన్నామన్నారు. ఆర్‌ఒఎఫ్‌ఆర్‌ భూములకు రాష్ట్ర ప్రభుత్వం రూ.13,500లు రైతు భరోసా అందిస్తోందన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చెక్‌ డ్యాంల నిర్మాణాలు, మరమ్మతులకు చర్యలు చేపడతామన్నారు. గిరిజన రైతులు భూములను గిరిభూమి పోర్టల్‌లో నమోదు చేసుకుంటే ప్రభుత్వ పథకాలు మంజూరవుతాయని తెలిపారు. మూడు లక్షల మంది రైతుల 2.60 లక్షల ఎకరాలకు 85శాతం ఇ-క్రాప్‌ బుకింగ్‌ చేయడం జరిగిందన్నారు.
ఎంపి మాధవి మాట్లాడుతూ,.ఏజెన్సీలో పోడు భూములకు అడగకుండానే ముఖ్యమంత్రి పట్టాలు పంపిణీ చేసి రైతు భరోసా అందిస్తున్నారని చెప్పారు. రైతు భరోసాను వ్యవసాయ పెట్టుబడులకు వినియోగించాలని సూచించారు. రైతు ఉత్పత్తులకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పిస్తోందని దళారులను ఆశ్రయించి నష్టపోవద్దని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగి చేసుకుని ఆర్ధికంగా అభివృద్ధి చెందాలని కోరారు.
ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. ప్రతీ రెండు వేల జనాభాకు ఒక రైతు భరోసా కేంద్రం నిర్మిస్తు న్నారన్నారు. ఆర్‌బికెల ద్వారా నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయడం జరుగుతోందన్నారు. ఏజెన్సీలో గిరిజన రైతులు ఎక్కవగా చిరుధాన్యాలు సాగు చేస్తున్నారని, వీటికి గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ధరల పట్టికను రైతు భరోసా కేంద్రాలలో ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు. అనంతరం రూ.68.71కోట్ల రైతు భరోసా-పిఎం కిసాన్‌ పథకం చెక్కును రైతులకు పంపిణీ చేసారు. ముందుగా వైఎస్‌ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి అతిధులు పూల మాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్‌ నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నుండి వైఎస్‌ఆర్‌ రైతుభరోసా - పిఎం కిసాన్‌ పథకం రైతుల ఖాతాలకు జమ చేస్తున్న కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. అనంతరం కాఫీ హౌస్‌ బయట ఏర్పాటు చేసిని వ్యవసాయ ప్రదర్శనను తిలకించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బిఎస్‌ నంద్‌, జిల్లా వ్యవసాయ సలహా మండలి అధ్యక్షురాలు సరస్వతి, ఎంపిపి ఎస్‌.రత్నకుమారి, రాష్ట్ర ఆగ్రోస్‌ డైరెక్టర్‌ వనలబ సన్యాసి, జెడ్‌ పిటిసిలు, ఎంపిటిసిలు, రైతులు, వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు పాల్గొన్నారు.