ప్రజాశక్తి-విజయనగరం : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న నేషనల్ లైవ్ స్టాక్ పథకం రైతుల ఆర్థిక ప్రగతికి దోహదం చేస్తుందని వ్యవసాయ అనుబంధ రంగాల ఉన్నతాధికారులు, సహకార సంఘాల ఛైర్మన్లు, సబ్జెక్టు నిపుణులు పేర్కొన్నారు. నేషనల్ లైవ్ స్టాక్ పథకం అమలు తీరు తెన్నులు, ప్రయోజనాలు తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆడిటోరియంలో మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్ గేదెల వెంకటేశ్వరరావు, పశుగణాభివృద్ధి సంస్థ ఛైర్మన్ బెల్లాన బంగారు నాయుడు, గొర్రెలు, మేకలు పెంపకందారుల జిల్లా సహకార యూనియన్ ఛైర్మన్ మన్యాల కృష్ణ, ఆయా సంఘాల సభ్యులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పశు సంవర్థక శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ ఎ.విశ్వేశ్వరరావు పథకం తాలూక ప్రయోజనాలను, విధివిధానాలను, లక్ష్యాలను వివరించారు. వీలైనంత మందికి ఆర్థిక ఫలాలు అందజేయటమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించామని పేర్కొన్నారు. 2026-27 వరకు ఈ పథకం అమల్లో ఉంటుందని రూ.20 లక్షల నుంచి రూ.కోటి వరకు యూనిట్ల కొనుగోలుకు, వ్యాపార నిర్వహణకు ప్రభుత్వం 50 శాతం రాయితీతో కూడిన ఆర్థిక సహాయం అందిస్తుందని తెలిపారు. జిల్లా వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్ గేదెల వెంకటేశ్వరరావు, పశుగణాభివద్ధి సంస్థ ఛైర్మన్ బెల్లాన బంగారు నాయుడు మాట్లాడుతూ రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా మరింత ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం పశు సంవర్థక శాఖ డిడి వై.వి. రమణ, ఇతర వైద్యులు, సబ్జెక్టు నిపుణులు పలు అంశాలపై రైతులకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎల్‌డిఎం శ్రీనివాసరావు, పశు వైద్యులు డాక్టర్ లీలయ్య, డాక్టర్ దామోదర్, డాక్టర్ మహాలక్ష్మి, యువ శాస్త్రవేత్త సతీష్, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, వివిధ సంఘాల సభ్యులు, అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.










