ప్రజశక్తి - చీరాల
పట్టణంలోని ఇరిగేషన్ కార్యాలయం ఎదుట చిట్టివాద రైతులు ఆందోళ చేశారు. చిట్టివాద భూములకు వెంటనే నీళ్లు విడుదలచేయాలని నినాదాలు చేశారు. పలువురు రైతులు మాట్లాడుతూ చీరాల దండుబాటు ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న చిట్టివాద పోలాలకు గత కొన్ని నెలలుగా సాగునీరులేక రైతులు అల్లాడిపోతున్నారని అన్నారు. సాగరు కాలువను దృష్టిలో ఉంచుకొని భూముల్లో నారుమడులు వేశామని తెలిపారు. అయితే నెలల గడుస్తున్న చుక్కనీరు కూడా అందకపోవడంతో నేడు నారుమడులు ఎండుకుపోతున్న పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. చిట్టివాద కింద 4వేల ఎకరాల సాగుభూమి ఉందని తెలిపారు. ప్రతి ఏటా జూలై నాటికి నీరు పూర్తిగా అందేదని తెలిపారు. ప్రస్తుతం అధికారుల నిర్లక్ష్యంతో సాగునీరు అందడంలేదని ఆరోపించారు. వెంటనే చిట్టివాద పొలాలకు సాగునీరు అందించకపోతే అన్నదాతలు ఆందోళన చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. కార్యక్రమంలో రైతులు సుబ్బారావు, బాబూరావు, విమలాకర్, వాసు, జయరత్నం, కృష్ణ పాల్గొన్నారు.










