Aug 24,2023 20:26

ప్రజాశక్తి - ఏలూరు
         జిల్లాలో రైతుల ఆదాయం పెంపొందించే దిశగా విస్తృతంగా ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్లను (ఎఫ్‌పిఒ) ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ ఉద్యానశాఖ అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో రైతు ఉత్పత్తిదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కలెక్టర్‌ మాట్లాడుతూ ఉత్పత్తి, మార్కెటింగ్‌లో స్కేల్‌ ఆఫ్‌ స్కేల్‌ను ఉపయోగించడం ద్వారా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే లక్ష్యాన్ని సాధించడంలో రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (ఎఫ్‌పిఒలు) కీలకమన్నారు. దీర్ఘకాలికంగా ఆదాయ-ఆధారిత వ్యవసాయానికి ఎఫ్‌పిఒలు భరోసానిస్తాయన్నారు. ఇది వ్యవసాయ ఉత్పత్తిఖర్చును తగ్గించడం ద్వారా రైతులకు ఎక్కువ డబ్బు సంపాదించడానికి ఉపయోగపడుతుందన్నారు. జిల్లాలో ఉన్న అన్ని ఉద్యాన పంటలకు అధికలాభాలు అందించేలా తోడ్పడటానికి ఉధ్యాన శాఖ అధికారులు కృషి చేయాలన్నారు. ఎఫ్‌పిఒ గ్రూపులకు ఎఐఎఫ్‌ పధకంలో కలెక్షన్‌ సెంటర్‌, కోల్డ్‌ రూమ్‌ కింద 75 శాతం సబ్సిడీ ఇస్తారన్నారు. అలాగే పిఎఫ్‌ఎంఎఫ్‌ఇ పథకంలో 35 శాతం సబ్సిడీతో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేసుకోవచ్చని రూ.10 లక్షలు ఒక యూనిట్‌కు ఇస్తామని వివరించారు. రైతులకు డైరెక్ట్‌ ప్రొడ్యూస్‌ మార్కెటింగ్‌ కంటే ప్రొసెస్‌డ్‌ ఫుడ్స్‌ ద్వారా లాభదాయకమని, వారివార్షిక ఆదాయం ఎక్కువగా పెరుగుతుందని వివరించారు. ఈ సమావేశంలో సిడిబి డిప్యూటీ డైరెక్టర్‌ ఎస్‌.కుమార్‌, ఎపిఎఫ్‌ పిఎస్‌ జోనల్‌ మేనేజరు కెజె మారుతీ, ఉధ్యాన శాఖ డిప్యూటీ డెరెక్టర్‌ ఎస్‌.రామ్మోహన్‌, నాబార్డ్‌ డిడిఎం నవకాంత్‌, పాల్గొన్నారు.