Jun 01,2023 23:23

చెక్కును అందజేస్తున్న కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌, ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మి, ఫాల్గుణ

ప్రజాశక్తి పాడేరు : రైతుల ఖాతాలకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా సొమ్మును జమ చేసిందని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ వెల్లడించారు. ఏఎస్‌ఆర్‌ జిల్లాలో 1లక్ష 69 వేల మంది రైతులకు ప్రయోజనం చేకూరిందన్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజక వర్గం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి వై. ఎస్‌. జగన్మోహన్‌ రెడ్డి ఐదవ సంవత్సరం మొదటి విడత రైతు భరోసా-పి ఎం కిసాన్‌ విడుదల ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని గురువారం స్థానిక కాఫీ హౌస్‌ నుండి పాడేరు, అరుకు శాసన సభ్యులతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఖరీఫ్‌ కు 4 వేల 500 వందల క్వింటాళ్ల విత్తనాలు పంపిణీకి సిద్ధం చేసినట్లు వెల్లడించారు. 15 వేల ఎకరాల్లో కాఫీ తోటలు విస్తరిస్తున్నామని పేర్కొన్నారు. మరో 11 వేల ఎకరాల్లో గ్యాస్‌ ఫిల్డింగ్‌ వేస్తున్నామని స్పష్టం చేసారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 10 వేల ఎకరాల్లో ఉద్యాన వన తోటలు పెంపకానికి చర్యలు చేపట్టామన్నారు. రైతు ఆదాయం పెంచడానికి నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. మూడు లక్షల ఎకరాలకు ఇ-క్రాప్‌ బుకింగ్‌ చేయడం జరిగిందని చెప్పారు. ఆర్‌ ఓ ఎఫ్‌ రైతులందరికి రైతు భరోసా అందించడానికి కషి చేస్తున్నామన్నారు.
పాడేరు శాసన సభ్యురాలు కె. భాగ్యలక్ష్మి మాట్లాడుతూ, వ్యవసాయ రంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. పోడు భూములకు రాష్ట్ర ప్రభుత్వం రూ.13,500లు రైతు భరోసా అందిస్తోందన్నారు. కౌలు రైతులకు, జిరాయితీ భూములకు రైతు భరోసా జమ చేస్తున్నారని చెప్పారు.గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగాగ్రామాల్లో పర్యటించినప్పుడు పి.ఎం. కిసాన్‌ రాలేదని ఫిర్యాదు చేస్తున్నారని చెప్పారు. రైతులు ఇకెవైసి చేసుకోవాలని సూచించారు. రైతులు బ్యాంకుల నుండి తీసుకున్న రుణాలు సకాలంలో తిరిగి చెల్లించాలని సూచించారు. అధికారులు బ్యాంకర్లతో మాట్లాడి రైతు భరోసా అందించాలన్నారు. పాడేరు డివిజన్‌ పరిధిలో వెదురు, రబ్బరు సాగును ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి ప్రోత్సహించాలని చెప్పారు. గిరిజన రైతులకు నాణ్యమైన విత్తనాలు, వ్యవసాయ పనిముట్లు పంపిణీ చేయాలని సూచించారు.
అరకు శాసన సభ్యులు పాల్గుణ మాట్లాడుతూ, రైతుల అభివృద్ధికి, సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రైతులను రాజులను చేస్తోందన్నారు. స్థానికంగా నర్సరీలు పెంచితే ఏజెన్సీ వాతావరణానికి అనుకూలంగా ఉంటాయని, ఇతర ప్రాంతాల నుండి తెచ్చిన మొక్కలు బతకలేదని పేర్కొన్నారు. గిరిజన రైతులకు సకాలంలో విత్తనాలు పంపిణీ చేయాలని చెప్పారు. రాయితీ పై దుక్కిటెద్దులను అందించాలని అన్నారు. పట్టుగూళ్లు పెంపకం, అల్లం, పసుపు వంటి వాణిజ్య పంటలను ప్రోత్సహించాలని చెప్పారు. అనంతరం రైతులకు నమూనా చెక్కును పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో పాడేరు ఎంపిపి సోనారి రత్నకుమారి, జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌.బి. ఎస్‌. నంద్‌, జిల్లా వ్యవసాయ సలహా మండలి అధ్యక్షురాలు సరస్వతి, పలువురు జెడ్పిటిసిలు, ఎంపిటిసిలు తదితరులు పాల్గొన్నారు.