Jun 23,2023 19:22

మోటార్లను పంపిణీ చేస్తున్న మంత్రి గుమ్మనూరు జయరామ్‌

ప్రజాశక్తి - హాలహర్వి
రాష్ట్రంలో వైసిపి హయాంలో రైతుల అభివృద్ధికి పెద్దపీట వేసినట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్‌ తెలిపారు. పంట దిగుబడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శుక్రవారం హాలహర్వి మండలం ప్రాజెక్టు పరిధిలోని గ్రామాల రైతులకు ప్రధానమంత్రి కృషి సంచాయీ యోజన పథకం కింద రైతులకు వ్యవసాయ పనిముట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హాలహర్వి ప్రాజెక్టు, మైక్రోవాటర్‌ షెడ్‌ గ్రామాలు, వాటి ఆవాస గ్రామాల్లోని రైతులకు పంట దిగుబడి పెంచేందుకు రైతులకు అవసరమైన వ్యవసాయ పనిముట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. హాలహర్వి, బాపురం, మాచునూర్‌ గ్రామాలకు చెందిన 322 మంది రైతులు లబ్ధి పొందారని చెప్పారు. ఉత్పాదకత పెంపుదల కింద రూ.1.53 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. మొదటి విడతగా రూ.71.24 కోట్లు మంజూరయ్యాయని చెప్పారు. ప్రస్తుతం రైతులకు అవసరమయ్యే తైవాన్‌ స్ప్రేయర్లు (4 స్ట్రోక్‌), ఆయిల్‌ ఇంజిన్‌ (5హెచ్‌పి), టార్ఫాలిన్లు, వాటర్‌ క్యారియింగ్‌ పైపులు (90 ఎంఎం) అందుబాటులో ఉన్నాయని, రైతులు సద్వినియోగం చేసుకొని లబ్ధి పొందాలని కోరారు. నీటిని, నేలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. వర్షపు రూపంలో వచ్చే ప్రతి నీటి చుక్కను కాపాడుకొని పొలాల అవసరాలకు, వ్యక్తిగత అవసరాల కోసం వినియోగించుకోవాలని తెలిపారు. మహిళలు స్వయం సహాయక సంఘాల ద్వారా కుటుంబాలను పోషించుకుంటూ ముందంజలో ఉన్నారన్నారు. రాబోయే రోజుల్లో ఆలూరు నియోజకవర్గంలో నగరడోనా రిజర్వాయర్‌, వేదవతి రిజర్వాయర్‌ను పూర్తి చేసి సాగు, తాగునీరందించి కోనసీమ ప్రాంతంగా రాయలసీమ మార్చుతామని తెలిపారు. అనంతరం రైతులకు అవసరమైన వ్యవసాయ పనిముట్లను మంత్రి పంపిణీ చేశారు. మంత్రి సోదరులు గుమ్మనూరు శ్రీనివాసులు, ఆలూరు మార్కెట్‌ యార్డు ఛైర్మన్‌ గుమ్మనూరు నారాయణ, వాటర్‌షెడ్‌ కమిటీ ఛైర్మన్‌ సావిత్రమ్మ, డ్వామా అదనపు పీడీ సలీం బాష, తహశీల్దార్‌ మల్లికార్జున, ఎంపిడిఒ ఆంథోని, బాపురం సర్పంచి భాగ్యలక్ష్మి, జడ్‌పిటిసి లింగప్ప, హాలహర్వి ఎంపిపి నెట్టికంటమ్మ, వైస్‌ ఎంపిపి నాగేష్‌ నాయుడు, మండల కన్వీనర్‌ భీమప్ప చౌదరి, చింతకుంట సొసైటీ శ్రీనివాసులు, వైసిపి నాయకులు జనార్ధన్‌ నాయుడు, రాజశేఖర్‌, రాము పాల్గొన్నారు.