Nov 28,2022 23:02

'వ్యవసాయ సంక్షోభం-పరిష్కార మార్గాలు' సదస్సులో వక్తలు
ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం

                     రైతులు, వ్యవసాయ కార్మికుల హక్కుల కోసం, భూమి కోసం రాబోయే కాలంలో పెద్దఎత్తున పోరాటాలు చేయాలని, అదే రైతాంగ పోరాట యోధుడు ఉద్దరాజు రామంకు నిజమైన నివాళి అని పలువురు వక్తలు అన్నారు. సోమవారం స్థానిక ఎంబి సోషల్‌ క్లబ్‌లో ఉద్దరాజు రామం 28వ వర్థంతి సందర్భంగా 'వ్యవసాయ సంక్షోభం-పరిష్కార మార్గాలు' అనే అంశంపై ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం, రైతుసంఘం, ఉద్దరాజు రామం ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదస్సుకు ఉద్దరాజు రామం ట్రస్ట్‌ వైస్‌ ఛైర్మన్‌ ఎ.రవి అధ్యక్షత వహించారు. సదస్సుకు ముఖ్యఅతిథులుగా ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎంఎల్‌సి షేక్‌ సాబ్జీ, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు, కాంగ్రెస్‌ కిసాన్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షులు జెట్టి గురునాథరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఎల్‌సి సాబ్జీ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా నేటికీ పేదల ఆర్థిక స్థితిగతుల్లో ఎలాంటి మార్పూ లేదని విమర్శించారు. కార్పొరేట్లకు, సంపన్నులకు ప్రధాని మోడీ రెడ్‌ కార్పెట్‌ పరిచి ఆహ్వానిస్తున్నారన్నారు. వ్యవసాయరంగ సంక్షోభానికి పరిష్కారం వెతకాల్సిన ప్రభుత్వాలు కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ వ్యవసాయాన్ని కార్పొరేట్‌ వ్యవసాయంగా మార్చాలని చూస్తున్నాయన్నారు. ఇప్పటికే లక్షల ఎకరాల భూములను పేదల నుండి లాక్కొని కార్పొరేట్లకు కట్టబెట్టేలా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని విమర్శించారు. గుజరాత్‌ మోడల్‌ అంటూ దేశాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ మతోన్మాదంతో నింపేలా మోడీ ప్రభుత్వ విధానాలు ఉన్నాయన్నారు. కుల, మత, ప్రాంతీయ బేధాలను సృష్టిస్తూ అన్ని రంగాలను సంక్షోభంలో నెడుతున్నారని విమర్శించారు. దేశానికి అన్నం పెట్టే రైతు, వ్యవసాయ కార్మికుల వెన్ను విరిచేలా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. మోడీ విధానాలనే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం బాధాకరమన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు మాట్లాడుతూ వ్యవసాయ రంగ సంక్షోభం గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతంతోనే సమసిపోతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు భూమిపై హక్కు కల్పించాలని కోరారు. ఉపాధి హామీ చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని కోరారు. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. వ్యవసాయ కూలీల స్థితిగతులు రోజురోజుకీ దిగజారిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నిత్యావసర సరుకుల ధరలు పెంచి పేదలపై ఆర్థిక భారాలు మోపేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయన్నారు. దీనివల్ల దళితులు, పేదలు వెనుకబడిన తరగతులు, గిరిజనులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. ఉపాధి, నిరుద్యోగం సమస్యలను పరిష్కరించాలని, విద్య, వైద్యాన్ని ప్రభుత్వమే నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ప్రయివేటు వ్యవసాయాన్ని అరికట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్పొరేట్‌ వ్యవసాయానికి వ్యతిరేకంగా రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు పెద్దఎత్తున ఐక్య పోరాటాలను నిర్వహించాలన్నారు. కాంగ్రెస్‌ కిసాన్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షులు జెట్టి గురునాధరావు మాట్లాడుతూ దేశంలో అధిక శాతం జిఎస్‌టి మధ్యతరగతి ప్రజలే చెల్లిస్తున్నారన్నారు. నిజమైన పన్ను చెల్లింపుదారులైన మధ్యతరగతి ప్రజలపై నేటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక భారాలు మోపుతున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రైతుసంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్‌ మాట్లాడుతూ దేశంలో పంటలకు గిట్టుబాటు ధర కల్పించినప్పుడే వ్యవసాయ రంగం మెరుగుపడుతుందన్నారు. వ్యవసాయ కూలీలకు సరైన కూలి రేట్లు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం కనబరుస్తున్నాయని విమర్శించారు. దేశ సంపద సృష్టికర్తలైన వ్యవసాయ కూలీల రక్తం పీలుస్తూ కార్పొరేట్‌ శక్తులకు కేంద్ర ప్రభుత్వం ఊడిగం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తూ అనుసరిస్తుందని విమర్శించారు. సదస్సులో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పివి.రామకష్ణ, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి తెల్లం రామకష్ణ మాట్లాడారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎం.జీవరత్నం, నేతలు వై.నాగేంద్రరావు, తామా ముత్యాలమ్మ, తుమ్మల సత్యనారాయణ, నాగమణి తదితరులు పాల్గొన్నారు.