Dec 11,2021 06:55

రైతు చట్టాల రద్దు కోసం జరిగిన పోరాటంలో మహిళల భాగస్వామ్యం భారత మహిళా రైతులకు ఒక పెద్ద విజయం. పురుషులతో సమానంగా మహిళలు కూడా రైతులుగా సహకారం అందించారు. మహిళా సాధికారత గురించి అర్ధం లేని గంభీరమైన ప్రకటనలు చేసిన విధంగా కాక, ప్రజాస్వామిక పద్ధతిలో ఒక వర్గ పోరాటం ద్వారా సాధించిన ఈ విజయం భిన్నమైనది.

'మనం సాధారణంగా గ్రామీణ మహిళలు నిరక్షరాస్యులని అనుకుంటాం. కానీ రైతు ఉద్యమం ద్వారా వారు ప్రజాస్వామ్యం అంటే ఏమిటో, ఎలా పోరాడాలో చూపించారు. వారు ఎంతో మానసిక పరిపక్వతతో, ధైర్యసాహసాలతో పోరాట పటిమను చూపించారు. తమ హక్కులను అర్ధం చేసుకోవడమే కాదు. వాటి కోసం పోరాటం చేశారు.

రైతు చట్టాలు సృష్టించే ఇబ్బందులు తెలిసిన నిరక్షరాస్యులైన మహిళలు...సింఘు, టిక్రీ, ఘాజీపూర్‌, షాజహాన్‌ పూర్‌, పల్వల్‌ లోని నిరసన ప్రాంతాల్లో ఒక బలమైన శక్తిగా నిలిచారు. తలపై పసుపు పచ్చని ముసుగులతో ఉన్న మహిళా రైతులు, సంవత్సర కాలంలో పురుషులతో సమానంగా అనేక కష్టనష్టాలను తట్టుకొని వారి వెన్నంటే ఉన్నారు. మూడు రైతు చట్టాలను రద్దు చేయాలనే రైతుల ప్రధాన డిమాండ్‌ నెరవేరడానికి సంవత్సరకాలం తీసుకుంటుందని మహిళలు ఊహించలేదు. కానీ, కాలం గడిచే కొద్దీ, ఒక కర్కశ ప్రభుత్వంతో తలపడుతున్నామనే విషయం వారికి అర్ధమైంది. తమ భూములను, తమ పిల్లల భవిష్యత్తును రక్షించుకునేందుకు ఎంతకైనా తెగించే బలాన్ని ప్రతికూల పరిస్థితులే కల్పించాయి. వారు ట్రాక్టర్లు నడిపారు. పురుషులతో పాటు వంటశాలలను నిర్వహించారు. నిరసన వ్యక్తం చేస్తున్న రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. ఉద్యమం కొనసాగడానికి అవసరమైన అన్ని పనులను చేశారు.
    భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బి.కె.యు) రైతాంగ ఉద్యమం కోసం పెద్ద సంఖ్యలో మహిళలను సమీకరించింది. ''రైతు చట్టాల ఆర్డినెన్స్‌ తెచ్చినప్పుడు, వాటికి పరిష్కారం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఈ రైతు చట్టాలు చిన్న రైతులు, వ్యవసాయ కార్మికులే గాక ప్రతీ ఒక్కరి చావుకు కారణమవుతాయని తెలుసుకున్న తరువాత నిరసనలను తీవ్రం చేయాలని నిర్ణయించామ'ని పంజాబ్‌ బికెయు అనుబంధ మహిళా సంఘ అధ్యక్షురాలు హరీందర్‌ బిందు తెలిపారు.
   'మహిళలను ఇళ్ళ నుంచి బయటకు తీసుకొచ్చేందుకు మేం గ్రామగ్రామాన ప్రదర్శనలు నిర్వహించాం. మహిళలు పెద్ద సంఖ్యలో భాగస్వాములయ్యారు. వారు ఇంటి పని, పొలం పని ముగించుకుని మీటింగ్‌కు హాజరయ్యేవారు. ప్రతి రోజు ఉదయం 4 గంటలకు లేచి రాత్రి 11 గంటలకు పడుకునే వారు. భూమి లేకుంటే, వెలిగించేందుకు పొయ్యి ఉండదని వారు తెలుసుకున్నారు. ఆరు వందల గ్రామాల నుండి 26 వేల మంది మహిళలు ఈ నిరసనలలో పాల్గొన్నారు. ఆనాటికి కేంద్ర మంత్రిగా ఉన్న హర్‌సిమ్రత్‌ కౌర్‌ కు వ్యతిరేకంగా మహిళలు నిరసన తెలియచేయడంతో ఆమె 2020 సెప్టెంబర్‌ లో మంత్రి పదవికి రాజీనామా చేశార'ని బిందు తెలిపారు.ఈ పోరాటం కార్పొరేట్‌ వ్యవస్థకు, ఆ వ్యవస్థను సమర్థించే రాజకీయ పార్టీలకు, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగింది. పెట్రోల్‌ బంకులు, రిటైల్‌ షాపులు, కొన్ని గ్రూపులకు చెందిన బహుళజాతి షాపుల ముందు మహిళల నిరసనలు వెల్లువెత్తాయి. హర్యానా, పంజాబ్‌ రాష్ట్రాల్లో ప్రైవేటు కంపెనీలు నిర్వహించే 'టోల్‌ ప్లాజా'లు (రైతులు, మహిళల నిరసనల వలన) ఢిల్లీ-పంజాబ్‌ మధ్య తిరిగే వాహనాల నుండి ఎటువంటి ఫీజు వసూలు చేయకుండా వదిలేశారు.
    '2020 నవంబర్‌ 26న ఢిల్లీ ప్రదర్శనకు అవసరమైన ఆహార పదార్థాలు, ఇతర వస్తువులను సమీకరించడం ద్వారా మహిళలు సహాయపడ్డారు. ఇది కేవలం నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే పోరాటం మాత్రమే కాదు. ఇది సామ్రాజ్యవాదానికి కూడా వ్యతిరేకంగా జరిగే పోరాటం అనే విషయం వారికి తెలుసని' హరీందర్‌ బిందు చెప్పారు. పంజాబ్‌ మహిళలు 2020 నవంబర్‌ 27న పోలీస్‌ బారికేడ్లను నెట్టుకొని హర్యానా లోని దబ్వాలీ, ఖనౌరీలకు వచ్చారు. పెద్ద సంఖ్యలో వచ్చిన మహిళలను చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. వారు అందించిన స్ఫూర్తితో హర్యానా మహిళలు వెంటనే సింఘు, టిక్రీ ప్రాంతాల్లోని నిరసనల్లో పాల్గొన్నారు.
    జనవరి 26న మహిళలు పంజాబ్‌ లో ట్రాక్టర్ల ప్రదర్శన చేశారు. ఆ రోజు వారిలో చాలా మంది ఢిల్లీలో జరిగిన కిసాన్‌ పరేడ్‌ లో పాల్గొన్నారు. పురుషులు నిర్వహించాల్సిన బాధ్యతను మహిళలు నిర్వహించిన తీరుకు ఆ ఉద్యమం ఒక సాక్షీభూతంగా నిలిచింది. నిరసన ప్రదేశాలలో పురుషులు వంట, వడ్డన, పాత్రలు శుభ్రపరిచే పని చేస్తూ కనిపించారు. ప్రతీ రోజూ టీవీ సీరియళ్లను వీక్షించే మహిళలంతా ఇప్పుడు రైతు చట్టాలపై ప్రసారమయ్యే వార్తలు, చర్చలను వీక్షించే పనిలో నిమగమయ్యారు. సంయుక్త కిసాన్‌ మోర్చా నాయకులు ఏం మాట్లాడుతున్నారో వారు జాగ్రత్తగా విన్నారు.
 

                                                           సమాన భాగస్వాములుగా...

ఆర్డినెన్సుల ద్వారా రైతు చట్టాలను ప్రకటించినప్పుడు, ఫైనాన్స్‌ కంపెనీలు సృష్టించే సమస్యల గురించి 'పంజాబ్‌ కిసాన్‌ యూనియన్‌' విశ్లేషించిందని ఆ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలు జస్బీర్‌ కౌర్‌ అన్నారు. ఆర్డినెన్సుల ద్వారా సంభవించే ప్రమాదాన్ని గుర్తించి, మహిళలు కూడా నిరసనలలో భాగస్వామ్యం కావాలని నిర్ణయించుకున్నారు. పంజాబ్‌లో రైళ్ళ పునరుద్ధరణ తరువాత మహిళలు ఢిల్లీ వెళ్ళగలిగారు.
    జనవరి 18 కార్యక్రమాన్ని 'మహిళా కిసాన్‌ దివస్‌'గా గుర్తించారు. ''మహిళలకు ఆస్తిలో వాటా ఇవ్వలేదు. వ్యవసాయ సంబంధిత ప్రక్రియల్లో భాగస్వామ్యం లేదు. కానీ రైతు కుటుంబాలకు చెందినవారిగా అనేక వ్యవసాయ పనుల్లో బాధ్యత ఉంటుంది కాబట్టి, వారు ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలనుకున్నారని'' కౌర్‌ చెప్పారు. కొందరు మహిళలు సంవత్సరం పొడవునా ఉద్యమం జరిగిన ప్రాంతంలోనే ఉన్నారు. మహిళలను వంట చేయడానికి తీసుకొచ్చారా అని ఒక రిపోర్టర్‌ అడిగిన ప్రశ్నకు కౌర్‌ ఆశ్చర్యపోయి, వంట చేసేది పురుషులేనని (మహిళల సహాయంతో) చెప్పారు. బహిరంగంగా మాట్లాడేందుకు సిగ్గుపడిన మహిళలు ఇప్పుడు ఆ అవరోధాలను బద్దలుకొట్టారు. వారు నిరసన పాటలను కూడా ఆలపిస్తున్నారని కౌర్‌ చెప్పారు. జనవరి 7వ తేదీన ప్రధాన రహదారి చుట్టుపక్కల నిర్వహించిన ప్రదర్శనలో మహిళలు పెద్ద సంఖ్యలో ట్రాక్టర్లను నడిపారు. ఆశ్చర్యకరమైన విషయమేమంటే, హర్యానా నుండి మహిళలు భారీగా తరలివచ్చారని కౌర్‌ చెప్పారు.
   హర్యానా మహిళలంతా ముసుగులు ధరించి ఉద్యమంలో పాల్గొన్నారు. ఒక గ్రామంలో, సరిహద్దు ప్రాంతంలో కొనసాగుతున్న నిరసన కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఇంటికొకరిని పంపించాలని మహిళలే ప్రకటించి, సమీకరించే బాధ్యతను తమంతట తామే తీసుకున్నారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన హామీ, వారి పిల్లల కోసం మెరుగైన వైద్యం, విద్య గురించి మాట్లాడడం నిజంగా గొప్ప విజయంగా భావించవచ్చు.
    దశాబ్దాల తరబడి లోలోపల వుండిపోయిన తమ భావాలను బహిరంగంగా వ్యక్తీకరించే విధంగా, రైతు ఉద్యమంలో భాగస్వాములైన మహిళలకు ఇదొక అవకాశమని ఐద్వా (అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం) మాజీ జాతీయ కార్యదర్శి జగ్మతీ సంగ్వాన్‌ చెప్పారు. కుటుంబ పెద్దలు వీరిని అనుచరులుగా తీసుకొచ్చినట్లు కాకుండా చైతన్యవంతమైన భాగస్వాములుగా మహిళలు ఈ ఉద్యమానికి ఆకర్షితులయ్యారని జగ్మతి చెప్పారు. ప్రజా ఉద్యమాలలో, సామాజిక, మత సంబంధమైన సభల్లో భాగస్వాములైన చరిత్ర పంజాబ్‌ మహిళలకు ఉంది. అయితే హర్యానా మహిళల భాగస్వామ్యం ఒక అసాధారణమైన కొత్త విషయం. కొద్దిపాటి భూమి ఉన్న కుటుంబాలకు ఈ రైతు చట్టాలు కొత్త ప్రమాదాలను సృష్టించాయి. ఆ భూమిలో భాగాన్ని కోరుకున్న మహిళలు ఈ నూతన రైతు చట్టాలు, భూసేకరణ చట్టం కింద తమ భూములను కోల్పాతామనే భయాన్ని ఎదుర్కొన్నారని జగ్మతి పేర్కొన్నారు.
 

                                                        అసంఖ్యాక ప్రతిబంధకాలు ...

ఢిల్లీలో వాతావరణ మార్పులు, మహిళలకు సంబంధించిన ఇతర సమస్యలు ఒక పెద్ద సవాల్‌ గా మారాయి. 'మేం ఢిల్లీ వెళ్ళినప్పుడు అంతా బహిరంగ ప్రదేశమే. మరుగుదొడ్ల సౌకర్యం లేకపోవడం అతి పెద్ద సమస్య. మహిళల కోసం ప్రత్యేకంగా పబ్లిక్‌ మరుగుదొడ్లు లేవు. కొన్ని రోజుల పాటు ఇబ్బందులు ఎదుర్కొన్నాం. పంజాబ్‌ నుండి ప్రారంభమైనపుడు, హర్యానా లోని మేహమ్‌ సబ్జీ మండీ దగ్గర ఆగాం. భయంకరమైన చలి అయినప్పటికీ మేం మానసికంగా సిద్ధపడే ఉన్నాం. టిక్రీ దగ్గర ప్రదర్శన మొదలైనప్పుడు, మాకు అవసరమైన వస్తువులు సమకూర్చారు. కానీ, మునుపెన్నడూ ఎవ్వరూ చేయని విధంగా మాకు స్థానిక ప్రజల నుండి మద్దతు లభించింది. క్రమక్రమంగా తగిన విధంగా టెంట్లు, టాయిలెట్లు ఏర్పాటు చేసిన తరువాతే మేం నిద్ర పోయామని'' హరీందర్‌ బిందు చెప్పారు.
       భగత్‌ సింగ్‌ మేనకోడలు గుర్జీత్‌ కౌర్‌ డెబ్భై ఏళ్లకు పైబడిన వయసులోనూ రైతు నిరసనల న్నిట్లో పాల్గొన్నారు. ఏ రాజకీయ పార్టీకి చెందని ఆమె...అన్ని ప్రజాస్వామిక ఉద్యమాలలో పాల్గొంటారు. 'మనం సాధారణంగా గ్రామీణ మహిళలు నిరక్షరాస్యులని అనుకుంటాం. కానీ రైతు ఉద్యమం ద్వారా వారు ప్రజాస్వామ్యం అంటే ఏమిటో, ఎలా పోరాడాలో చూపించారు. వారు ఎంతో మానసిక పరిపక్వతతో, ధైర్యసాహసాలతో పోరాట పటిమను చూపించారు. తమ హక్కులను అర్ధం చేసుకోవడమే కాదు. వాటి కోసం పోరాటం చేశారు. నేను హర్యానా నుండి వచ్చిన మహిళలను కలిశాను. వారు పంజాబ్‌ మహిళలను ఎంతగానో ప్రశంసించారు. వారి గ్రామాలకు వచ్చి, వారి కుటుంబీకులతో మాట్లాడమని మమ్ముల్ని అడిగారు. నేను వస్తానని చెప్పాను. కానీ రెండు మూడు రోజుల్లోనే, నిరసనలలో పాల్గొనేందుకు హర్యానా నుండి పెద్ద సంఖ్యలో మహిళలు వచ్చారు. ముసుగులు తొలగించి, రైతు చట్టాల గురించి తెలుసుకోడానికి ఆసక్తి చూపార'ని గుర్జీత్‌ కౌర్‌ చెప్పారు.
 

                                                          హర్యానా మహిళలు ...

హర్యానా మహిళలు గడప దాటి రైతు ఉద్యమంలో పాల్గొనడం తమను ఆశ్చర్యానికి గురి చేసిందని...జగ్మతీ సంగ్వాన్‌, గుర్జీత్‌ కౌర్‌, జస్బీర్‌ కౌర్‌, హరీందర్‌ బిందు అన్నారు. మహిళల భాగస్వామ్యం రెండు రూపాల్లో జరిగింది. తమ కుటుంబం లోని పురుషులను పోరాటంలో పాల్గొనమని చెప్పి వ్యవసాయం, ఇంటి బాధ్యతలను భుజానికెత్తుకొన్న మహిళలున్నారు. వారి కుటుంబాలను ఎదిరించి రైతు నిరసనలలో పాల్గొన్న మహిళలున్నారు. నిరసన చేసే ప్రాంతాల్లో తమ పిల్లలతో సహా వచ్చిన మహిళలు వారికి ఆన్‌లైన్‌ తరగతులలో సహకరించారు. మిగతా సందర్భాల్లో పిల్లల వేదికకు సంబంధించిన విధుల్లో, భోజనశాల్లో వలంటీర్లుగా ఉద్యమ కొనసాగింపుకు సహాయపడ్డారు. ప్రభుత్వం నిరసనకారులను జాతి వ్యతిరేకులుగా, తీవ్రవా దులుగా ముద్ర వేసి వ్యతిరేక ప్రచారానికి పూను కున్న కారణంగా నిరసన చేస్తున్న ప్రాంతాలకు సమీపంలో ఉన్న వారు మహిళలకు టారులెట్లు, బాత్‌రూమ్‌లు ఇచ్చేందుకు సంకోచించారు. హర్యానాకు చెందిన ఒక కుటుంబం తమ బాత్‌రూమ్‌ తెరవడం ద్వారా రైతు ఉద్యమానికి సహకరించింది.
సంవత్సర కాలంపాటు జరిగిన సుదీర్ఘ రైతు ఉద్యమం అనేక మంది ప్రజల జీవితాలపై ప్రభావం చూపింది. రైతు చట్టాల రద్దు కోసం జరిగిన పోరాటంలో మహిళల భాగస్వామ్యం భారత మహిళా రైతులకు ఒక పెద్ద విజయం. పురుషులతో సమానంగా మహిళలు కూడా రైతులుగా సహకారం అందించారు. మహిళా సాధికారత గురించి అర్ధం లేని గంభీరమైన ప్రకటనలు చేసిన విధంగా కాక, ప్రజాస్వామిక పద్ధతిలో ఒక వర్గ పోరాటం ద్వారా సాధించిన ఈ విజయం భిన్నమైనది.
 

('ఫ్రంట్‌లైన్‌' సౌజన్యంతో)
టి.కె. రాజాలక్ష్మి

టి.కె. రాజాలక్ష్మి