Nov 20,2021 06:40

కేంద్ర మూడు నూతన సాగు చట్టాల రద్దు నిర్ణయం రైతు పోరాట ఘన విజయం. స్వాతంత్య్ర భారతాన సల్పిన ఉద్యమాల చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అపూర్వ ఘట్టం. నల్ల చట్టాల రద్దు కోరుతూ సంవత్సర కాలంగా ఢిల్లీ సరిహద్దుల్లో లక్షలాది రైతులు బైఠాయించి ఆందోళనలు నిర్వహిస్తున్నా మొండిగా వ్యవహరించింది మోడీ సర్కారు. ఆందోళన చేస్తున్న అన్నదాతలపై పాశవిక నిర్బంధాలకు, కిరాతక దాడులకు ఒడిగట్టింది. రోజు రోజుకూ ఆసేతు హిమాచలం రైతు ఉద్యమం సంఘటితమవుతున్నదని గ్రహించిన మీదట ఇక తలవంచక తప్పదని భావించి శుక్రవారం స్వయంగా ప్రధాని రంగంలోకి దిగి మూడు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటన చేశారు. బిజెపి ఏమి చేసినా దాని వెనుక కచ్చితంగా రాజకీయ ప్రయోజనం ఉండి తీరుతుంది. ఏడాదిగా అప్రతిహతంగా సాగిస్తున్న రైతు ఆందోళనను చిన్న చూపు చూసిన బిజెపి, రైతాంగంలో, ప్రజల్లో పెల్లుబుకుతున్న ఆగ్రహావేశాలను ఇటీవలి ఉప ఎన్నికల్లో చవి చూసింది. లఖింపూర్‌ ఖేరి మారణకాండ, కోర్టు మందలింపులు బిజెపి ని ఇంటా బయటా రోడ్డుకీడ్చాయి. ఇప్పటికీ వెనక్కి రాకపోతే త్వరలో ఎన్నికలు జరిగే ఉత్తరప్రదేశ్‌ సహా ఐదు రాష్ట్రాల్లో పార్టీ పుట్టి మునగడం ఖాయమని తలచి చట్టాల రద్దుకు ఉపక్రమించిందనేది బహిరంగ రహస్యం.
చట్టాల రద్దుపై జాతి నుద్దేశించి చేసిన ప్రకటనలోనూ ప్రధాని తన మాటల గారడీని వదిలిపెట్టలేదు. రైతుల సంక్షేమం కోసమే చట్టాలను తెచ్చినప్పటికీ, కొన్ని వర్గాల రైతులకు సర్ది చెప్పలేకపోయామని పేర్కొని, అసలు చట్టాల్లో తప్పేమీ లేదంటూ నల్ల చట్టాలను తెల్లగా మార్చే ప్రయత్నం చేశారు. స్వేచ్ఛా మార్కెట్‌ కోసం ఎఎంసి రద్దు, కాంట్రాక్టు సేద్యం, నిత్యావసరాల నిల్వలపై పరిమితుల ఎత్తివేతకు ఉద్దేశించిన చట్టాలు కార్పొరేట్ల విచ్చలవిడి దోపిడీకి ఊతం ఇచ్చేవి. ఇప్పటి వరకు కొన్ని పంటలకు ఉన్న కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)ను హరించేవి. ఈ నేపథ్యంలో చట్టాలు చిన్న, సన్నకారు రైతుల సంక్షేమం కోసమన్న ప్రధాని వాక్కు నయ వంచన. రాజ్యాంగం ప్రకారం సమాఖ్య వ్యవస్థలో వ్యవసాయం రాష్ట్రాల పరిధి లోని అంశం. రాష్ట్రాలను పట్టించుకోకుండా, రైతులతో సంప్రదించకుండా ఏకపక్షంగా చట్టాలు చేశారు. ఈ వాస్తవాలను మోడీ తన ప్రకటనలో ప్రస్తావించకుండా దాచారు. వినాశకర చట్టాలు తెచ్చినందుకు ప్రధాని రైతులకు క్షమాపణ చెప్పలేదు. తెచ్చిన చట్టాలను అమలు చేయనందుకు కార్పొరేట్లకు క్షమాపణ చెప్పారు. ప్రస్తుతానికి చట్టాలను రద్దు చేసినా, ఇంకా వాటి ముప్పు తొలగి పోలేదని ప్రధాని మాటల్లో స్ఫురిస్తోంది.
రైతులు కేవలం మూడు సాగు చట్టాల రద్దు కోసమే ఉద్యమం చేయడంలేదు. అన్ని పంటలకూ ఎంఎస్‌పి ని చట్టబద్ధ హక్కు చేయాలంటున్నారు. ప్రధాని ప్రకటనలో ఎక్కడా ఎంఎస్‌పి ప్రస్తావన లేదు. విద్యుత్‌ సవరణల చట్టం రైతులకు హానికరం. ఆ సవరణలను సైతం రద్దు చేయాలని రైతులు అడుగుతున్నారు. మూడు చట్టాల రద్దు ప్రధాని ప్రకటనతోనే జరగదు. పార్లమెంట్‌ ఆమోదించిన చట్టాలను రద్దు చేయాలంటే తిరిగి పార్లమెంట్‌లోనే చేయాలి. ఈ నెలాఖరులో జరిగే పార్లమెంట్‌ సమావేశాల్లో ఆ ప్రక్రియ కొనసాగిస్తామన్నారు ప్రధాని. అప్పటి వరకు వేచి చూస్తామన్న సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం) నిర్ణయం సముచితమైనది. ఉద్యమ ప్రధాన డిమాండ్‌ ఎంఎస్‌పి కి చట్టబద్ధత మీదా తేల్చుకోవాలన్న ఎస్‌కెఎం యోచన సరైనది. నలభై రైతు సంఘాలు కలగలిసిన ఎస్‌కెఎం నాయకత్వంలోని ఉద్యమం, ఆ పోరాటానికి అందుతున్న విశాల మద్దతు బృహత్తరమైనది. అంతటి ఒత్తిడి ఫలితంగానే విధి లేక కేంద్రం చట్టాల రద్దుకు దిగొచ్చింది. తమ ఉద్యమం తమ కోసమే కాదని, ప్రజలందరి కోసమని రైతులు నినదిస్తున్నారు. కార్మిక కర్షక ఐక్యత కూడా ఈ సందర్భంలో వెల్లివిరిసింది. కార్పొరేట్లకు, వాటి అనుకూల ప్రభుత్వాలకు రైతు ఉద్యమం సింహస్వప్నంగా నిలిచింది. సుదీర్ఘ పోరాటంలో 750 మంది అమరులు కావడం మామూలు విషయం కాదు. మహత్తర రైతు ఉద్యమం అభినందనీయమైనది. ఇక్కడితో ఆగకుండా వ్యవసాయ, రైతు రక్షణకు మరింత ఉధృతంగా సంఘటిత ఉద్యమం కొనసాగితేనే అసలైన లక్ష్యం సిద్ధిస్తుంది.