కేంద్ర బిజెపి ప్రభుత్వం బలవంతంగా రుద్దిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ శనివారం హర్యానాలో కర్నాల్ జిల్లా బస్తారా వద్ద రైతుల ఆందోళనపై పోలీస్ లాఠీ ఛార్జి పాశవికం. హర్యానా బిజెపి సర్కారు క్రూరత్వానికి పెద్ద సంఖ్యలో అన్నదాతలు తీవ్రంగా గాయపడగా, సుశీల్ కాజల్ అనే సన్నకారు రైతు ప్రాణాలు వదిలాడు. పోలీసులు రైతులపై అంతగా రెచ్చిపోయి నెత్తురోడేటట్లు వేటాడి వెంటాడి చావబాదమని హర్యానా ప్రభుత్వమే ఆదేశించింది. అందుకు పక్కా సాక్ష్యం కర్నాల్ సబ్ కలెక్టర్ ఆయుష్ సిన్హా పోలీసులకు ఆదేశాలిస్తూ దొరికిపోయిన వీడియో. గీత దాటితే తలలు పగలగొట్టమన్నారు సదరు అధికారి. ప్రభుత్వ పాలనలో సబ్ కలెక్టర్ అంటే చాలా చిన్న అధికారి. పై నుండి ఒత్తిడి లేకుండా ఆ ఆఫీసర్ తనకు తానుగా పోలీసులకు కఠిన సూచనలు చేసే అవకాశమే లేదు. రైతులపై ఖాకీలను ఉసిగొల్పే కర్కశానికి సర్కారు ఒడిగట్టడానికి వాళ్లు ఏం నేరం చేశారని? కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలపై కొన్ని మాసాలుగా నిరసన తెలుపుతున్నారు. చట్టాల దుష్పరిణామాలను గ్రహించి వాటిని రద్దు చేయమని అడుగుతున్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిజెపి స్పందించకపోవడంతో వారి సభలు, సమావేశాల ఎదుట నిరసనలు తెలపాలని నిర్ణయించుకొని, ఆ విధంగానే సిఎం ఖట్టర్, తదితరులకు తమ డిమాండ్‌ను వినిపించుకుందామని కదిలారు. సమావేశ ప్రాంతానికి 15 కిలోమీటర్ల దూరంలో ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలుపుతున్న కర్షకులను పోలీసులతో చావ మోదవలసిన అగత్యమేమొచ్చింది ?
వ్యవసాయ చట్టాలపై నిరసనలంటే బిజెపికి కంపరంగా ఉంది. రాజధాని ఢిల్లీ శివార్లలో నెలల తరబడి లక్షలాది రైతులు నిద్రాహారాలు మాని, ఎండ, వాన, చలి, కరోనా వేటినీ లెక్కచేయకుండా శాంతియుతంగా బైఠాయింపు కొనసాగిస్తున్నారు. ఆందోళనలలో 600 మంది అమరులయ్యారు. ఎక్కడో ఉగ్రదాడిలో ఒకరిద్దరు చనిపోతేనే ప్రధాని మోడీ కంట తడి పెడుతుంటారు. మన్‌కి బాత్, చాయి పె బాత్‌లు నిర్వహించి భావోద్వేగానికి లోనవుతుంటారు. దేశానికి అన్నం పెట్టే రైతులు తమకు కూత వేటు దూరంలో చనిపోతున్నా చలించట్లేదు. పైపెచ్చు పోలీసులతో రైతుపై దాడి చేయిస్తున్నారు. దేశ సరిహద్దులో లేనంత ఎత్తులో అడ్డు గోడలు నిర్మించి రైతులను నిలువరిస్తున్నారు. రైతుల కోసమే చట్టాలని చెబుతోంది కేంద్రం. తమ ఉనికికే ప్రమాదకరమైన ఆ చట్టాలు వద్దే వద్డంటున్నారు రైతన్నలు. రైతులు తిరస్కరిస్తున్న చట్టాలను అమలు చేసి తీరతామని పట్టుబట్టడం ప్రజా ప్రభుత్వం కాగలదా? రైతులు వద్దన్న చట్టాలను రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, పార్లమెంట్‌ను, సమాఖ్య స్ఫూర్తిని, రాష్ట్రాల హక్కులను కాలరాసి బలవంతంగా మోదుతున్నారంటే కుట్ర అని అర్థమవుతూనే ఉంది. కార్పొరేట్ల ప్రయోజనాలను ఆశించే చట్టాలను రూపొందించారన్న వాదనలకు సర్కారు పోకడ బలం చేకూరుస్తోంది. రైతుల ఆందోళనలపై నిర్బంధాలు, లాఠీ ఛార్జీలు, బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ గూండాల దాడులు ప్రభుత్వ అసహనానికి, నిరంకుశానికి నిదర్శనం.
నయా-ఉదారవాద విధానాలొచ్చాక దేశంలో వ్యవసాయ సంక్షోభం మొదలైంది. ఆ విధానాలు ఊపందుకునేకొద్దీ సంక్షోభం అంతకంతకూ తీవ్రమవుతోంది. 70 శాతంగా ఉన్న చిన్న, సన్నకారు రైతులు ఈ సంక్షోభంలో సమిధలవుతున్నారు. సాగు నుండి అనివార్యంగా గెంటివేయబడుతున్నారు. వారి భూములను ఆక్రమించడానికి కార్పొరేట్లు సిద్ధంగా ఉన్నారు. కార్పొరేట్లకు ఆ అవకాశం కల్పించేవే మోడీ తెచ్చిన వ్యవసాయ చట్టాలు. ఈ మర్మాన్ని గ్రహించే చట్టాల రద్దు కోసం ఢిల్లీ సరిహద్దులకు చిన్న రైతులు తరలుతున్నారు. రైతులు చేస్తున్న పోరాటం వారి రక్షణ కోసమే కాదు. ఆహార ధాన్యాల స్వయంసమృద్ధి సాధన కోసం. స్వావలంబన కోసం. ప్రజలందరి ఆహార భద్రత కోసం. రైతు లేనిదే రాజ్యం లేదు, ప్రజలూ లేరు. అలాంటి రైతులను కబళించే చట్టాలను వ్యతిరేకించాల్సిన, నిరసించాల్సిన బాధ్యత రైతులందరిదీ, ప్రజలందరిది. చట్టాల రద్దు కోసం జరుగుతున్న రైతు ఉద్యమానికి సంఘీభావం, మద్దతు తెలిపితేనే సరిపోదు. రైతుల వెన్నంటి నడవాలి. అదే నిరంకుశ బిజెపికి సరైన సమాధానం.










