Nov 10,2023 21:26

సదస్సులో మాట్లాడుతున్న లీడ్‌ ఫైనాన్స్‌ ప్రతినిధి అవినాష్‌

ప్రజాశక్తి - గరుగుబిల్లి :  రైతు ఉత్పత్తిదారుల సంఘాల మరింత బలోపేతం చేయాలని డిజిటల్‌ గ్రీన్‌ ఫౌండేషన్‌ లీడ్‌ ఫైన్‌న్సా ప్రతినిధి అవినాష్‌ అన్నారు. మండలంలోని తోటపల్లి జట్టు నూతన కార్యాలయ భవనంలో శుక్రవారం డిజిటల్‌ గ్రీన్‌ ఫౌండేషన్‌ వారి రూ.20 లక్షల ఆర్థిక సహకారం, ఎఫ్‌పిఒ రూ.3 లక్షలు విరాళంతో నిర్మించిన సరుకుల నిల్వ గోడౌన్‌ను, ప్రాసెసింగ్‌ యూనిట్‌ను ప్రారంభించారు. దీన్ని అన్నపూర్ణేశ్వరి గిరిశక్తి ఎఫ్‌పిఒకు అందజేశారు. అనంతరం అవినాష్‌ మాట్లాడుతూ జట్టు సంస్థ పరిధిలో 3 ఎఫ్‌పిఒలకు చెందిన రైతుల సరుకులను నిల్వ చేసుకోవడానికి, వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధిని పెంచుకోవడానికి ఈ గోడౌన్‌ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చునని తెలిపారు. రైతుల ఆర్థిక స్థితిగతులు మెరుగుపర్చడానికి, ఉత్పత్తి చేసిన పంటలు, పదార్థాలు వినియోగదారులకు నేరుగా చేరువయ్యేలా దళారీ బెడద లేకుండా ఫలితాలను రైతు ఉత్పత్తిదారుల సంఘాలు నేరుగా అందుకునేందుకుగాను ఇది మంచి అవకాశమని తెలిపారు. ప్రతి సీజన్‌లో ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించే పంటలు మార్కెట్‌ చేయాలని, మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా వ్యాపార కార్యక్రమాలు నిర్వహించాలని, వచ్చిన లాభాల్లో వాటాదారులకు పంచాలని, వాటాదారులను ఎక్కువ సంఖ్యలో చేర్పించాలని మహిళలను ఎక్కువగా చేర్చుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో జట్టు వ్యవస్థాపకులు డాక్టర్‌ డి. పారినాయుడు, డిజిటల్‌ గ్రీన్‌ ఫౌండేషన్‌ ఫైనాన్స్‌ మేనేజర్‌ శశిబాల, డిజిఎఫ్‌ స్టేట్‌ కోఆర్డినేటర్‌ సురేంద్ర, ప్రకతి వ్యవసాయ జిల్లా పి.షణ్ముఖ రాజు, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎస్‌. ప్రహరాజ్‌, ఎఫ్‌పిఒ ఆర్‌వైఎస్‌ఎస్‌ కన్సల్టెంట్‌ టి. శివాజీ, ఎఫ్‌పిఒ అధ్యక్షులు వెంకట నాయుడు, మన్మధరావు, జమ్మయ్య, రైతులు షేర్‌ హౌల్డర్లు పాల్గొన్నారు.