ప్రజాశక్తి-గుంటూరు : గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకూ పొడిగించాలని కలెక్టరేట్ వద్ద 21 రోజులుగా రైతులు చేస్తున్న రిలే దీక్షల్లో భాగంగా మంగళవారం చేపట్టిన మహాధర్నాను ప్రభుత్వం అణచివేసింది. కలెక్టరేట్ వద్ద పోలీసుల్ని భారీగా మోహరించి, ధర్నాకు వచ్చిన నాయకుల్ని బలవతంగా వాహనాల్లో ఎక్కించి నల్లపాడు పోలీసు స్టేషన్‌కు తరలించారు. నల్లమడ రైతుసంఘం నాయకులు డాక్టర్ కొల్లా రాజమోహన్, మాజీ ఎంపిపి నర్రా బాలకృష్ణ, లావు అంకమ్మచౌదరి, తెలుగు యువత నాయకుడు ఆర్.సాయి సహా సుమారు 20 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రత్తిపాడు, పెదనందిపాడు, కాకుమాను, పర్చూరు మండలాల్లోని గ్రామాల నుండి గుంటూరు వచ్చే అన్ని రహదారుల్లో పోలీసుల్ని మోహరించి, తనిఖీలు చేపట్టారు. గుంటూరు వస్తున్న వాహనాలు ఆపి రైతులు, నాయకులు ఉన్నారా? అని ఆరా తీశారు. వట్టిచెరుకూరు మండలం, ఐదోమైలు పాత మద్రాస్ రోడ్డు మీద పెదనందిపాడు వైపు నుంచి వస్తున్న రైతులను బారికేడ్లు పెట్టి పోలీసులు ఆపివేశారు. పోలీసు చర్యలకు నిరసనగా అక్కడే రైతులు, మహిళలు ధర్నా చేయగా వారిని పోలీసులు నల్లపాడు స్టేషన్‌కు తరలించారు. గుంటూరు నగరంలోనూ కలెక్టర్ బంగ్లా రోడ్డు, నగరంపాలెం రోడ్లలో బారీకేడ్లు పెట్టి, పోలీసు నిఘా పెట్టారు. నల్లపాడు స్టేషన్‌లో ఉంచిన నాయకుల్ని మాజీ మంత్రి, రైతు నాయకులు వడ్డే శోభనాద్రీశ్వరరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు, వివిధ పార్టీల నాయకులు తూమాటి శివయ్య, మన్నవ హరిప్రసాద్, చుండూరి రంగారావు, చిట్టిపాటి వెంకటేశ్వర్లు, ప్రజా సంఘాల నాయకులు పరామర్శించారు.
వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ కేవలం రూ.300 కోట్లు వెచ్చిస్తే వేలాది ఎకరాలకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించే ప్రాజెక్టును గత, ప్రస్తుత ప్రభుత్వాలు పట్టించుకోకపోవటం బాధాకరమన్నారు. ఉత్తర్వులు అయితే ఇస్తున్నారుగానీ భూసేకరణకు నిధులు ఇవ్వట్లేదన్నారు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న నాయకుల్ని బలవతంగా అరెస్ట్ చేయటం అప్రజాస్వామికం అన్నారు. అధికారం ఉందని దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. నల్లమడ రైతు సంఘం అధ్యక్షులు డాక్టర్ కొల్లా రాజమోహన్ మాట్లాడుతూ 1936 నుండి హామీలు తప్ప తమ ప్రాంతానికి తాగు, సాగునీరు లేవన్నారు. నీళ్లిచ్చేదాకా తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులు, నాయకుల్ని అరెస్ట్ చేయటం తగదన్నారు. భారత రాజ్యాంగం పౌరులకు నిరసన తెలియచేసే హక్కు, పోరాడే హక్కును కల్పిస్తే ప్రభుత్వం ఆ హక్కును కాలరాస్తోందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి, నిధులు విడుదల చేయకుంటే జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ప్రభుత్వం రైతుల సమస్యను పరిష్కరించకుండా ఆందోళన చేస్తున్న రైతుల్ని అరెస్ట్ చేయటాన్ని ఖండిస్తున్నామని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జొన్నా శివశంకర్, కంచుమాటి అజరుకుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.










