వారందరి (రైతుల) లక్ష్యం ఒక్కటే.. కొత్తసాగు చట్టాల రద్దు! అందుకోసం ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. పిల్లలు, వృద్ధులు, మహిళలతో సహా రహదారులనే ఆవాసాలుగా మార్చుకున్నారు. ఈమధ్య సింఘా సరిహద్దు వద్ద జరిగిన 'పగ్డీ సమ్హాల్ దివస్' కార్యక్రమంలో పాల్గొన్న భగత్‌సింగ్ కుటుంబం రైతు ఉద్యమానికి మద్దతుగా నిలిచింది. 'మీరు ఒంటరి కాదు మీకు మేమున్నాం!' అంటూ భరోసానిచ్చింది.
ఢిల్లీలో జరిగే రైతు ఉద్యమానికి భగత్‌సింగ్ కుటుంబం మద్దతుగా నిలిచింది. మార్చి 23 (షహీద్ భగత్‌సింగ్ వర్ధంతి) లోపు రైతుల డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించక పోతే రైతులకు మద్దతుగా నిరాహారదీక్షకు దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. రైతు ఉద్యమంలో భగత్‌సింగ్ మేనల్లుళ్లు అభరు సందు, తేజీ సంధు, అనుప్రియా సంధు, గుర్జీత్ కౌర్ పాల్గొని రైతుల్లో మరింత ఉత్సాహాన్ని నింపారు. ఇదంతా ఒక ఎత్తయితే, అదేరోజు మరోవైపు తలపాగాలూ పోరాటంలో తమవంతు పాత్ర పోషిస్తున్నట్లు అనిపించింది. ఇదేంటి తలపాగాలు పోరాటం చేయడం? అనే సందేహం రాకమానదు. నిజమేనండీ! ఫిబ్రవరి 24న దేశవ్యాప్తంగా 'పగ్డీ సాంభాల్ దివాస్' రైతు ఆత్మగౌరవ దినం నిర్వహించాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కీఎం) పిలుపునిచ్చింది. అంతే ఢిల్లీ సరిహద్దుల్లోని పోరాట క్షేత్రాలకు రైతులు తలపాగాలతో తరలివచ్చారు. వారిలో ఎక్కువమంది ఆకుపచ్చ తలపాగాలే ధరించారు. ఆ దృశ్యం చూడ్డానికి నరేంద్రమోడీ ప్రభుత్వం రూపొందించిన వ్యవసాయ వ్యతిరేక చట్టాలకు నిరసనగా తలపాగాలు సైతం పోరాటంలో పాలుపంచుకున్నట్టుగా కనిపించింది. త్వరలో రైతులు వారు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుని, విజయపతాకాన్ని ఎగురవేయాలని మనమూ ఆశిద్దాం!