Dec 26,2021 12:22

భూమిని నమ్ముకున్న రైతులు సేద్యం వదిలి.. పోరాటాలు చేస్తారా? అని అందరం అనుకునేదే.. కానీ పరిస్థితులు వస్తే తప్పక ఉద్యమిస్తారనీ.. లక్ష్యం చేరే వరకూ వదిలి పెట్టరని నిరూపితమైంది. రైతులు తమ పిల్లాజెల్లాతో కుటుంబాలు.. కుటుంబాలు మమేకమై ఓ వైపు సేద్యం ఆగిపోకుండానే.. మరోవైపు పోరాటాన్ని నడిపి చూపించారు. స్త్రీ-పురుషులు సమానంగా.. సమాంతరంగా.. ఉద్యమ చైతన్యాన్ని రగిలిస్తూ.. పంటలు పండిస్తూ ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఐదువందల సంఘాలకు పైగా ఐక్య పోరాటాలు నడపడం అంత ఆషామాషీకాదు.. ఇది కేవలం రైతాంగం సమస్య మీదే కాదు.. యావత్తు ప్రజలందరి సమస్యలపై చేసిన మహత్తర ఉద్యమం. ఏడాది పాటు ఎండా.. వాన.. చలిని.. ఆఖరుకు కరోనాను సైతం డోంట్‌కేర్‌ అంటూ.. దేశ రాజధాని నడి బజారులో డేరాలు వేసి మరీ పోరాటం చేశారు. మూర్ఖ పాలకుల మెడలు వంచారు.. కార్పొరేట్‌ విధానాలపై పోరు విజయం లిఖించారు. ఇప్పుడు పదకొండు నెలలుగా అచ్చం ఇలానే రాష్ట్రంలో 'ఉక్కు' పోరాటం జరుగుతోంది. అనేక సంఘాలు కలిసికట్టుగా కార్మికోద్యమ స్ఫూర్తిని చాటుతున్నారు. ఇదీ అదే పాలకుల పీచమణిచే ఉద్యమం.. కార్మికుల కడుపులు కొట్టి.. కార్పొరేట్‌ శక్తులకు ధారాదత్తం చేస్తున్న దారుణం. ఇదీ ఈ నూతన సంవత్సరంలో మరో విజయాన్ని అందిస్తుందనీ.. ఆవైపు అందరం కలిసికట్టుగా కదం తొక్కాలి. దీనిపైనే ఈ ప్రత్యేక కథనం..

 

1


'విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు' అంటూ సాగిన ఉక్కు పోరాటం ఉద్యమంలోనే పుట్టింది. ఉద్యమంతోనే పెరిగింది.. ఉద్యమం వలనే బతికింది.. ఇకముందూ దాన్ని ఉద్యమమే రక్షిస్తుంది.. గత ఆరు దశాబ్దాల కాలంలో నిరంతరం తరంతరం.. చేసిన ఉద్యమాలు.. పోరాటాలు.. అశేష త్యాగాల ఫలితమే నేటి విశాఖ ఉక్కు పరిశ్రమ. ఈ స్థితికి చేరడానికి ఆ పోరాటాల కొనసాగింపు ఫలితమే. ఇప్పటివరకూ విశాఖ ఉక్కును కంటికి రెప్పలా కాపాడుకున్నారు. పోరాడి సాధించుకున్న ఆ ఉద్యమ ఫలాన్ని నేడు కాపాడుకోవాల్సిన దుస్థితి దాపురించింది. ఈ కర్మాగారాన్ని కబళించేందుకు కార్పొరేట్‌ గద్దలు కాసుకుని కూర్చున్నాయి.. మూర్ఖపు పాలకుల ప్రజావినాశన విధానాల ఫలితమే.. దీన్ని కార్పొరేట్లకు ఎరగా వేయడానికి సిద్ధపడింది మోడీ ప్రభుత్వం. ఈ పరిస్థితుల్లో విశాఖ ఉక్కును కాపాడుకోవడమే ప్రధాన లక్ష్యం. అందుకు ఉద్యమమే అసలైన మార్గం. అందుకే కార్మికులంతా ఏయే సంఘాల్లో ఉన్నా.. ఒక్కతాటిపైకి వచ్చారు.. అలుపెరగక దాదాపు పదకొండు నెలలుగా పోరు సల్పుతున్నారు. ఈ పోరుబాటలో కలిసొచ్చిన సంఘాలే కాదు.. పిల్లలు.. పెద్దలు.. కుటుంబాలకు కుటుంబాలు కలిసి కట్టుగా చేయి చేయి కలిపి అవిశ్రాంతంగా 'ఉక్కు' పోరాటం చేస్తున్నారు. ఈ ఉక్కు సంకల్పం ఈనాటిది కాదు.. విజయం సాధించే వరకూ చేసిన చరిత్ర ఉన్నది.. అందుకే లక్ష్యం చేరే వరకూ కొనసాగుతుంది.

                                                       నాడు ఎలా సాధించుకున్నారంటే..

2

ఉక్కు కర్మాగారం నిర్మించడానికి 1965లో విశాఖని అనువైనదిగా నిపుణుల కమిటీ ప్రతిపాదించింది. అయినా కేంద్రం మరోచోటకు మార్చాలని ప్రతిపాదిస్తుందనగానే ఆంధ్రప్రదేశ్‌ భగ్గుమంది. ఒక మహా ఉద్యమం వెల్లువెత్తింది. ఈ ఉక్కు ఉద్యమం గొప్ప ప్రజా ఉద్యమం.. ఆంధ్రప్రదేశ్‌లో 32 మంది ప్రాణత్యాగం చేసిన ఉద్యమం.. వందమంది పోలీసు కాల్పుల్లో గాయపడితే, వేలాదిగా భాష్పవాయు గోళాలను ఎదుర్కొన్నారు. రెండు వేల మందిపై అక్రమ కేసులు పెట్టారు. రాష్ట్రమంతా లక్షలాదిగా ఉద్యమంలో పాల్గొన్నారు. వేలాది వామపక్ష కార్యకర్తలు పోలీసుల చిత్రహింసలకు గురయ్యారు. స్కూలు పిల్లల నుంచి ముసలివాళ్లు సైతం ఉద్యమం తాము సైతం అంటూ ఉద్యమంలో పాల్గొన్నారు. అందుకు నాడు పోరాటంలో పాల్గొన్న వారే నేడు ప్రత్యక్ష సాక్ష్యులుగా ఉన్నారు. ఈ ఉద్యమాలతో రాష్ట్రం దాదాపు మూడునెలలు స్తంభించిపోయింది. ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రభుత్వం కర్కశంగా, దారుణంగా వ్యవహరించింది. 1966 నవంబర్‌లో ఉద్యమకారులపై ప్రభుత్వం జరిపిన దమనకాండలో 32 మంది బలయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో కమ్యూనిస్టుపార్టీ శాసనసభ్యులు 52 మంది, ప్రతిపక్ష సభ్యులు 15 మంది మొత్తం 67 మంది, పార్లమెంట్‌ సభ్యులు ఏడుగురు సభ్యత్వాలకు రాజీనామా చేశారు. ఆలస్యంగానైనా ఉద్యమ ధాటికి గత్యంతరం లేక విశాఖలోనే ఉక్కు కర్మాగారం నిర్మిస్తామని కేంద్రం ప్రకటించాల్సి వచ్చింది.

3


     ఉద్యమం సద్దుమణిగిందో లేదో కేంద్రం మళ్లీ పాత పాట అందుకుంది. ఏదో ఒక సాకులతో, వాదనలతో కాలయాపన చేసింది. కేంద్రాన్ని కదిలించడానికి, పరిశ్రమ ప్రారంభించడానికి మరలా ఉద్యమించాల్సి వచ్చింది. అలా దాదాపు 13 ఏళ్ల తర్వాత అంటే 1979లో పరిశ్రమ నిర్మాణం ప్రారంభమైంది. 1991లో ఉత్పత్తి ప్రారంభించారు. అలా ఆ పరిశ్రమ మన దేశ ఆర్థిక పురోగమనంలో అగ్రభాగాన నిలిచిందంటే అతిశయోక్తి కాదు. ఉత్పత్తి పూర్తిస్థాయిలో ప్రారంభమయ్యాక 1992 నుండి ఆగకుండా ఉక్కు అభివృద్ధి దూసుకుపోయిందంటే అతిశయోక్తి కాదు. అంతెందుకు మొన్నటికి మొన్న కరోనా ప్రారంభమైనప్పుడు ప్రాణవాయువు పోసింది ఈ ఉక్కు పరిశ్రమే కదా.. ఎంతో వైవిధ్యమై ఉత్పత్తులను తయారుచేసే నిపుణులు, సాంకేతిక పరిజ్ఞానం, అంకితభావంతో పనిచేసే ఉద్యోగులు విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఒక గొప్ప వనరు. ఈ వనరులతో దేశాన్ని సుభిక్షం చేసుకోవాల్సింది పోయి.. వెలిగే దీపాన్ని ఆర్పే దుస్సాహసానికి పూనుకుంటోంది. అందరి కష్టాన్నీ అప్పనంగా కార్పొరేట్లకు కట్టబెట్టాలని చూస్తోంది.
 

                                                            కాపాడుకునేందుకు కుటుంబాలతో...

4

ఇప్పుడు అన్నేళ్ల పోరాటంతో సాధించుకున్న ఉక్క పరిశ్రమను కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మళ్లీ అంతటి మహోద్యమాన్ని చేయాల్సి వచ్చినా వెనకాడేది లేదని యావత్తు కార్మికోద్యోగులు కుటుంబాలతో సహా ఉద్యమిస్తున్నారు. నాటి పోరాటం ఒక స్ఫూర్తి అయితే.. నేటి పరిస్థితుల్లో మన ముందు దేశ రాజధానిలో చలిని, ఎండను, వానను.. చివరకు కరోనాకు వెరవక నడిరోడ్డు మీద డేరాలు వేసుకుని రైతులు చేసిన మహత్తర పోరాటం దీప్తిధారగా నిలిచింది. ఆ పోరాటం నల్లచట్టాల రద్దును రాతపూర్వకంగా ఇచ్చాక విరమించడం జరిగింది. 500 సంఘాలకు పైగా ఒక్కతాటిపైకి వచ్చి.. ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా చెదరక మొక్కవోని దీక్షతో కుటుంబాలతో సహా ఏడాదిపాటు ఉద్యమించి, విజయం సాధించారు. నేడు ఉక్కు పరిశ్రమను కాపాడుకోవడానికి మన రాష్ట్రంలోనూ అంతకన్నా ఎక్కువ పోరాట పటిమతో 11 నెలలుగా ఉద్యమిస్తున్నారు. విద్యార్థులు, యువత, ఉద్యోగులు, కార్మికులు.. యావత్తు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు పార్టీలకతీతంగా పోరాడాల్సిన తరుణం ఆసన్నమైంది. ఏదేమైనా మన భవిష్యత్తరం కోసం మహోద్యమం చేయాల్సిందే.


                                                             నాడు.. నేడు.. ద్రోహులే..

4

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఏ అభివృద్ధి ఉద్యమాల్లోనూ ఆర్‌ఎస్‌ఎస్‌, జనసంఫ్‌ు నుంచి బిజెపి వరకూ ఎవరికీ ఎలాంటీ పాత్ర లేదు. నాడూ, నేడూ వీళ్లు ద్రోహులుగానే చరిత్రలో నిలిచిపోయారు.. నిలిచిపోతారు.. జమిందారీ వ్యతిరేక పోరాటంలోనైనా.. విశాలాంధ్ర సాధనలోనైనా.. నాగార్జునసాగర్‌ కోసం సాగిన ఉద్యమంలోనైనా.. ఇసుక రేణువంతైనా వాళ్ల పాత్ర లేదు. విశాఖ ఉక్కు ఉద్యమంలోనూ ప్రారంభంలోనే పాల్గొన్నా.. వీరి పాత్ర ఎక్కడా లేదు. కానీ ప్రజలు అన్నేళ్లు పోరాడి సాధించుకున్న గొప్ప భారీ పరిశ్రమ స్టీల్‌ ప్లాంట్‌ను మాత్రం తెగనమ్మడానికి పూనుకుంది. దక్షిణ కొరియా కంపెనీ 'పోస్కో'కు కట్టబెట్టేందుకు బిజెపి ప్రభుత్వం తెగబడింది. ఇలా ప్రజలు పోరాడి సాధించుకున్న పరిశ్రమను విదేశీ కంపెనీలకు అమ్మడం ఏవిధమైన దేశభక్తో సమాధానం చెప్పాలి. ఇది దేశభక్తి కాదు.. దేశద్రోహం.. బిజెపిని రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ క్షమించలేరు.
     హిందూత్వ సిద్ధాంతం కోసం 1925లో ఏర్పడిన ఆర్‌ఎస్‌ఎస్‌ 1951 నాటికి రాజకీయ పార్టీగా జనసంఫ్‌ు అవతారమెత్తింది. 1977లో జనతాపార్టీలో భాగంగా కలిసిపోయిన జనసంఫ్‌ు తర్వాత విడిపోయి 1980 ఏప్రిల్‌ 6న బిజెపిగా అవతరించింది. మత ప్రాతిపదికన ప్రజల్ని విడదీయడమే దీని సిద్ధాంతం. ప్రజల కోసం పనిచేయడం నాడూ లేదు.. నేడు అంతకన్నా లేదు. అంతెందుకు దేశ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న దాఖలాలు లేవు. 'హిందూ' పేరుతో అధికారం సాధించాలి. అది కానప్పుడు.. బ్రిటీష్‌ వాడైనా.. భారతీయుడైనా.. ఒకటే అనేది వారి సిద్ధాంతం. స్వాతంత్య్రం అనంతరం మన దేశంలో అన్ని మతాలు కలిసిమెలిసి ఉండాలనే గాంధీని పొట్టనబెట్టుకున్నది గాడ్సేనే.. అలాంటి వీళ్లు అధికారంలోకి వచ్చాక ప్రజల్ని ఉద్ధరించింది లేదు. మతం పేరుతో ఉన్మాదంగా వ్యవహరిస్తూ.. ఆర్టికల్‌ 370ని రద్దు చేశారు.. పౌరసత్వ సవరణ బిల్లు, ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు.. కాశ్మీర్‌ కారుచిచ్చు.. ఒకటేమిటి.. అన్నీ సర్వనాశనాలే.. రైతు నల్లచట్టాలతోనూ వ్యవసాయాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టాలని చూశారు. దేశ ప్రజలకు తిండిగింజలు లేకుండా చేయాలనే కుట్ర పన్నారు. రైతులు ఏకతాటిపైకి వచ్చి తగిన బుద్ధి చెప్పారు. మన రాష్ట్రంలో దేదీప్యమానంగా వెలుగొందుతున్న ప్రభుత్వరంగ పరిశ్రమ విశాఖ ఉక్కును విదేశాలకు తెగనమ్ముతోంది. ఈ విధానాలను కార్మికులు అదే స్ఫూర్తితో తిప్పికొట్టడం అనివార్యం.

                                                           నాడు ఎమ్మెల్యేల రాజీనామా

4

విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీని సాధించడంలో ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా.. నాటి అసెంబ్లీలో ఉన్న 52 మంది కమ్యూనిస్టు పార్టీ ఎమ్మెల్యేలు, 15 మంది ఇతర ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఒకేసారి ఇంతమంది రాజీనామా చేయడం చరిత్రలోనే అపూర్వం. రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసింది. కానీ అవసరమైతే ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి.. నాటి చరిత్రను పునరావృతం చేయాలి.. ఇప్పుడు బిజెపితో దోస్తానా చేస్తూ జనసేన నేత నిరాహారదీక్షలు చేస్తున్నారు. దానికన్నా నేరుగా బిజెపి ఒప్పందాన్ని రద్దు చేయించలేరా? దొంగాటకాలు కాకపోతే.. అప్పుడైనా.. ఇప్పుడైనా.. పోరాటాల్లో ముందుపీఠిన నిలిచింది వామపక్షాలే.

5



                                                               రష్యా, చైనా సహకారం..

6

మనదేశంలో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు రష్యా సహకారం అసమానమైనది. రూర్కెలా, దుర్గాపూర్‌లలో స్టీల్‌ప్లాంట్స్‌కు బ్రిటన్‌, జర్మనీ వాడి వదిలేసిన యంత్రాలిచ్చాయి. కానీ బిలారు. భకొరాలలో ఆధునిక భారీ స్టీల్‌ పరిశ్రమల నిర్మాణానికి రష్యా తమ సాంకేతిక నిపుణులతో సహా ఆర్థికంగా సహకరించింది. వస్తు మారక పద్ధతి ద్వారా చౌకగా, నాణ్యంగా నేటికీ ఉన్నాయంటే అదే కారణం. వారు నిర్దేశించిన సామర్థ్యం కంటే అదనంగా నేటికీ ఉత్పత్తి జరుగుతోంది. రష్యా చివరిగా 1980 దశకంలో నిర్మించిన విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లోని బ్లాస్ట్‌ ఫర్సెస్‌లు కూడా అదే విధంగా నేటికీ ఉన్నాయి. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేయడానికి కేంద్రం తీవ్రంగా ప్రయత్నిస్తున్న సమయంలో చైనా మన విశాఖ స్టీల్‌ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంది. దీంతో విశాఖ స్టీల్‌ గురించి యావత్‌ ప్రపంచానికి తెలిసింది. చైనాలో జరిగిన ఒలింపిక్స్‌ కోసం మన ఉక్కు ఉత్పత్తులను చైనా భారీగా దిగుమతి చేసుకుంది. 2002-05 వరకూ చైనా దిగుమతులతో విశాఖ స్టీల్‌ కోట్లల్లో అత్యధిక లాభాలు ఆర్జించింది. ఈ లాభాలతో పాత అప్పులు నాలుగు వేల కోట్ల రూపాయలు పోగా, మరో ఆరువేల కోట్ల రూపాయల మిగులు సాధించింది. కేంద్రం ఒక్క కోటి కూడా సాయం చేయకపోయినా.. ప్లాంట్‌ లాభాలతోనే 3.2 మిలియన్‌ టన్నుల నుంచి 6.3 మిలియన్‌ టన్నులకు .. రూ.13 వేల కోట్ల రూపాయలతో విస్తరించుకోగలిగాం. ఆ విధంగా రష్యా, చైనా సహాయం విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు మరువలేనిది.
 

                                                          అసెంబ్లీలో తీర్మానాలు..

నాడు కేంద్ర ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెల్లుబికింది. దానిని చల్లార్చడానికి నాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి 1966లో జులై 1న విశాఖలోనే ఉక్కు కర్మాగారం నిర్మించాలని ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. అయినా నాలుగునెలలు ఓపిగ్గా చూసినా.. కేంద్రం నుంచి స్పందన లేదు. దీంతో 1966 అక్టోబర్‌ నాటికి ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అదే 'విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు' మహోద్యమం.1966 జులై 1కి ముందూ విశాఖలో భారీ ప్రదర్శనలు జరిగాయి. ఈ విషయాన్ని అసెంబ్లీలో తీర్మానంపై చర్చ సందర్భంగా వావిలాల గోపాలకృష్ణయ్య ప్రస్తావించారు. నేడు వైసిపి నేతృత్వంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు పోస్కోకు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేసింది.

                                  కార్మికవర్గానికి మోడీ క్షమాపణలు చెప్పే వరకూ పోరాడతాం !

స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ పోరాట కమిటీ ఛైర్మన్‌, సిఐటియూ రాష్ట్ర అధ్యక్షులు
స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ పోరాట కమిటీ        ఛైర్మన్‌, సిఐటియూ రాష్ట్ర అధ్యక్షులు
సిహెచ్‌ నరసింగరావు                  

విశాఖ స్టీల్‌ను నూరు శాతం అమ్మేయాలని 2021 జనవరి 1న కేంద్రం నిర్ణయించింది. కార్పొరేట్లకు దేశ సంపదను కట్టబెట్టాలనే ఆలోచనకు అనుగుణంగా విధానం తీసుకుంది. నేషనల్‌ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌ పేర ఆస్థుల అమ్మకం రైళ్లు, పోర్టులు, జాతీయ రహదారులు, టెలికం టవర్‌లైన్స్‌ మౌలిక సదుపాయాలన్నిటినీ అమ్మేయాలని కేంద్రం చూస్తోంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఎంతో శ్రమించి అభివృద్ధి చేసిన ప్రభుత్వరంగం, సంపదలను నాశనం చేయాలని బిజేపి చూస్తోంది. దీనికి వ్యతిరేకంగా మోడల్‌ పోరాటం స్టీల్‌ప్లాంట్‌లో జరుగుతుంది. బిజేపి ప్రభుత్వం మెడలు వంచేందుకు ఈ పోరాటం సాగుతోంది.. రైతులకు క్షమాపణ చెప్పినట్లుగా ఆంధ్రప్రదేశ్‌ కార్మికవర్గానికి క్షమాపణలు మోడీ చెప్పే వరకూ ఈ పోరాటం జరుగుతుంది. వాస్తవానికి లాభనష్టాలు సమస్య కాదు. అలాగే నష్టాల వల్ల ప్రైవేటీకరణ చేయడం లేదని ప్రభుత్వమే ప్రకటించింది. కారణం సొంత గనులు సమస్య. ఏ పరిశ్రమా లేని గాలి జనార్థన్‌రెడ్డి, విదేశీ పోస్కో (ద.కొరియా) కంపెనీకి సొంత గనులున్నాయి. వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌కు ఎందుకు సొంత గనులు ఇవ్వలేదు. సొంత గనులు ఉండి తవ్వుకుంటే టన్నుకు రూ.500 లు ఖర్చవుతుంది. మార్కెట్‌లో కొనుక్కుంటే రూ.7000 లు ఖర్చవుతోంది. దేశంలో స్టీల్‌ప్లాంట్‌ అన్నింటికంటే అగ్రభాగాన ఉండాల్సింది. కానీ ఎంతోకొంత నేడు నష్టాలను చవిచూస్తోంది. సొంత గనుల సమస్యను పరిష్కారం చేయకపోగా అమ్మేయాలని చూస్తోంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రత్యేకహోదా, రైల్వేజోన్‌, కడప స్టీల్‌ప్లాంట్‌, భావనపాడు పోర్టు అభివృద్ధికి సంబంధించిన వాటికి సహకరించకపోగా, ఉన్న ఏకైక భారీ స్టీల్‌ప్లాంట్‌ను అమ్మేయాలనుకోవడం ఆంధ్రప్రదేశ్‌కు తీరని ద్రోహం. అందువల్లనే రాష్ట్రంలో కార్మికులు పోరాడుతున్నారు. దేశంలోనే ఒక మోడల్‌గా 10 కి.మీ మానవహారం చేపట్టారు. దేశంలో రైతాంగ ఉద్యమానికి నాయకత్వం వహించిన నాయకులను తీసుకొచ్చి కార్మిక, రైతు శంఖారావం నిర్వహించాయి. గడచిన ఏడేళ్లలో ఒకే వేదికపైకి రాని వైసిపి, టిడిపిలను ఒకే గొడుకు కిందకి వచ్చేలా స్టీల్‌ప్లాంట్‌ ఉద్యమం పోరాడేలా చేసింది. బిఎంఎస్‌తో సహా కార్మిక నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాపిత ఉద్యమంగా దీన్ని మలచడానికి ట్రేడ్‌ యూనియన్స్‌ నడుం బిగిస్తున్నాయి. పోరాట కమిటీ ఏర్పడినప్పటి నుంచీ ''స్టీల్‌ప్లాంట్‌ను అమ్మనీయం!'' అంటూ పోరాడుతున్నారు. 32మంది ప్రాణాలు త్యాగంచేసి ఆనాడు సాధించుకున్న స్టీల్‌ప్లాంట్‌ను మరలా పోరాడి స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేట్‌కాకుండా, అమ్మకుండా నిలబెట్టుకునే ఉద్యమం సాగిస్తున్నాం. కోటి సంతకాలకు పిలుపు ఇచ్చాం. కొన్ని జిల్లాల్లో పోరాటం కొనసాగుతోంది. విజయనగరంలో కార్పొరేషన్‌ తీర్మానం చేసింది. విశాఖపట్నం జివిఎంసిలోనూ, జెడ్పీలోనూ తీర్మానం చేశారు. మండలాలు, పంచాయతీల వరకూ తీర్మానాల క్రమం, సంతకాలు సేకరించడం కొనసాగుతోంది. రాష్ట్రంలో ఎవ్వరూ చేయని కోటి సంతకాల కార్యక్రమాన్ని రూపొందించారు. 315 రోజుల నుంచి నిరాహార దీక్షలు కూర్మన్నపాలెంలో సాగుతున్నాయి. జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద 270 రోజులుగా నిరసన ఆందోళనలు కొనసాగుతున్నాయి. అన్ని జిల్లాలకూ విస్తరించే కృషి చేపడుతున్నాం. అన్ని జిల్లాల్లో సదస్సులు జరుపుతున్నాం. ఈ నెల 25న పోరాట కమిటీలో భవిష్యత్‌ పోరాట రూపాలను నిర్ణయించి, ప్రకటించబోతున్నాం.


                                                              ఎంతటి త్యాగాలకైనా సిద్ధం

33
                                                              
విశాఖ స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ పోరాట కమిటీ ఛైర్మన్‌, ఎఐటియూసి జాతీయ నాయకులు.
                - ఆది నారాయణ

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ పోరాటాల ద్వారా సాధించుకున్నది. కేంద్ర దయాదాక్షిణ్యాలు కాదు. ప్రాణాలను త్యాగం చేసి, భూములను నిర్వాసితులు త్యాగం చేశారు. గనులు ఇవ్వకపోయినా సొంత కాళ్లపై ప్రభుత్వ రంగంలో కొనసాగుతోంది. ప్రైవేటీకరణ, అమ్మకానికి వ్యతిరేకంగా కార్మికవర్గం, ట్రేడ్‌ యూనియన్స్‌ పోరాడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలూ గంగవరం పోర్టు విషయంలో స్టీల్‌ప్లాంట్‌ నడుపుతుందని చెప్పినా వినకుండా కేంద్రం బలవంతంగా లాక్కొని ఆదానీకి కట్టబెట్టారు. ఎనిమిది మిలియన్‌ టన్నుల ఉత్పత్తి చేసే స్టీల్‌ప్లాంట్‌ ప్రజల ఆస్తి. కొంతమంది వ్యక్తులకు కారుచౌకగా ఇవ్వాలన్న విధానాలకు వ్యతిరేకంగా 30 ఏళ్లుగా కార్మికవర్గం పోరాడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల సహకారంతోనూ, దేశంలో రైతుల పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని స్టీల్‌ పోరాటాన్ని ఇంకా ఉధృతం చేస్తాం.
 

                                                         

                                                          ఆటలు సాగనివ్వం !

6
                                                                               ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఛైర్మన్‌,
ఐఎన్‌టియూసి నాయకులు.
- మంత్రి రాజశేఖర్‌

కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కక్షగట్టింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల మనోభావాలను పట్టించుకోవడం లేదు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్‌ విషయంలోనూ ఏపీకి అన్యాయం చేసింది. ఎలాంటి సాయం చేయకపోగా స్టీల్‌ప్లాంట్‌ను మూసెయ్యాలని చూస్తోంది. ఆటలు సాగనివ్వం. ఎన్‌డిఏ ప్రభుత్వం ఒక్కపైసా కూడా ఎలాంటి సాయం చేయకపోగా, కేంద్రం ఇలాంటి పెద్ద భారీ పరిశ్రమను అమ్మేస్తాం.. మూసేస్తాం అనడం ద్రోహపూరిత చర్య అవుతుంది. సొంత గనులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడమే ఈ పరిస్థితికి కారణం. ప్రభుత్వ రంగంలో కొనసాగేలాగా పోరాటాన్ని ఉధృతం చేస్తాం. కార్పొరేట్‌లను విశాఖలో కాలుపెట్టనీయం. దేశంలోని ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేసేందుకు ప్రణాళికా బద్ధంగా కేంద్రంలోని బిజెపి సర్కారు వ్యవహరిస్తోంది. ఎన్‌డిఏ ప్రభుత్వం ఎప్పుడూ వ్యాపారులు, కార్పొరేట్‌లకు అనుకూలంగానే ఉంటోంది. రైతు ఉద్యమంలో ఎలాగైతే మోడీ క్షమాపణ చెప్పారో కార్మికులకూ చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా బిజేపి తప్ప అన్ని పార్టీలూ స్టీల్‌ప్లాంట్‌ ఉద్యమానికి మద్దతుగా నిలిచాయి. బిజెపి ప్రభుత్వం సామాన్యులకు ఎప్పుడూ మేలు చేయలేదు. కార్పొరేట్‌లు, ప్రైవేట్‌కు లాభం చేసే విధానాలే అనుసరిస్తుంది. రైతులు, కార్మికులను అవస్థలకు గురిచేస్తే ప్రభుత్వ పతనానికి ప్రభుత్వమే కారణమయ్యే పరిస్థితులను తెచ్చుకుంటుంది.

శాంతిశ్రీ
8333818985