Nov 08,2023 00:51

ప్రజాశక్తి - బాపట్ల
భారతదేశ వ్యవసాయ రంగంలో రైతు బాంధవునిగా ఆచార్య ఎన్‌జి రంగా ధన్యజీవిగా చరిత్రపుటల్లో చిరస్థాయిగా నిలిచారని సుప్రీం కోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి లావు నాగేశ్వరరావు అన్నారు. ఆచార్య ఎన్జీరంగా 123వ జయంతి సందర్భంగా రంగా ట్రస్ట్ నిర్వాహకులు రామినేని కిషోర్ ఆధ్వర్యంలో వ్యవసాయ కళాశాల విబి నాధ్ ఆడిటోరియంలో మంగళవారం నిర్వహించిన రంగా జయంతి సభకు ఆయన హాజరయ్యారు. నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆచార్య ఎన్‌జి రంగా ఆలోచనలను పరిగణలోకి తీసుకోవటం అంటే మొత్తం వ్యవసాయ రంగాన్ని గౌరవించడమే అవుతుందని అన్నారు. ఆచార్య రంగా అందించిన బలమైన నాయకత్వం వ్యవసాయ రంగాన ఆయన కీర్తిని అగ్రస్థాయిలో నిలబెట్టిందని అన్నారు. సుస్థిర వ్యవసాయానికి, అన్నదాతల అభివృద్ధికి రంగా చేసిన కృషి సాటిలేనిదని అన్నారు. సీనియర్ పార్లమెంటేరియన్‌గా దేశ చరిత్రలో ఆయనకు ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. అలాంటి మహోన్నత వ్యక్తి జీవిత చరిత్రను నేటితరం విద్యార్ధులకు తెలియ చేయాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయ కళాశాల విద్యార్థులు హాజరై ఉంటే బాగుండేదని అన్నారు. వ్యవసాయ రంగానికి అనుబంధ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఆచార్య ఎన్‌జి రంగా జీవితాన్ని అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎంఎల్‌ఎ కోన రఘుపతి మాట్లాడుతూ వ్యవసాయంతో ఎన్‌జి రంగా కున్న అనుబంధాన్ని గుర్తు చేశారు. కళాశాలలో నిర్వహిస్తున్న రంగా జయంతి వేడుకల్లో వ్యవసాయ విద్యార్థులు హాజరు కాకపోవడాన్ని గుర్తు చేశారు. ఈ సందర్భంగా జక్కంపూడి వారి కర్షక వేదం రంగాజీ రచనకు తెలుగు అనువాదాన్ని ఆవిష్కరించారు. సభలో మాజీ ఎంపీ ఎలమంచిలి శివాజీ, మాజీ మంత్రి వడ్డే శోభనాదీశ్వరరావు, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, నేస్తం వెంకటేశ్వరరావు, శాస్త్రవేత్తలు కిషోర్, నెక్కంటి సుబ్బారావు, కామేపల్లి కృషిబాబు, కొల్లా వీరయ్య చౌదరి, పాలడుగు సత్యనారాయణ, జి ప్రసాదరావు, తుమ్మల యుగంధర్, కుర్రా పుండరీకాక్షుడు, రంగా ట్రస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు.