ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్ : రైతు శ్రేయస్సే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పెనుకొండ సబ్ కలెక్టర్, ఇన్‌ఛార్జి జాయింట్ కలెక్టర్ కార్తీక్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లో జిల్లా వ్యవసాయ మండలి సమావేశం జరిగింది. అగ్రి బోర్డ్ చైర్మన్ ఆవుటాల రమణారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ జెడి సుబ్బారావు, కదిరి వ్యవసాయ పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సంపత్ కుమార్, సంబంధిత జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెసి కార్తీక్ మాట్లాడుతూ ఈ సమావేశంలో ప్రతిపాదించిన అంశాలన్నింటినీ కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ లో రైతులకు అవసరమైన పంటల సాగుకు సంబంధించి సూచనలు సలహాలు వ్యవసాయ సంబంధిత అధికారులు అందించాలన్నారు. ఈ క్రాప్ బుకింగ్ పకడ్బందీగా నమోదు చేయాలని నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. అగ్రి బోర్డు చైర్మన్ ఆవుటాల రమణారెడ్డి మాట్లాడుతూ, రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. పథకాలన్నీ రైతులకు చేరే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని ప్రత్యామ్నాయ పంటల సాగుకు అధికారులు విత్తనాలు సరఫరా చేయాలని సూచించారు. సూక్ష్మ సాగు నీటి పరికరాలు, బిందు వ్యవసాయానికి కావలసిన పరికరాలు రైతులకు అందించాలన్నారు. నూతన జిల్లాలో కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ఇందుకు 50 ఎకరాల ఎంపికకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. రైతు బజార్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయానికి విద్యుత్ సరఫరాను పగలు పూటే అందించాలన్నారు. ఈ నెలాఖరు వరకు కంది పంట వేసుకోవచ్చని వ్యవసాయ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవన అధికారి చంద్రశేఖర్, ఎపిఎంఐసి అధికారి సుదర్శన్, ద్వామా పీడీ రామాంజనేయులు, సిరికల్చర్ జేడీ పద్మమ్మ తదితరులు పాల్గొన్నారు.










