కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రోడ్లపై లక్షల మంది రైతులు యాభై రోజులుగా మోహరించి రైతాంగ ఉద్యమాల్లో సరికొత్త చరిత్ర లిఖించారు. అమెరికాలో 2011లో ఎగిసిపడ్డ 'వాల్‌స్ట్రీట్' మూవ్‌మెంట్ కంటే ఎన్నో రెట్లు పెద్దది ప్రస్తుత రైతు ఉద్యమం. చట్టాల అమలుపై సర్వోన్నత న్యాయస్థానం స్టే ఇచ్చినా, తాత్కాలిక నిలుపుదల కాదు. చట్టాల సమూల రద్దే లక్ష్యమని మరింత ఉధృతంగా రైతులు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. రైతుల ఉద్యమానికి మద్దతుగా భారతదేశ వ్యాప్తంగా ఊరేగింపులు, కేంద్ర సర్కారుకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి. కేరళలో కూడా అనేక రూపాలలో ఈ ఉద్యమానికి ప్రజలు సంఘీభావం తెలుపుతున్నారు. రాజ్యాంగంలో పొందుపర్చిన ఫెడరల్ సూత్రాలను బిజెపి ఉల్లంఘించిందంటూ కేరళ వామపక్ష ప్రభుత్వం తాను ఈ చట్టాలను సుప్రీంకోర్టులో సవాలు చేస్తానని ప్రకటించింది. కేంద్రం రైతుల ఉద్యమాన్ని సామ దాన భేద దండోపాయాలతో నీరుగార్చేందుకు యత్నించి విఫలమైన దరిమిలా, ప్రధాని మోడీ తరచు బయటికొచ్చి ప్రతిపక్షాలను నిందిస్తున్నారు. రైతులను తప్పు దారి పట్టిస్తున్నారని, రైతుల భుజాలపై తుపాకులు పెట్టి తమ ప్రభుత్వాన్ని కాల్చాలని చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. పనిలో పనిగా మోడీ, ఆయన మంత్రులు, బిజెపి నాయకులు, వామపక్ష ప్రభుత్వం అధికారంలో ఉన్న కేరళపై విరుచుకుపడుతున్నారు. కేరళలో వ్యవసాయోత్పత్తుల మార్కెట్ కమిటీలు (ఎపిఎంసి), మండీలు లేవని, కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) భావన ఆ రాష్ట్ర ప్రజల్లో ప్రబలంగా లేదని చెప్పుకొచ్చారు. ప్రధాని, బిజెపి నాయకులు కేరళ వ్యవసాయ దృష్టాంతాల ప్రాథమిక సత్యాలను చూడకుండా కావాలనే కళ్లు మూసుకున్నారు. కేరళలో ఎపిఎంసిలు, మండీలు లేని మాట నిజమే. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కాని విధంగా రైతుల సంక్షేమం కోసం కేరళ ఎల్‌డిఎఫ్ సర్కారు పూచీ పడింది. గిట్టుబాటు ధరలు పెంచడం, ప్రత్యక్షంగా వ్యవసాయ ఉత్పత్తులను సేకరించటం లాంటి విధానపరమైన చర్యలు చేపట్టడం ద్వారా దేశం లోని వ్యవసాయ విధానాలకు ఒక ప్రత్యామ్నాయాన్ని కేరళ చూపిస్తోంది.
కేరళ స్థూల వ్యవసాయ విస్తీర్ణంలో సగానికి పైగా ఆహారేతర పంటలే ఉంటాయి. కేరళలో నాలుగు దశాబ్దాలుగా వరుసగా ఏర్పడిన ప్రభుత్వాలు ఆహార పంటలను అభివద్ధి చేయడంపై దష్టి సారించాయి. ప్రధానంగా వరి పండించే వ్యవసాయ క్షేత్రాలను రక్షించడంపై కేంద్రీకరించాయి. పెరుగుతున్న సాగు ఖర్చుల నేపథ్యంలో ఆహార పంటలు తక్కువ లాభదాయకమనే ధోరణిని పక్కనపెట్టాయి. వరి పంటకు అనుకూలమైన భూములను వరి సాగుకు కేటాయించడమే కాకుండా వ్యవసాయానికి దోహదపడే అనేక ప్రోత్సాహకాలను కేరళ ప్రభుత్వం ప్రకటించింది. నాలుగు సంవత్సరాలుగా అధికారంలో ఉన్న ఎల్‌డిఎఫ్ సర్కారు వ్యవసాయ రంగానికి ప్రజల మద్దతును మరింతగా కూడగట్టింది. వరి సాగుదారులకు మద్దతు ధర కల్పించడం ఎంతో ముఖ్యం. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ సమగ్రమైన ప్రణాళిక ద్వారా, సాగుకు అయ్యే ఖర్చును, ప్రధాన పంటల ఉత్పత్తిని తరచుగా సేకరించిన సమాచారం ఆధారంగా అధ్యయనం చేస్తుంది. 2017-18 త్రైమాసికం ముగింపునకు వరి ఉత్పత్తికి అయిన ఖర్చును క్వింటాల్‌కు రూ.1,311గా ప్రకటించింది. 18 రాష్ట్రాలలో ఉత్పత్తి ఖర్చు విషయంలో సేకరించిన సమాచారం ప్రకారం కేరళ రాష్ట్రం రెండవ పెద్ద రాష్ట్రంగా ఉన్నది. అధికారిక గణాంకాలు ఉత్పత్తి ఖర్చులను తక్కువ అంచనా వేస్తున్నాయని పరిశోధకులతో పాటు రైతు సంఘాలు అభ్యంతరాలు లేవనెత్తుతున్నాయి. రైతులు పెట్టిన వాస్తవ పెట్టుబడులు, అధికారిక నివేదికలు తెలియజేసిన ధరల కంటే అధికంగా ఉన్నాయి.
అనేక కారణాల వల్ల కేరళలో అధిక పెట్టుబడులు ఉంటాయి. దానిలో ప్రధానమైనది వ్యవసాయ పనులుకై నియమించుకున్న వ్యవసాయ కార్మికులపై పెట్టే పెట్టుబడే వ్యవసాయ ఖర్చులో ఒక ప్రధాన భాగంగా ఉంటుంది. ఉత్పత్తికి అవసరమైన అధిక పెట్టుబడులు ఒకవైపు, కేంద్ర ప్రభుత్వం ద్వారా లభించే చాలీచాలని ఎంఎస్‌పి మరొకవైపు, కేరళలో ఉత్పత్తి ఖర్చు పెరగడానికి ఒక కారణం. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ఎంఎస్‌పి కంటే స్థిరమైన బోనస్‌ను రైతులకు పారితోషికంగా ఇస్తోంది కేరళ ప్రభుత్వం. ప్రస్తుతం ఈ బోనస్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కనీస మద్దతు ధర కంటే ఎక్కువ. 2017-18 సంవత్సరానికిగాను క్వింటాలు వరికి అయ్యే సగటు ఉత్పత్తి ఖర్చు రూ.1,616 కాగా కేంద్రం ప్రకటించిన ఎంఎస్‌పి రూ. 1550. కేరళలో ఖర్చు చేసిన ఉత్పత్తి ఖర్చు కంటే తక్కువ. కేరళ ప్రభుత్వం బోనస్‌గా క్వింటాలుకు రూ.780 ప్రకటించటం వల్ల, వరి పండించే రైతు తాను చేసిన సరాసరి వ్యయం కంటే 44 శాతం అదనంగా పొందుతున్నాడు. గత రెండేళ్లుగా కేరళ ప్రభుత్వం ధాన్యం సేకరణ ప్రణాళికను వికేంద్రీకరించి సంవత్సరానికి పండే పంటలో 80 శాతం సేకరిస్తోంది. దీనికి భిన్నంగా దేశం మొత్తంగా ధాన్యం సేకరణ రెండు మూడు రాష్ట్రాల నుండే జరుగుతోంది. వాటిలో ప్రధానంగా పంజాబ్, హర్యానా ఉన్నాయి. మద్దతు ధరలే కాకుండా వరి పండించే రైతులకు హెక్టారుకు రూ.2 వేల ఇన్సెంటివ్‌ను కేరళ ఇస్తోంది. 60 ఏళ్ల వయసు పైబడిన రైతులకు పింఛన్, రైతుల ఆత్మహత్యల నివారణకు ప్రత్యేకంగా రుణ ఉపశమన కమిషన్ వేసింది.
కేరళ వ్యవసాయ ఉత్పత్తులకు ఇచ్చే 'మద్దతు' వరి పంటకే పరిమితమై లేదు. ఎండు కొబ్బరికి కేంద్రం ఎంఎస్‌పి ప్రకటిస్తుండగా, దాని కంటే దేశంలోనే ఎక్కువ ధరపై రైతుల నుంచి కేరళ సేకరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యనే 16 రకాల కూరగాయలు, పండ్లకు దేశంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిగా మద్దతు ధరలు ప్రకటించింది. కిలో అరటి రూ.30, పైనాపిల్ 15, టమాటా 8, బీన్స్ 34, వెల్లుల్లి 139, కర్రపెండలం 12, బెండకాయలు రూ.20 కనీస ధరలను రైతులకు గ్యారంటీ చేసింది. పంటలకు గిట్టుబాటు ధర వచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం విధానపరంగానే వ్యవసాయ మార్కెట్లలో జోక్యం చేసుకుంటోంది. కేరళ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్, వివిధ రకాలైన కో-ఆపరేటివ్ సంస్థలతో పాటు, స్థానిక సంస్థలు వరి ధాన్యం సేకరణను సులభతరం చేస్తున్నాయి. ఈ విధానం వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ సామర్థ్యాన్ని విస్తత పరుస్తుంది. సేకరణ వ్యవస్థను మరింత ప్రజాస్వామ్యయుతం చేయడమే కాక పారదర్శకతను పెంపొందిస్తోంది. రాబోయే మార్కెటింగ్ సీజన్లలో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం, సహకార సంఘాలు ధాన్యాన్ని ప్రత్యక్షంగా కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేసింది. నూతనంగా కూరగాయలకు ప్రకటించిన కనీస మద్దతు ధర అమలుకు కో-ఆపరేటివ్స్ సహకారంతో నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. సెల్ఫ్ హెల్ప్ తరహాలో నెలకొల్పిన రైతు గ్రూపులను భాగస్వాములను చేసింది.
జాతీయ, అంతర్జాతీయ పరిస్థితుల రీత్యా వ్యవసాయ రంగంలో మరింత ఉత్పత్తిని పెంచడానికి, సాగును రైతులకు లాభదాయకంగా మార్చడానికి కేరళ అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోంది. కానీ కేరళ ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు భిన్నమైన విధానాలు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ కార్పొరేటీకరణకు, కాంట్రాక్టు సాగుకు తలుపులను బార్లా తెరిచి, వ్యవసాయ రంగం నుండి పూర్తిగా వైదొలిగే విధానాన్ని తలకెత్తుకుంది. దానికి కేరళ అనుసరించే విధానం పూర్తిగా వ్యతిరేకమైనది. ఇలాంటి సమగ్రమైన విధానాన్ని అనుసరించటం వలన, రైతుల కోసం నెలకొల్పిన స్వామినాథన్ కమిషన్ సిఫారసులకు అనుగుణంగా ఎంఎస్‌పిని అమలు చేస్తున్న రాష్ట్రంగా కేరళ ఉంది. రాష్ట్ర వనరులను నూతన మార్కెట్ యార్డుల కోసం, సేకరణ కేంద్రాల కోసం ఖర్చు పెడుతూ, గ్రామీణ మార్కెట్లకు అనుసంధానం చేస్తూ విస్తరించాలనే సమగ్రమైన లక్ష్యాన్ని కలిగి ఉంది. మార్కెటింగ్ విభాగాల్లో మధ్యవర్తుల జోక్యానికి ఎలాంటి అవకాశం ఇవ్వకపోవడం కేరళ విశిష్టత. కేరళ అనుసరిస్తున్న విధానం రైతాంగ సహకార సంస్థలను బలోపేతం చేయడమే కాక, ప్రభుత్వ ప్రోత్సాహకాలతో రాష్ట్రం లోని చిన్న, సన్నకారు, మధ్య తరగతి రైతాంగాన్ని సమన్వయం చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. కేంద్రం ప్రతిపాదిస్తున్న విధానాలకు భిన్నమైన, విశ్వసనీయమైన ప్రత్యామ్నాయాన్ని కేరళ ప్రభుత్వం అందిస్తోంది. దేశంలో బిజెపి పాలిత ఏ రాష్ట్రమూ కేరళ మాదిరి రైతుల సంక్షేమానికి పాటుపడిన దాఖలా లేదు. 2006లో బీహార్‌లో మండీలను ఎత్తేశాక రైతులెదుర్కొంటున్న అధ్వాన్న పరిస్థితులపై ప్రధాని ఒక్క మాటైనా చెప్పకపోవడం గమనార్హం. కొత్త చట్టాలొచ్చాక మధ్యప్రదేశ్‌లో 40 శాతం మండీల్లో లావాదేవీలు సున్నాగా నమోదయ్యాయి. ప్రతిపక్షాల పైనా, ప్రత్యేకించి కేరళ ఎల్‌డిఎఫ్ సర్కారు పైనా మోడీ రాజకీయ ఆరోపణలకు దిగింది కార్పొరేట్లను సంతృప్తి పర్చడానికేనన్నది స్పష్టం.
* కె.ఎస్.వి. ప్రసాద్, (వ్యాసకర్త సెల్ : 9490099019)










