
రైతు సంక్షేమాన్ని పట్టించుకోని ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ
- ఐదు రోజుల్లోగా కెసి కెనాల్‌కు నీరు తెప్పించాలి
- మాజీ మంత్రి భూమా అఖిలప్రియ
ప్రజాశక్తి - ఆళ్లగడ్డ
రైతన్నల సంక్షేమాన్ని ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ విస్మరించారని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ విమర్శించారు. గురువారం ఆళ్లగడ్డలోని స్థానిక కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి చూస్తుంటే చాలా బాధాకరంగా ఉందన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రభుత్వ తీరు చూస్తుంటే తెలంగాణకు మేలు చేసే విధంగా ప్రవర్తిస్తున్నట్లు అర్థమవుతుందన్నారు. ఎపి రావాల్సిన ఆస్తులు, నీళ్లు పక్క రాష్ట్రం వాళ్లు తీసుకుంటున్నా వైసిపి ప్రభుత్వం చోద్యం చూస్తుందే తప్ప ఒక్క మాట కూడా మాట్లాడడం లేదన్నారు. విద్యుత్ ఉత్పత్తి కోసం తెలంగాణ ప్రభుత్వం రిజర్వాయర్‌లో ఉన్న నీళ్లను ఖాళీ చేసినా నోరు కూడా మెదపకపోవడం బాధాకరమన్నారు. ఐఎబి సమావేశంలో ఆరుతడి పంటలు వేసుకోవాలని చెప్పిన అధికారులు ఆ పంటలకూ సాగునీరు ఇవ్వలేకపోతున్నారని అన్నారు. కెసి కెనాల్, తెలుగు గంగ కింద సాగునీరు రాక రైతులు ఆందోళన చెందుతుంటే స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ సాగునీటి సలహాదారులు ఏమి చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. రైతు సమస్యలపై ఇంత వరకు ఒక్క సమావేశం కూడా ఏర్పాటు చేయలేదన్నారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీలు కలెక్టర్‌తో మాట్లాడి ఐదు రోజుల్లోగా కెసి కెనాల్‌కు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తుంగభద్రలో ఉన్న నీటిని విడుదల చేస్తే రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ప్రజలకు పథకాలు ఇస్తే చాలా..? అభివృద్ధి వద్దా అని ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పట్టణంలో టిడ్కో గృహాలను ప్రారంభించారని, కేవలం కొంతమందికి పంపిణీ చేసి బిల్డప్ హంగామా చేశారని విమర్శించారు. సమావేశంలో కౌన్సిలర్ హుస్సేన్ భాష, సాగునీటి సంఘం మాజీ అధ్యక్షులు సిద్ధంరెడ్డి జాఫర్ రెడ్డి, కుందూరు రామిరెడ్డి, ఇంజేడు వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.