Oct 02,2023 00:35

విలేకర్లతో మాట్లాడుతున్న రైతు సంఘాల నాయకులు

ప్రజాశక్తి-గుంటూరు : ఢిల్లీ రైతు పోరాటంలో ముగ్గురు రైతులు, ఒక విలేకరిని హత్య చేసిన వారిని శిక్షించాలని కోరుతూ మంగళవారం బ్లాక్‌డే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రైతు సంఘాల నాయకులు ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం స్థానిక బ్రాడీపేటలోని రైతు సంఘం కార్యాలయంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి కంచుమాటి అజరుకుమార్‌, తెలుగు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కళ్లం రాజశేఖర్‌రెడ్డి, ఎఐటియసి జిల్లా కార్యదర్శి హనుమంతరావు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కొల్లి రంగారెడ్డి, రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి బి.నరసింహారావు, బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు సత్యనారాయణ మాట్లాడారు. రెండేళ్ల క్రితం ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌లో శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న రైతులపై కేంద్ర సహాయ మంత్రి అజరు మిశ్రా కుమారుడు అడ్డగోలుగా వెనుకనుండి జీపుతో తొక్కించి ముగ్గురు రైతులను ఒక జర్నలిస్టును హత్య చేశారన్నారు. ఈ మారణకాండపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయన్నారు. మంత్రిని వెంటనే సస్పెండ్‌ చేయాలని, మంత్రి కుమారుడిని వెంటనే శిక్షించాలని, చనిపోయిన రైతులు, జర్నలిస్టులకు ఎక్స్‌గ్రేసియా అందించాలని డిమాండ్లతో ఆందోళన చేస్తుంటే ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఈనెల మూడో తేదీన దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమం చేయాలని సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపునిచ్చిందని, రైతులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.