ప్రజాశక్తి - గరుగుబిల్లి : వైసిపి ప్రభుత్వానికి రైతుల సమస్యలు పట్టడంలేదని, రానున్న ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి వచ్చాక సమస్యలన్నీ పరిష్కరిస్తామని కురుపాం నియోజకవర్గం టిడిపి ఇంచార్జ్ తోయక జగదీశ్వరి అన్నారు. మండలంలోని తోటపల్లి పాత కుడి, ఎడమకాలువల ఆధునీకరణ పనులు, జంఝావతి కాలువ పనులను పర్యవేక్షించి సెల్ఫీ ఛాలెంజ్‌ను శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2019లో తోటపల్లి పాత కుడి, ఎడమ కాలువల ఆధునికీకరణ పనులు ప్రారంభించి సుమారు 30 శాతం పనులను టిడిపి చేయగా, మిగిలిన పనులను ఈ ప్రభుత్వం ఎందుకుపూర్తి చేయలేదని ప్రశ్నించారు. పనులు పూర్తి చేసి ఉంటే రైతులు రెండు పంటలు పండించి అభివృద్ధి చెందే వారన్నారు. ఆధునికీకరణ పనులు పేరు తో నాలుగేళ్లుగా రెండో పంటకు నీరు ఇవ్వకుండా రైతులను వైసిపి ప్రభుత్వం మోసగించిందని విమర్శించారు. అలాగే జంఝావతి పనులు పూర్తిచేసి చివరి ఆయకట్టు వరకు నీరు ఇచ్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తోటపల్లి అదనపు ఆయకట్టుకు సంబంధించి 2019 ఫిబ్రవరిలో తోటపల్లి, నాగూరు, చింతల బెలగాం లిఫ్టు ఇరిగేషన్ స్కీములకు, టిడిపి హయంలో తెచ్చిన జిఒ164ను వెంటనే అమలు చేసి పనులు ప్రారంభించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గజాలఖానా కూలి ఐదేళ్లయినా ఇంత వరకు మరమ్మతులు చేయలేదని విమర్శించారు. తక్షణమే నియోజకవర్గంలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షుడు అక్కేన మధుసూదనరావు, అరకు పార్లమెంట్ రైతు అధ్యక్షుడు దేవకోటి వెంకటనాయుడు, బిసి సెల్ రాష్ట్ర కార్యదర్శిమరడాన తవిటి నాయుడు, జిల్లా కార్యదర్శి ఎం బి.వివిజయాంకుశం,పెద్దింటి పూర్ణచందర్రావు, అరకు పార్లమెంట్ బీసీ సెల్ ఉపాధ్యక్షులు అంబటి తవిటి నాయుడు(రాంబాబు), జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షులు కోటభరత్ కుమార్), నియోజకవర్గం బీసీ సెల్ అధ్యక్షులు ఆర్నిపల్లి గంగాధర నాయుడు, పాలూరు శ్రీనివాసరావు, గొట్టాపు త్రినాథ్,తదితరులు పాల్గొన్నారు.
ఇరిగేషన్ ప్రాజెక్టులపై ప్రభుత్వం నిర్లక్ష్యం
పాలకొండ : ఇరిగేషన్ ప్రాజెక్టులపై ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతుందని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి నిమ్మక జయకృష్ణ అన్నారు. శనివారం స్థానిక టిడిపి కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. 2019లో తోటపల్లి పాత కుడి, ఎడమ కాలువల ఆధునీకరణ పనులు ప్రారంభించి 30శాతం పనుల వరకు అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేసినా మిగిలిన పనులు ఈ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయిందన్నారు. నాలుగేళ్లులో ఒక్కశాతం కూడా పని జరగలేదన్నారు. గత నాలుగేళ్లుగా రైతులకు నీరివ్వకుండా మోసం చేస్తున్నారన్నారు. ఉత్తరాంధ్రాలో ఎక్కడా ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాకుండా కాలయాపన చేస్తూ కాలం గడుపుతున్నారని విమర్శించారు. విలేకరుల సమావేశంలో టిడిపి కార్యదర్శి కర్నేన అప్పలనాయుడు, మండల పార్టీ అధ్యక్షులు గండి రామినాయుడు, ఏరియా ఆస్పత్రి మాజీ చైర్మన్ వెన్నపు శ్రీనివాసరావు, కిమిడి కాశీంనాయుడు, జాడ శ్రీధర్ తదితరులున్నారు.










