Nov 28,2022 23:51

కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేస్తున్న టిడిపి నాయకులు

ప్రజాశక్తి-అనకాపల్లి
తెలుగు రైతు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం స్థానిక కలెక్టరేట్‌ ముందు టిడిపి ఆధ్వర్యాన రైతాంగ సమస్యలపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి పార్లమెంట్‌ అధ్యక్షులు బుద్ధ నాగజగీశ్వరరావు మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయ మోటార్లకు విద్యుత్తు మీటర్లు బిగించి రైతాంగం నుంచి కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని, అదే పరిస్థితి అనకాపల్లి జిల్లాకు రానుందని, తక్షణమే ఈ ప్రతిపాదన విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. పంటకు గిట్టుబాటు ధర లేదని, పురుగుల మందులు ఎరువుల ధరలు విపరీతంగా పెరిగాయని, దీంతో రైతు ఆర్థికంగా అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.300 కోట్లు విలువ చేసే తుమ్మపాల సుగర్‌ ఫ్యాక్టరీని దివాలా సంస్థగా ప్రకటించి కాజేసేందుకు రాష్ట్ర మంత్రి అమర్నాథ్‌ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తెలుగు రైతు జిల్లా అధ్యక్షులు గొల్లవిల్లి శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు ముసలి నాయుడు, శ్రీనివాసరావు, పీరాపు కొండలరావు, కోడూరు సాంబశివరావు, కలింగ సన్యాసినాయుడు, కుచ్చు సత్తిబాబు, లెక్కల అవతార మూర్తి, అక్కిరెడ్డి రమణబాబు, గొంతిన నూకరాజు, గోకివాడ లోవ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
టిడిపి రైతు నేత రమణమూర్తి హౌస్‌ అరెస్టు
కశింకోట : రైతు సమస్యలపై కలెక్టర్‌ వద్ద ధర్నాకు వెళ్తున్న తెలుగు రైతు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉగ్గిన రమణమూర్తిని సోమవారం మండలంలోని పరవాడపాలెంలో ఆయన స్వగృహంలో పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు.