Jun 29,2023 22:28

గుంటూరులో పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న నాయకులు

ప్రజాశక్తి - గుంటూరు : రైతులు, కౌలురైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, వాటి పరిష్కారం కోసం విజయవాడలో శుక్రవారం చేపట్టే మహాధర్నాను జయప్రదం చేయాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.అజరుకుమార్‌ పిలుపునిచ్చారు. ఈ మేరకు బ్రాడీపేటలోని సంఘం కార్యాలయంలో గురువారం పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ వ్యవసాయంలో పెట్టుబడులు విపరీతంగా పెరిగినా పంటలకు మద్దతు ధరలు మాత్రం లేకపోవడంతో రైతు కుటుంబాలు అప్పుల పాలవుతున్నాయని ఆవేదన వెలిబుచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల విత్తనాలు దగ్గర నుంచి మార్కెట్‌ వ్యవస్థ వరకు రైతు దగా పడుతున్నారని, కల్తీ, నకిలీ విత్తనాలు ఒకవైపు మరొకవైపు ప్రభుత్వ సబ్సిడీలు సరిగా అందకపోవటం, శాస్త్రవేత్తలకే అర్థం కాని రకరకాల వైరస్‌లు చీడపీడలతో పంటలన్నీ దెబ్బతింటున్నాయని చెప్పారు. ఈ పరిస్థితిని అధిగమించడానికి కేరళ తరహాలో పంటకు అదనంగా 50 శాతం ఆదాయం వచ్చేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇతర దేశాల్లో రైతులకు 50 నుంచి 80 శాతం వరకు వివిధ రూపాల్లో సబ్సిడీలను అక్కడి ప్రభుత్వాలు అమలు చేస్తుండగా ఇండియాలో మాత్రం 2 శాతమే ఇస్తున్నారని, అదికూడా సరిగా అమలు కావడం లేదని విమర్శించారు. పాడిపంటలు రెండూ సముపాళ్లలో గిట్టుబాటు అయితేనే రైతు కుటుంబాలు బాగుంటాయని, అది దేశాభివృద్ధికీ తోడ్పడుతుందని అన్నారు.
సహకార రంగాన్ని దెబ్బతీసే విధంగా ప్రైవేటు, కార్పొరేట్‌ సంస్థలకు సహకారం సంఘాలను కేంద్ర ప్రభుత్వం అప్పగిస్తోందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం సహకార రంగాలను ప్రోత్సహించి ఆదుకోవాల్సి ఆదుకోవాల్సింది పోయి, గుజరాత్‌ అమూల్‌ డెయిరీని తెచ్చి ఈ రంగంలో వచ్చే లాభాలను పాడి రైతులు అందకుండా గుజరాత్‌కు తరలేలా వ్యవహరించడం దారుణమన్నారు. జిల్లాలో ఉన్న సంగం డెయిరీని సహకార రంగంలో కొనసాగిస్తూ ఎన్నికలు నిర్వహించాలన్నారు. సహకారంగాలను దెబ్బతీస్తే భవిష్యత్తులో కల్తీ పాలు తయారై ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీసే ప్రమాదం ఉందరి హెచ్చరించారు. గుంటూరు రూరల్‌ మండలం జొన్నలగడ్డలో ఎర్రవాగుతో ముంపు, కొండవీటి వాగు ముంపుతో వేలాది ఎకరాలు పంటలు దెబ్బతింటున్నాయని, వీటికి శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్‌ చేశారు. సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న గుంటూరు ఛానల్‌ పొడిగింపు సమస్యను ప్రభుత్వం సత్వరం పరిష్కరించకుంటే ఐక్య కార్యాచరణతో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. గుంటూరు ఛానల్‌తోపాటు ఇతర పంట కాల్వల్లో పూడికతీత, తూటికాడను తొలగింపు పనులు చేయిస్తే నీరు సరిగా పారుదై పొలాలకు చేరుతుందన్నారు. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం వలన ఆ నీరు పంట పొలాలుగా చేరి పంటలు దెబ్బతింటున్నాయని, ఈ సమస్యకూ శ్వాశత పరిష్కారం చూపాలని కోరారు. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్ల బిగించే చర్యలను మానుకోవాలన్నారు. ఈ సమస్యలన్నింటిపైనా విజయవాడలో అలంకార్‌ థియేటర్‌ సెంటర్లో జరిగే మహాధర్నాకు రైతులు, కౌలు రైతులు అధికసంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు ఐ.రామారావు, ఆది నికల్సన్‌, కృష్ణకాంత్‌, ఎ.కల్యాణి పాల్గొన్నారు.
ప్రజాశక్తి - పెదనందిపాడు : మహా ధర్నా జయప్రదం కోసం ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం ఆధ్వర్యంలో పెదనందిపాడులో ఆటో ప్రచార జాతాను నిర్వహించారు. సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కొత్త వెంకటశివరావు, రైతు ఐక్యవేదిక నాయకులు కుర్రా హరిబాబు, రైతు సంఘం సీనియర్‌ నాయకులు కన్నెగంటి చంద్రరావు మాట్లాడారు. ఈ ఏడాది అకాల వర్షాలు, అధిక వర్షాలు వల్ల దెబ్బతిన్న పంటలకు వెంటనే ఇన్పుట్‌ సబ్సిడీని ఇవ్వాలని, సమగ్ర పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఎంఎస్‌ స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసుల ప్రకారం కనీసం మద్దతు ధరలు చట్టం తేవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చిన విధంగా పాడి రైతులకు లీటరుకు రూ.4 బోనస్‌ విడుదల చేయాలని, సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించి త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. భూ యజమాని సంతకంతో సంబంధం లేకుండా కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, పంట రుణాలు ఇవ్వడంతోపాటు రాయితీలు, సబ్సిడీలు, రైతు భరోసా, ఇతర పథకాలను కౌల్దార్లకు వర్తింపజేయాలని కోరారు. ఈ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు చేపట్టిన మహాధర్నాను రైతులు, కౌలురైతులు జయప్రదం చేయాలని కోరారు. ఈ సందర్భంగా పెదనందిపాడు మండలంలోని ఉప్పలపాడు, జరుగులవారిపాలెం, మిట్టపాలెం, అన్నవరం, పరిటాలవారిపాలెం, పాలపర్రు, రాజుపాలెం, పెదనందిపాడు, నాగులపాడు, వరగాని, అన్నపర్రు, ఏబీ పాలెం, జిజి పాలెం, రావిపాడు, గోగులమూడి, కట్రపాడు, కాకుమాను మండలంలోని కొమ్మూరు, గార్లపాడు, పెద్దవారిపాలెం గ్రామాలలో ప్రచారం చేశారు. గ్రూప్‌ మీటింగులతోపాటు కరపత్రాలు పంపిణీ చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు, సిఐటియు జిల్లా నాయకులు కాకుమాను నాగేశ్వరరావు, రైతు సంఘం నాయకులు జంపని రామారావు, చుక్కా యానాదులు, రావి శివరామకృష్ణయ్య, నల్లమోతు రాజేంద్ర, పసుపులేటి శేషగిరిరావు, మండవ సింగయ్య పాల్గొన్నారు.
ప్రజాశక్తి - కొల్లిపర : అన్ని పంటలకూ మద్దతు ధరలు ప్రకటించాలని రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎం.శివసాంబిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ధర్నా జయప్రదం కోసం వల్లభాపురం, మున్నంగి, శివలూరు, అత్తోట గ్రామాల్లో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వడ్డీ రాయితీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, సున్నా వడ్డీని రూ. రెండు లక్షలకు, పావలా వడ్డీని రూ.ఐదు లక్షలకు పెంచాలని కోరారు. కార్యక్రమంలో తెనాలి వీరయ్య, పరిమి ప్రకాష్‌రావు, సికాపల్లి లాజరు, దర్శి బర్నబా, సుబ్బారెడ్డి పాల్గొన్నారు.