Sep 17,2023 23:23

మాట్లాడుతున్న అజరుకుమార్‌

ప్రజాశక్తి - మంగళగిరి : అతివృష్టి, అనావృష్టి కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు జొన్న శివశంకరరావు డిమాండ్‌ చేశారు. రైతు సంఘం మండల సమావేశం స్థానిక సంఘం కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. సమావేశానికి ఎం.ఫకీరయ్య అధ్యక్షత వహించగా శివశంకరరావు మాట్లాడుతూ పంట దిగుబడులు తగ్గి, మద్దతు ధర దక్కక రైతులు అప్పుల పాలవుతున్నారని చెప్పారు. వీరిని ఆదుకునేందుకు రుణమాఫీ చట్టం చేయాలని, పంటల బీమా పథకాన్ని పాత పద్ధతిలో అమలు చేయాలని కోరారు, రాజధానికి భూమిలిచ్చిన రైతులకు వెంటనే కౌలు చెల్లించాలని, ప్లాట్లు రిజిస్ట్రేషన్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కొండవీటి వాగులో గుర్రపుడెక్కను తొలగించాలన్నారు. ఈ అంశాలపై తహశీల్దార్‌ కార్యాలయం వద్ద 25న చేసే ధర్నాలో రైతులు, ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. వచ్చేనెల 3న కేంద్ర ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక విధానాలకు నిరసనగా బ్లాక్‌ డే నిర్వహించాలని, ఈనెల 22, 23 తేదీల్లో తెనాలిలో జరిగే రైతు సంఘ జిల్లా శిక్షణా తరగతులను జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో సంఘం మండల కార్యదర్శి ప్రసాద్‌రెడ్డి, నాయకులు సాంబిరెడ్డి, జానారెడ్డి, బ్రహ్మారెడ్డి, నాగేశ్వరరావు పాల్గొన్నారు.
ప్రజాశక్తి - పెదనందిపాడు : వ్యవసాయ రంగ సమస్యలపై స్థానిక తేళ్ల నారాయణ విజ్ఞాన కేంద్రంలో రైతు సంఘం, కౌలు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మండల విస్తృత సమావేశం ఆదివారం నిర్వహించారు. సమావేశానికి రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కె.వెంకటశివరావు అధ్యక్షత వహించారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.అజరుకుమార్‌ మాట్లాడుతూఖరీఫ్‌ సీజన్‌ సెప్టెంబర్‌తో ముగుస్తుండగా ఇప్పటివరకు రైతు భరోసా కేంద్రాల్లో విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పనిముట్లు వంటివి అందించిన దాఖలాలు లేవని అన్నారు. నాగార్జునసాగర్‌ నుండి నీరు విడుదల చేయకపోవడంతో సాగు విస్తీర్ణం సగానికి తగ్గిపోయిందని, నీరు లేక ఏ పంట వేయాలో తెలీక రైతులు అయోమయంలో ఉన్నారని ఆందోళన వెలిబుచ్చారు. వ్యవసాయ అధికారులు కూడా ఏ పంటలు వేయాలో చెప్పలేని పరిస్థితిలో ఉన్నారన్నారు. ఆరేళ్ల నుండి పంటలు సరిగా పండక పోవడం వల్ల రైతుల ఆత్మహత్యలు పెరిగిగాయని, ఈ పరిస్థితుల్లో రుణమాఫీ జరిగితేనే రైతులు వ్యవసాయాన్ని కొనసాగించగలుగుతారని చెప్పారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించి ఉచిత విద్యుత్తును ఎత్తివేసేందుకు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన విద్యుత్‌ సవరణ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిందని, దీనిని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు, భూ యజమాని సంతకంతో సంబంధం లేకుండా కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, బ్యాంకు రుణాలు, సబ్సిడీలు అందించాలన్నారు. నాగార్జునసాగర్‌ ఆయకట్టు పరిధిలో ఉన్న మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి ప్రత్యామ్నాయ వ్యవసాయ ప్రణాళికలు రూపొందించాలని, రబీలో పంటలు వేసేందుకు 90 శాతం సబ్సిడీతో విత్తనాలు, ఎరువులు అందించాలని డిమాండ్‌ చేశారు, ఉపాధి హామీ పథకంలో అదనంగా వంద రోజులు పనులు చూపించాలని, వ్యవసాయ కార్మికుల జీవనోపాధికి ప్రతి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సాయం చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా ప్రతి పాడి రైతుకు లీటరుకు రూ.4 బోనస్‌ను వెంటనే విడుదల చేయాలన్నారు. వెంకటశివరావు మాట్లాడుతూ గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగింపునకు అవసరమైన భూసేకరణకు వెంటనే నిధులు కేటాయించి పనులు పూర్తి చేయాలని కోరారు. రైతు సమస్యలపై 20, 21వ తేదీలలో రైతు భరోసా కేంద్రాల వద్ద ఆందోళనలు చేస్తామని, 25న తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా చేస్తామని, రైతులు అధికంగా పాల్గొనాలని కోరారు. సమావేశంలో గుంటూరు ఛానల్‌ సాధన సమితి నాయకులు కె.హరిబాబు, కౌలు రైతు సంఘం నాయకులు కె.శివనాగేశ్వరరావు, సిఐటియు నాయకులు డి.రమేష్‌బాబు, రైతు సంఘం మండల అధ్యక్షులు ఎం.వెంకటేశ్వర్లు, జె.రామారావు, కె.శ్రీనివాస రావు, సిహెచ్‌.యానాదులు, సిహెచ్‌.సురేంద్ర, పి.శేషగిరి రావు, బి.భోగేశ్వరరావు, జి.అమ్మయ్య పాల్గొన్నారు.