జాయింట్ కలెక్టర్ శివ శ్రీనివాస్
ప్రజాశక్తి -అడ్డతీగల
ఏజెన్సీలోని గిరిజన రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై సచివాలయ సిబ్బంది దృష్టి సారించి వెంటనే పరిష్కరించాలని అల్లూరి సీతారామరాజు జిల్లా జాయింట్ కలెక్టర్ శివ శ్రీనివాస్ ఆదేశించారు. మంగళవారం మండలంలోని బొడ్లంక గ్రామ సచివాలయాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు అనంతరం గ్రామస్తులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం కోత దశలో ఉన్న వరి పంటను ప్రభుత్వం మద్దతు ధర చెల్లించి దళారుల ప్రమేయం లేకుండా రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తుందని, ఈ అవకాశాన్ని రైతులంతా వినియోగించుకోవాలని సూచించారు. అమ్మిన పంటకు డబ్బులను ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాలోనే జమ చేస్తున్నట్లు చెప్పారు. మ్యూటిషన్ విధానాన్ని సద్వినియోగం చేసుకొని పట్టాదారు పాస్ పుస్తకాలు పొందాలన్నారు. గిరిజన రైతులంతా సమగ్ర భూ సర్వేకు సహకరించి తమ భూముల హద్దులను ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేయించుకోవాలని సూచించారు. అనంతరం సచివాలయంలో జరుగుతున్న కార్యక్రమాలు, సిబ్బంది పనితీరుపై తహశీల్దారు శ్రీనివాస్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బోనం రాఘవ వీఆర్వో వెంకయ్యమ్మ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.










