ప్రజాశక్తి - పల్నాడు జిల్లా కరస్పాండెంట్ : రైతు సమస్యల పరిష్కారం కోసం విజయవాడలో 30న నిర్వహించే మహాధర్నాను జయప్రదం చేయాలని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఈ మేరకు వాల్‌పోస్టర్లను స్థానిక కోటప్పకొండ రోడ్డులోని సంఘం జిల్లా కార్యాలయంలో మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ గతేడాది అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయని, బాధిత రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, పంటల బీమాను వెంటనే చెల్లించాలని కోరారు. పెట్టుబడులు పెరిగిన నేపథ్యంలో ఇన్‌పుట్ సబ్సిడీ ఆహార పంటలకు ఎకరాకు రూ.10 వేలు, వాణిజ్య పంటలకు రూ.25 వేలకు పెంచాలన్నారు. పావలా వడ్డీ, సున్నా వడ్డీ పథకాలకు కొన్నేళ్లుగా ఆపిన నిధులు వెంటనే చెల్లించాలని, సున్నా వడ్డీ రూ.2 లక్షలకు, పావలా వడ్డీ రూ.5 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పంటల మద్దతు ధర కనీసం పెట్టుబడులకు కూడా చాలడం లేదని, కేరళ ప్రభుత్వం క్వింటాళ్ ధాన్యానికి కేంద్ర మద్దతు ధరకు అదనంగా రూ.800 ఇస్తోందని, కర్ణాటక, ఛత్తీస్‌ఘడ్, తమిళనాడు రాష్ట్రాలు కొంత అదనంగా కలిపి ఇస్తున్నారని తెలిపారు. ఇదే తరహాలో ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇవ్వాలన్నారు. సాగు నీటి ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేసి సాగు, తాగు నీటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వ అవసరాలకు సేకరించే భూములకు పరిహారం ప్రస్తుత రేట్లు ప్రకారం చెల్లించాలని, చుక్కల భూములు రాష్ట్రంలో 24 లక్షల ఎకరాలకు గాను 2 లక్షల ఎకరాలకే పరిష్కారం లభించిందని, మిగతా చుక్కల భూములు సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ బోర్లకు మీటర్ల ప్రక్రియను నిలిపేయాలని, కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశాలపై విజయవాడలో తలపెట్టిన ధర్నాకు రైతులు, కౌలురైతులు తరలిరావాని కోరారు. కార్యక్రమంలో రైతు సంఘం పల్నాడు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జి.బాలకృష్ణ, ఏపూరి గోపాలరావు, సీనియర్ నాయకులు గద్దె చలమయ్య కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వై.రాధాకృలష్ణ, కె.ఆంజనేయులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎ.లక్ష్మీశ్వరరెడ్డి, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి జి.రవిబాబు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గుంటూరు విజరు కుమార్, శ్రామిక మహిళా నాయకులు డి.శివకుమారి, జి.మల్లేశ్వరి, ఫాతిమా, సిహెచ్.సురేష్‌రాజా, ఆర్.మునివెంకటేశ్వర్లు, సత్యనారాయణ, కె.ఆశీర్వాదం పాల్గొన్నారు.
ప్రజాశక్తి - మంగళగిరి రూరల్ : ధర్నా జయప్రదం కోసం మండలంలోని ఎర్రబాలెం, నిడమర్రు, కురగల్లులో ప్రచారం చేపట్టారు. రైతు సంఘ గుంటూరు జిల్లా అధ్యక్షులు జొన్న శివశంకర్ మాట్లాడారు. నాయకులు కె.ఈశ్వరరెడ్డి, ఎ.వీర్లంకయ్య, ఎస్‌కె ఎర్రపీరు, జి.నాగేశ్వరరావు, గణేష్ పాల్గొన్నారు.
ప్రజాశక్తి-తాడేపల్లి : మహాధర్నాకు రైతుల పెద్దఎత్తున తరలిరావాలని రైతు సంఘం మండల అధ్యక్షులు కె.ఈశ్వరరెడ్డి కోరారు. పెనుమాకలో రైతులతో నిర్వహించిన గ్రూపు సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్‌కె పీరూసాహెబ్ పాల్గొన్నారు.
ప్రజాశక్తి తెనాలి : మండలంలోని కొలకలూరు, నందివెలుగు, ఐతానగర్ సెంటర్‌లో రైతు సంఘం నాయకులు ప్రచారం చేశారు. జిల్లా ఉపాధ్యక్షులు ఎం.శివసాంబిరెడి మాట్లాడారు జి.శంకర్రావు, నాగరాజు, సుబ్బారావు, పాండురంగరావు, ఎం.శివారెడ్డి పాల్గొన్నారు.










