Jun 22,2023 00:47

సమావేశంలో మాట్లాడుతున్న వి.కృష్ణయ్య

ప్రజాశక్తి - పెదనందిపాడు :రైతుల, కౌలు రైతుల సమస్యలు పరిష్కారం కోసం ఈనెల 30న విజయవాడలో జరిగే మహాధర్నా జయప్రదం చేయాలని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య పిలుపునిచ్చారు. సంఘం కాకుమాను, పెదనందిపాడు మండలాల విస్తృత సమావేశం మండల కేంద్రమైన పెదనందిపాడులోని స్థానిక తేళ్ల నారాయణ విజ్ఞాన కేంద్ర వద్ద బుధవారం నిర్వహించారు. సమావేశానికి జిల్లా సహాయ కార్యదర్శి కొత్త వెంకటశివరావు అధ్యక్షత వహించగా కృష్ణయ్య మాట్లాడుతూ రైతులకు సమగ్ర పంటల బీమా పథకం అమలు చేయాలని, ఇన్పుట్‌ సబ్సిడీ అందించాలని డిమాండ్‌ చేశారు. అన్ని పంటలకూ మద్దతు ధరలు కల్పించాలన్నారు. కల్తీ విత్తనాలను అరికట్టాలని, వ్యవసాయ బోర్లకు మీటర్లు పెట్టే విధానాన్ని రద్దు చేయాలని, పాడి రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వాలు ఎన్ని మారినా ఎంఎస్‌ స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసులు అమలుకు చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తొమ్మిదేళ్లలో నాలుగు లక్షల మంది పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో చేసిన పోరాట స్ఫూర్తితో సమస్యలపై రైతులు ఉద్యమించాలన్నారు. సంఘం జిల్లా కార్యదర్శి కె.అజరు కుమార్‌ మాట్లాడుతూ రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారని, వారిని ఆదుకోకుంటే దేశ ఆహార భద్రతకే ముప్పని చెప్పారు. అనంతరం రైతు సంఘం బాపట్ల జిల్లా ఉపాధ్యక్షులు బి.శంకరయ్య రైతు సంఘాల ఐక్యవేదిక నాయకులు కె.హరిబాబు మాట్లాడారు. నాయకులు కె.చంద్రరావు, సిహెచ్‌.యానాదులు, సిహెచ్‌.సురేంద్ర, పి.రాంబాబు, జి.వీరయ్య చౌదరి, షేక్‌ సుభాని, ఎన్‌.వంశి, కె.బాబు పాల్గొన్నారు.