Mar 03,2023 01:10
సరిహద్దు రాళ్లను వేయిస్తున్న ఆర్‌డిఒ రవీందర్‌

ప్రజాశక్తి-మార్టూరు రూరల్‌: జగనన్న భురక్ష, భూ హక్కు పథకాలతో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న రైతాంగ భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసమే ప్రభుత్వం భూముల రీ సర్వే ప్రక్రియ చేపట్టిందని బాపట్ల ఆర్‌డిఒ జి రవీందర్‌ అన్నారు. మండల పరిధిలోని కోలలపూడి గ్రామంలో భూములకు సరిహద్దు రాళ్లను ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని గురువారం ఆర్‌డిఒ ప్రారంభించారు. అనంతరం ఆయన స్థానిక రైతులు, అధికారులతో మాట్లాడుతూ.. వంద సంవత్సరాల క్రితం బ్రిటిష్‌ పాలనలో జరిగిన భూముల సర్వే అనంతరం దేశంలోనే మొట్ట మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో రీ సర్వే జరగటం చరిత్రాత్మకం అని అన్నారు. కోలలపూడి గ్రామంలో 3,547 ఎకరాల భూమి రీ సర్వే పూర్తి చేయటం జరిగిందని 1,817 మంది రైతులకు గాను, 1,317 మంది రైతులకు భూ హక్కు పత్రాలు పంపిణీ చేసినట్లు ఆర్‌డిఒ తెలిపారు. భూముల రీ సర్వే అనంతరం సర్వే సిబ్బంది ఏర్పాటు చేసే సరిహద్దు రాళ్లే ప్రామాణికమని, అధికారులకు తెలియకుండా ఎవరైనా రాళ్లను తొలగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అనంతరం సరిహద్దు రాళ్లు ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని ఆర్‌డిఒ పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మార్టూరు ఇన్‌ఛార్జి తహశీల్దార్‌ వెంకటరెడ్డి, ఆర్‌ఐ రహమాన్‌ బాషా, సర్వేయర్‌ ఏడుకొండలు, రీ సర్వే డిప్యూటీ తహశీల్దార్‌ శ్రీహర్ష, రెవెన్యూ, సచివాలయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.