రైతు రుణమాఫీపై రాష్ట్రవ్యాప్త ఉద్యమం
రైతుసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మర్రాపు సూర్యనారాయణ
ప్రజాశక్తి-శ్రీకాళహస్తి: రాష్ట్రంలోని రైతులకు రుణమాఫీ చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మర్రాపు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. రుణమాఫీపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి శ్రీకారం చుడతామని తెలిపారు. సిఐటియూ కార్యాలయంలో ఆదివారం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తిరుపతి జిల్లా కమిటీ సమావేశం జరిగింది. మర్రాపు సూర్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులకు పెట్టుబడులు పెరిగి, గిట్టుబాటు ధరలు లేక, అప్పుల ఊబిలో కూరుకుపోయారన్నారు. రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే రైతు రుణమాఫీ పథకాన్ని ప్రవేశపెట్టి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కేవలం 40 మంది కార్పొరేట్లకు రూ.14 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన కేంద్ర ప్రభుత్వం, 13 కోట్ల మంది రైతులకు నాలుగు లక్షల కోట్ల రూపాయల రుణాన్ని ఎందుకు మాఫీ చేయరని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా రైతులు అనేక సంక్షోభాల్లో కూరుపోయారనీ, వ్యవసాయ రంగాన్ని గట్టున పడేయడానికి రైతు రుణమాఫీ పథకం ఒక్కటే ఆధారమని తెలిపారు. తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి రైతు రుణమాఫీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు దాసరి జనార్ధన్, ఉపాధ్యక్షుడు వందవాసి నాగరాజు హేమలత, అల్లెయ్య, జోగి శివకుమార్, ధనుంజయలు, బత్తెమ్మ ,వరలక్ష్మి, శంకరయ్య, ముని శంకర్, బత్తెయ్య తదితరులు పాల్గొన్నారు.










