Mar 03,2023 22:26

రుణాలు మాఫీ చేసి సమగ్ర పంటల బీమా అమలు చేయాలి
ఏప్రిల్‌ 5న చలో ఢిల్లీకి రైతాంగం తరలిరావాలి - ఎపి రైతుసంఘం
ప్రజాశక్తి - ఏలూరు

              కేంద్ర ప్రభుత్వం రైతు రుణ విమోచన చట్టం తెచ్చి రైతుల పంట రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. స్థానిక అన్నే భవనంలో సంఘం జిల్లా కమిటీ సమావేశం జిల్లా సహాయ కార్యదర్శి కట్టా భాస్కరరావు అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. జిల్లాలోని పలు రైతాంగ సమస్యలు చర్చించి తీర్మానాలు ఆమోదించారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఏప్రిల్‌ 5 నిర్వహిస్తున్న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్పొరేట్‌ కంపెనీలకు రుణాలు మాఫీ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం రైతుల రుణాలు ఎందుకు మాఫీ చేయడం లేదని ప్రశ్నించారు. వ్యవసాయ నష్టాలతో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని చెప్పారు. ఢిల్లీ రైతాంగ ఉద్యమం సందర్భంగా మోడీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించిందని విమర్శించారు. సమగ్ర పంటల బీమా పథకం అమలు చేయాలని కోరారు. మెట్టప్రాంత రైతాంగానికి సాగునీరు అందించే చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని తక్షణమే పూర్తి చేయాలని కోరారు. గ్రీన్‌ఫీల్డ్‌ హైవే భూనిర్వాసిత రైతులకు, చింతలపూడి ఎత్తిపోతల పథకం భూనిర్వాసిత రైతులకు ప్రయివేటు మార్కెట్‌ ధర ప్రకారం పరిహారం చెల్లించి ఆదుకోవాలన్నారు. వ్యవసాయానికి అప్రకటిత విద్యుత్‌ కోతలు ఆపాలన్నారు. గోదావరి ఆయకట్టు పరిధిలో శివారు ప్రాంత భూములకు సాగునీరందేలా చర్యలు చేపట్టాలన్నారు. కొబ్బరి కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఖరీఫ్‌ ధాన్యం బకాయిలు పూర్తిగా చెల్లించాలని కోరారు. జిల్లాలోని రైతాంగ సమస్యలపై దశలవారీ ఆందోళన చేపడుతున్నామని చెప్పారు. ఈ ఆందోళనల్లో రైతాంగం భాగస్వాములు కావాలని కోరారు. సమావేశంలో రైతుసంఘం జిల్లా సహాయ కార్యదర్శి బొడ్డు రాంబాబు, జిల్లా కమిటీ సభ్యులు సున్నా వెంకట్రావు, అనుమోలు మురళీ, వెజ్జు శ్రీరామచంద్రమూర్తి, గండి రాజా, ఎన్‌.శేషగిరిరావు పాల్గొన్నారు.