
రైతు రాజ్యం అంటే ఇదేనా..?
- చివరి ఆయకట్టు వరకూ సాగునీరివ్వాలి
- కలెక్టరేట్ ఎదుట మాజీ మంత్రి అఖిలప్రియ ఆధ్వర్యంలో రైతుల నిరసన - జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేత
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
'రైతన్న రాజ్యం అంటే ఇదేనా..? రైతును రాజు చేస్తామని చెప్పడమంటే ఇదేనా..? జిల్లా వ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, వైసిపి నాయకులు వున్నా సాగు నీటిపై ఎందుకు మాట్లాడలేక పోతున్నారు..?' అని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ప్రశ్నించారు. మంగళవారం ఆళ్లగడ్డ నియోజకవర్గం రైతులు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆధ్వర్యంలో భారీ ఎత్తున కలెక్టరేట్‌కు తరలివచ్చి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా భూమా అఖిల ప్రియ మాట్లాడుతూ రైతన్నల ఆత్మహత్యల్లో మొదటి స్థానం పులివెందుల ఉందని తెలిపారు. నంద్యాల జిల్లాలో కరువు తాండవించడంతో ప్రజలు బతుకుదెరువుకోసం వలసలు వెళుతున్నా వైసిపి నాయకులకు కనిపించడం లేదని ఏద్దేవా చేశారు. తుంగభద్ర నుంచి కెసి కెనాల్‌కు వచ్చే వాటా 2.8 టిఎంసిల నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చివరి ఆయకట్టు వరకు సాగునీరు ఇవ్వాలని, కెసి కెనాల్ పరిధిలోని సాగు చేసుకున్న పంటలకు కూడా నీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని కెసి కెనాల్ కింద జొన్న, మినుము, పత్తి, శనగ, మిరప తదితర పంటలు సాగు చేశారని తెలిపారు. అయితే వార బందీ కింద సాగు నీరు ఇస్తున్నా చివరి ఆయకట్టు వరకు రావడం లేదన్నారు. దీనివల్ల పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం వస్తున్న కెసి కెనాల్ నీరు ఐదు రోజులు కాకుండా పది రోజులు వరకు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తుంగభద్ర వరద నీరు కూడా కెసి కెనాల్‌కే రావాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో భూమా బ్రహ్మానంద రెడ్డి, చింతకుంట జాఫర్ రెడ్డి, కాటం రెడ్డి శ్రీకాంత్ రెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.
