Sep 07,2023 22:50

ఇకెవైసి, పంటల నమోదును పరిశీలిస్తున్న జిల్లా వ్యవసాయ శాఖాధికారి ఐ. మురళి

ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : ఖరీఫ్‌లో రైతులు సాగుచేస్తున్న ప్రతి పంటనూ ఈ-పంట యాప్‌లో నమోదు చేయాలని సిబ్బందిని పల్నాడు జిల్లా వ్యవసాయ శాఖాధికారి ఐ.మురళి ఆదేశించారు. నరసరావుపేట మండలం పాలపాడులోని రైతు భరోసా కేంద్రాన్ని ఆయన గురువారం సందర్శించారు. ఈ-క్రాప్‌ నమోదు తీరును పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం రైతులతో మాట్లాడుతూ ఈ-క్రాప్‌ నమోదు వల్ల రైతులకు ఎంతో ఉపయోగమన్నారు. ప్రకృతి విపత్తులు, తెగుళ్లతో పంట నష్టపోతే వైఎస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా ద్వారా పరిహారం అందుతుందని చెప్పారు. వడ్డీ లేకుండా పంట రుణాలు పొందొచ్చని, పంటను మద్దతు ధరకు అమ్ముకోవచ్చని, రైతు సంక్షేమ పథకాలు పొందొచ్చని వివరించారు. రైతులకు వివిధ పథకాల కింద లబ్ధి చేకూర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇకెవైసిని ప్రామాణికంగా తీసుకుంటున్నాయని, రైతులంతా చేయించుకోవాలని సూచించారు. రైతు భరోసా, పిఎం కిసాన్‌ సొమ్ము బ్యాంక్‌ ఖాతాకు జమ కావాలంటే ఇకెవైసి తప్పనిసరన్నారు. కిసాన్‌ యాప్‌ ద్వారా రైతులు మొబైల్‌ ఫోన్‌ ద్వారా ఎక్కడి నుండైనా ఇకెవైసి చేయించుకోవచ్చని చెప్పారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి వి.నరేంద్రబాబు, ఎంఎఒ అరుణచంద్ర, ఎఇఒ కె.బ్రహ్మయ్య, బోస్‌, రైతులు పాల్గొన్నారు.