Feb 25,2021 06:37

మూడు వ్యవసాయ చట్టాలు, విద్యుత్‌ సవరణ బిల్లు-2020కి వ్యతిరేకంగా నవంబర్‌ 26న ఢిల్లీలో ప్రారంభమై...దేశవ్యాపిత ఉద్యమంగా రూపుదిద్దుకుంది. పోరుబాట పట్టిన రైతులకు ప్రపంచ వ్యాపితంగా మద్దతు, సంఘీభావం లభిస్తున్నది. కండలు కొరికే చలి, జడి వానలు పోయి ఎండాకాలం వస్తున్నది. ఆదివారం నాటికి (21.2.21) రైతులుగానీ రైతు కుటుంబ సభ్యులుగానీ 248 మంది మరణించారు. షాజహాన్‌పూర్‌, సింధు, టిక్రి ప్రాంతాల్లో రైతులను కలిసినప్పుడు... స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఇటువంటి మహత్తర ఉద్యమం తామెన్నడు చూడలేదని పలువురు తమ జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ప్రత్యక్ష పరిశీలన వివరాలిలా వున్నాయి.


ఢిల్లీ-జైపూర్‌ జాతీయ రహదారిలో ఢిల్లీ నుండి 100 కి.మీ దూరంలో షాజహాన్‌పూర్‌ సరిహద్దు వుంది. మూడవ తేదీన తెలంగాణ రాష్ట్ర సిఐటియు నాయకులతో కలసి ఆ ప్రాంతానికి చేరుకున్నాం. సుమారు 3-4 కిమీ దాకా టెంట్లు, ట్రాక్టర్లలోనే రైతు ఆందోళన శిబిరాలు నడుస్తున్నాయి. విపరీతమైన చలిలో సైతం ప్లాస్టిక్‌ పరదాలు కప్పిన గుడారాలలోనే వారు ఉంటున్నారు. అక్కడే వంటలు, తిండి, స్నానాలు. పగలు ఆందోళన, రాత్రి నిద్ర. ఇదంతా ఎలా అని ప్రశ్నించగా...వారి నుంచి వచ్చిన జవాబు ఆశ్చర్యపరచింది. ''వ్యవసాయ చట్టాలు అమలులోకొస్తే మోన్‌శాంటో లాంటి పెద్ద కంపెనీల వారికి బానిసలుగా మారడం కంటే ఇక్కడ చావడమే మేలనుకుంటున్నాం. అందుకే ఇక్కడే, ఇలాగే ఉంటున్నాం'' ఇది ఒక బక్క చిక్కిన రైతు సమాధానం. అక్కడివారంతా రైతు కుటుంబీకులే. వారు తినే తిండి చాలా సామాన్యంగా వుంది. సాంప్రదాయ రొట్టెలు, బంగాళదుంప కూర, మజ్జిగ. అంతే. వారే కాదు. నిరసనల్లో పాల్గొనడానికి ఆ ప్రాంతానికి వచ్చిన ఎవరైనా అక్కడ భోజనం చేయవచ్చు. ఆనందంగా సేవలందిస్తున్నారు.


అక్కడి శిబిరం గోడౌన్‌ బాధ్యుడిని కలసి వివరాలు అడిగి తెలుసుకున్నాం. ప్రతి గ్రామం నుండి పాలు, కూరగాయలు, ఇతర సరుకులు ప్రతి రోజూ వస్తాయి. గ్రామ ప్రజలు స్వచ్ఛందంగా వాటిని ఒక కేంద్రానికి తీసుకు వస్తారు. అక్కడి నుండి వాహనాల్లో శిబిరానికి చేరవేస్తారు. మేం అక్కడ వున్నప్పుడు...కూరగాయలు, పాల క్యాన్లతో ఒక జీపు వచ్చింది. వచ్చిన సామాను భద్రపరచడం, సక్రమంగా వినియోగించడం తన బాధ్యత అని ఓ పెద్దాయన ఎంతో నమ్రతగా చెప్పాడు. ఆయనెవరో తెలుసుకొని అవాక్కయ్యాం. ఆయనే రాజస్థాన్‌ లోని బాంద్రా నియోజక వర్గ సిపిఐ(ఎం) శాసన సభ్యుడు బల్వాన్‌ పునియా. పక్కన మరొక టెంట్‌ దగ్గర ఒక పెద్దాయన చుట్టూ కొద్దిమంది రైతులు చేరి మాట్లాడుతున్నారు. ఆయన మరెవరో కాదు. మాజీ శాసనసభ్యుడు, రాజస్థాన్‌ సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి అమ్రారామ్‌. వారు దాదాపుగా శిబిరం ప్రారంభమైనప్పటి నుంచి అక్కడే గుడారంలో ఉంటున్నారు. ఇతర రైతు సంఘాల నాయకులు, కార్యకర్తలు చాలా మంది అక్కడే ఉంటున్నారు.


ఢిల్లీ-చండీగఢ్‌ జాతీయ రహదారిలో బాలఘర్‌ కి దగ్గర లోని హర్యానా సరిహద్దు ప్రాంతం సింధు. ప్రభుత్వం రహదారిని మూసివేయడంతో సోనిపట్‌ దాకా బస్‌లో వెళ్లి అక్కడి నుండి 20 కిమీ హర్యానా రోడ్‌ వేస్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు నవీన్‌ రానా ద్విచక్ర వాహనంపై వెళ్లాను. బాలఘర్‌ నుండి సుమారు 10 కి.మీ. పొడవునా గుడారాలు, ట్రాక్టర్లు. సోనిపట్‌ నుండి బయలు దేరగానే ట్రాక్టర్ల ప్రవాహమే కనపడింది. అదేమిటని విచారిస్తే ప్రతి రోజు రైతులు గ్రామాల నుండి ఇలా ట్రాక్టర్లలో వచ్చి పోవడం మామూలేనని తోటి మిత్రుడు చెప్పాడు. దారి పొడవునా ట్రాఫిక్‌ స్వీయ నియంత్రణ, అక్కడక్కడా రైతు వాలంటీర్లతోనే వుంది తప్ప ఒక్క పోలీస్‌ కనిపించలా. కుటుంబాలకు కుటుంబాలే పెద్ద సంఖ్యలో తరలివస్తున్నాయి. అక్కడి వాతావరణం జాతరను మరిపించింది. అనేక మీడియా సంస్థలు మీడియా క్యాంపులు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు వార్తలు, కథనాలను ప్రజలకు అందిస్త్తున్నాయి.


షాజహాన్‌పూర్‌ లాగే ఇక్కడ కూడా గ్రామాల నుండి పాలు, కూరగాయలు, తినుబండారాలు వస్తున్నాయి. ఇక్కడ మాత్రం కెనడాలో స్థిరపడిన పంజాబ్‌ రైతు కుటుంబాలవారి ఆర్థిక సహకారంతో చలిని తట్టుకోగలిగిన గుడారాలు 5 కనిపించాయి. వీటిలో 200-250 మంది పడుకునే అవకాశం ఉంది. మిగిలిన వేలాది మంది తాత్కాలిక గుడారాలలోనే ఉంటున్నారు. ఇక్కడ మరొక విషయమేమంటే ప్రతి రైతు ఎకరానికి రూ.100 చొప్పున ఉద్యమ నిర్వహణకు విరాళాలు ఇస్తున్నట్లు చెప్పారు. స్థోమతు ఉన్న కొందరు రైతులు మరికొంత అదనంగా కూడా ఇస్తున్నారని తెలిసింది.


దీనికి మరొక ప్రత్యేకత ఉంది. అదేమంటే సింధు ప్రాంతం వెళ్లేదారికి ఒక వైపున అన్నీ పరిశ్రమలు, మాల్స్‌. రెండవవైపు గ్రామాలు. ఆ గ్రామాల లోని అత్యధికులు రైతుల నుండి సేకరించిన భూములతోనే రెండవవైపున పరిశ్రమలు, మాల్స్‌ కట్టారట. భూములు ఇచ్చినందుకు వాటిలో చిన్నచితక ఉపాధి కల్పించడంతో వారి కుటుంబాలు సాగుతున్నాయి. అయితే ఈ ఆందోళన ప్రారంభమైనప్పటి నుంచి ఆ పరిశ్రమలు, మాల్స్‌ మూతపడ్డాయి. ఉపాధి పోయింది. దాంతో వారందరికి భోజనాలు ఉద్యమ శిబిరాలలోనే ఏర్పాటు చేస్తున్నారు.


ఢిల్లీ-రోహతక్‌ (హర్యానా) దారిలో టిక్రి ప్రాంతం ఉంది. హర్యానా రోడ్‌వేస్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి సరబత్‌ సింగ్‌ పునియా బృందంతో కలసి మెట్రో రైల్లో అక్కడికి వెళ్లాం. ఢిల్లీ నుంచి వెళ్లే మార్గంలోని ఈ సరిహద్దు వద్ద ప్రభుత్వం 3 అడుగుల ఎత్తు గోడ నిర్మించి రాకపోకలను మూసివేసింది. ఇక్కడ కూడా పెద్ద సంఖ్యలో రైతులు వున్నారు. ప్రతి రోజూ ట్రాక్టర్లలో కుటుంబాలతో సహా వచ్చిపోయే వారితో కోలాహలంగా ఉంది. సింధులో లాగే ఇక్కడ కూడా ప్రతి రైతు ఎకరానికి రూ.100కి తగ్గకుండా స్వచ్ఛందంగా విరాళాలు ఇస్తున్నారు. గ్రామాల నుండి పాలు, కూరగాయలు, తినుబండారాలు నిత్యం వస్తున్నాయి. తాత్కాలిక గుడారాలే వారి నివాసాలు. సరిహద్దు నుండి బహదూర్‌ఘర్‌ దాకా 8 కి.మీ పొడవున గుడారాలు విస్తరించి ఉన్నాయి. ఇక్కడ రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. ఇళ్ళ నుండి ఎవరికి తోచిన తినుబండారాలు వారు తయారు చేసుకొని వచ్చి ఇక్కడి వారికి పంచుతున్నారు. ప్రధాన కేంద్రాలలో ఒత్తిడి తగ్గించాలనే ఉద్దేశంతో పలు గ్రామాల వారు ఇక్కడ తాత్కాలిక వసతి ఏర్పాటు చేసికొని వారి గ్రామస్తులు, బంధువులకు ఇక్కడే భోజనాలు తయారు చేసి పెడుతున్నారు. ఇది ఢిల్లీ సరిహద్దులలో జరుగుతున్న రైతుల ఆందోళన వాస్తవ ముఖ చిత్రం.


జనవరి 26న చోటు చేసుకున్న ఘటనలకు సంబంధించి ఒక రైతు మాతో ఇలా అన్నాడు. వాళ్లబ్బాయి ఇతర పిల్లలతో కలసి ట్రాక్టర్‌లో బయలుదేరాడట. అయితే పోలీసులు నేరుగా వెళ్లాల్సిందిగా డైరెక్ట్‌ చేశారు. ఆ కుర్రకారుకు విషయం తెలియదు. తీరా పోలీసులు చెప్పిన ప్రకారం వెళ్తే వారు ఢిల్లీ చేరారు. అక్కడి నుండి కుర్రాడు వాళ్ళ నాన్నకి ఫోన్‌ చేసి 'మేం ఢిల్లీ వచ్చాం. నీవెక్కడున్నావ'ని అడిగితే తండ్రి బిత్తరపోయి, ఢిల్లీ ఎందుకు వెళ్ళావని అడిగితే పోలీసులు చెప్పిన డైరెక్షన్లో వెళ్తే ఢిల్లీ వచ్చిందని చెప్పాడట. అప్పుడా రైతు వెంటనే వెనక్కు వచ్చేయమని కొడుక్కు చెప్పాడట. ఆ విధంగా జనవరి 26న రైతు ఉద్యమాన్ని అభాసుపాలు చేయాలనే ముందస్తు పథకం ప్రకారం ప్రభుత్వమే పోలీసుల ద్వారా రైతులను తప్పు దారి పట్టించి ఢిల్లీ వచ్చేలా చేసిందని తెలిసి విస్తుపోయాం.


కానీ ప్రధాన జాతీయ మీడియా వాస్తవాన్ని, ప్రభుత్వం చేసిన కుట్రను విడిచిపెట్టి...రైతులు అనుమతించిన మార్గాన్ని అతిక్రమించి అక్రమంగా ఢిల్లీ లోకి చొరబడి అలజడి సృష్టించారని ప్రచారం చేసి వీడియోలు చూపించింది. జనవరి 26, ఆగస్టు 15 తేదీల్లో ఢిల్లీలో పకడ్బందీ బందోబస్తు వుంటుంది. రెండు మూడు రోజుల ముందు నుంచే రిహార్సళ్లు జరుగుతాయి.కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్‌ నిషేధిస్తారు. వేల సంఖ్యలో పోలీసు బలగాలు మోహరించి ఉంటాయి. అలాంటి వాతావరణంలో ఢిల్లీ లోని ఎర్రకోటకు కొందరు ఎలా వెళ్లారు? ఎర్రకోట లోపలికి ఎలా ప్రవేశించారు? స్తంభం ఎలా ఎక్కాడు? ఎక్కిన స్తంభం దిగి ఎవరికి దొరకకుండా ఎలా పరారయ్యాడు? అనేవి చిన్న పిల్లవాడికి కూడా కలిగే సందేహాలే.


రైతులు ఇన్ని ఆటంకాలను అధిగమిస్తూ...సడలని పట్టుదలతో పోరాటం చేస్తుంటే...కేంద్ర ప్రభుత్వం, దాని మద్దతుదారులు దారుణమైన అబద్ధాలను ప్రచారం చేయడం చూస్తున్నాం. ఆందోళనలు చేస్తున్నది రైతులు కాదు-కొద్ది మంది బడా రైతు బాబులు. ఆందోళనలు కాదు-జీడిపప్పు, పిజ్జాలు, బర్గర్లు తింటూ సరదాలు చేసుకుంటున్నారు. ఇవి విదేశీయుల భారీ విరాళాలతో సాగుతున్నాయి...లాంటి వాదనలు ఉన్నాయి. ఆందోళన జీవులని, పరాన్న జీవులని, రైతుల శ్రేయస్సు కోసమే ఇదంతా చేస్తున్నామని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే పార్లమెంటు వేదికగా చెప్పారు. పైగా మన్మోహన్‌ సింగ్‌ విధానాలనే అమలు చేస్తున్నానని కూడా ప్రధాని అన్నారు (మన్మోహన్‌ సింగ్‌ విధానాలతో విసిగి వేసారిన ప్రజలు ఆ విధానాలకు భిన్నంగా ప్రజల మేలుకు ఏదో చేస్తారని కదా ప్రజలు మోడీకి పట్టాభిషేకం చేసింది). రైతుల మేలు కోసమే కొత్తగా చట్టాలు తెస్తే లక్షలాది మంది దేశ వ్యాపితంగా ఎందుకు వీధుల్లోకి వచ్చారు? చట్టంలో కనీస మద్దతు ధర ఎందుకు లేదు? రైతుల ప్రయోజనాల కోసమే అయితే రైతు సంఘాలతో చట్టాలు చేసే ముందే ఎందుకు చర్చించలేదు? భారతీయులే కాక విదేశీయులు సహితం ఎందుకు మద్దతు ఇస్తున్నారు? బ్రిటిష్‌ పార్లమెంటు లోని 100 మంది ఎం.పి లు భారత రైతుల ఉద్యమానికి మద్దతునిస్తూ ఎందుకు తీర్మానించారు? ఇవన్నీ సామాన్యులను సైతం తొలిచివేస్తున్న ప్రశ్నలు.
                                          * ఆర్‌. లక్ష్మయ్య (వ్యాసకర్త ఎఐఆర్‌టిడబ్ల్యుఎఫ్‌ అధ్యక్షులు)