మనది కేవలం సాగు పైనే ఆధారపడ్డ రాష్ట్రం. కొన్నేళ్లుగా దేశంలో వ్యవసాయ సంక్షోభం తిష్ట వేసింది. దానికి కోవిడ్ మహమ్మారి, వంటి ఉపద్రవాలు తోడై సాగు రంగం పైనా, రైతుల పైనా దుష్పరిణామాలు కలిగిస్తున్నాయి. ఇలాంటి ఆపత్కాలంలో ప్రభుత్వం రైతుల వైపు నికరంగా నిలబడి ఇతోధికంగా బడ్జెట్ నిధులు వెచ్చించాలి. కానీ బడ్జెట్‌లో వ్యవసాయం, అనుబంధ రంగాలకు ప్రభుత్వ ప్రతిపాదనలు నిరాశా నిస్పృహల్లో ఉన్న అన్నదాతల్లో ఆత్మ విశ్వాసం నింపే విధంగా లేవు. ముందటేడు బడ్జెట్‌లో వ్యవసాయ పద్దు ఖర్చు 4.04 శాతం. నిరుడు సవరించిన అంచనాల్లో 5.75 శాతం ఉండగా ఇప్పుడు 5.88 శాతం అంటున్నారు. ప్రభుత్వం మాత్రం తమది రైతు పక్షపాత పాలన అని చెప్పుకుంటోంది. సర్కారు ప్రచారం ఎంత మోసపూరితమో వ్యవసాయ ప్రగతి నివేదికను తేరిపార చూస్తే ఇట్టే అర్థమవుతుంది. నిన్నగాక మొన్న బడ్జెట్‌లో రైతుల అన్ని పథకాలకూ రూ.68 వేల కోట్లు ఖర్చు చేశామనగా, ప్రోగ్రెస్ రిపోర్టులో లబ్ధిని రూ.85 వేల కోట్లకు పెంచేశారు. పోనీ ఆ అంకెలైనా నమ్మశక్యమా అంటే అదీ లేదు. వచ్చే నాలుగేళ్ల కాలానికి ఉచితంగా బోర్లు వేసేందుకు ఖర్చు చేయబోయే మొత్తాన్నీ ఖర్చు చేసినట్లు చూపించారు. ఉచిత విద్యుత్‌కు రెండేళ్లలో ప్రతిపాదించిన నిధులు రూ.9 వేల కోట్లు కాగా రూ.17,430 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. పంటలకు గిట్టుబాటు ధరలకైతే ఏకంగా రూ.33 వేల కోట్లు ఖజానా నుండి ఇచ్చారట. ఇలాంటి చమత్కారాలెన్నో బడ్జెట్‌లో, ప్రగతి నివేదికలో నిక్షిప్తం అయ్యాయి.
నిరుడు, ఈ ఏడు కరోనా లాక్‌డౌన్లు, ఆంక్షల వలన రబీ పంటల మార్కెటింగ్‌కు తీవ్ర ఇబ్బందులేర్పడ్డాయి. ప్రస్తుతం వరి ధాన్యం సహా పలు పంటలను రైతుల నుండి కొనే నాథుడే లేడు. ఉల్లి, టమాటా, పసుపు, పత్తి, అరటి, మామిడి, బత్తాయి వంటి పంటల ధరల్లో స్థిరత్వం లేదు. ఇలాంటప్పుడు పంటల కొనుగోలుకు అధిక నిధులు సమకూర్చి ప్రభుత్వం జోక్యం చేసుకొని రైతులకు నష్టం లేకుండా ఆదుకోవాలి. కానీ ధరల స్థిరీకరణ నిధి రూ.3 వేల కోట్ల నుండి రూ.500 కోట్లకు కుదించడం ఎవరికి లాభం? రాష్ట్రంలో 92 శాతం రైతులు రుణగ్రస్తులని నేషనల్ శాంపిల్ సర్వే తేల్చగా, సున్నా వడ్డీ పథకానికి రూ.1,100 కోట్ల నుండి 500 కోట్లకు నిధులు తగ్గించారు. రైతులు సబ్సిడీ విత్తనం అడుగుతుండగా అందుకు నిధులను 192 కోట్ల నుండి వంద కోట్లకు కోత పెట్టారు. అరకొర రైతు భరోసా సాయం, నడవలేక నడుస్తున్న 'ఆర్‌బికె' లే రైతుల సమస్త సమస్యలకూ మందు అనడం రైతులను తప్పుదారి పట్టించడమే.
రైతులంతా వ్యతిరేకిస్తున్న నూతన వ్యవసాయ చట్టాలను రాష్ట్రంలో రాష్ట్రంలో వేగంగా అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అడుగులేస్తోంది. సాగుపై ప్రత్యేక పాలసీ, భారీ యాంత్రీకరణ, గ్రామాల్లో మల్టీ పర్పస్ ఫెసిలిటీ సెంటర్లు, ఉపాధి హామీ అనుసంధానం, సహకార సంస్కరణలకు సై అంది. రైతులు తమకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, తక్కువ వడ్డీపై బ్యాంక్ పరపతి, పండించిన పంటలకు గిట్టుబాటు ధర అడుగుతుండగా ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్రవర్తిస్తోంది. 70 శాతం భూమిని సాగు చేస్తున్న లక్షలాది కౌలు రైతులకు ఊతం ఇవ్వాల్సిన సర్కారు, వారికి ఇంతకు ముందు పరిమితంగానైనా ఉన్న చట్ట బద్ధ హక్కులను కొత్త చట్టం పేరిట తొలగించింది. దాంతో ప్రభుత్వం ఖర్చు చేసే కొద్దిపాటి నిధులూ వాస్తవ సాగుదార్లకు దక్కట్లేదు. వ్యవసాయ రాష్ట్రానికి జీవాధారమైన ఇరిగేషన్ పద్దుకు నిధులు తగ్గుతున్నాయి. ఆ దుష్పరిణామం ఆర్థిక సర్వేలో ప్రస్ఫుటించింది. ప్రాజెక్టుల కింద నికర సాగు రెండేళ్లలో ఏ మాత్రం పెరగలేదు. ఆహారోత్పత్తుల దిగుబడులు ముందటేడు కంటే నిరుడు ఏడు లక్షల టన్నులు తగ్గాయని పేర్కొని సాగును పండగ చేశామన్న సర్కారు ప్రచారానికి సర్వే చెంపపెట్టయింది. ఆత్మహత్యలు సరేసరి. వ్యవసాయం పండగ కావాల్సింది రైతులకు. ప్రభుత్వ ధోరణి కార్పొరేట్లకు పండగ చేసేదిగా తయారైంది. ఈ పోకడ నుండి సర్కారు వెనక్కి మళ్లకపోతే సాగు సంక్షోభం ఇంకా తీవ్రమవుతుంది.










