ఉద్యోగం చేసే ఎవరైనా సెలవు రోజుల్లో కుటుంబంతో గడపటానికో, విశ్రాంతి తీసుకోవడానికో ప్రాధాన్యతనిస్తారు. కానీ ఈ ఉపాధ్యాయుడి మార్గం విభిన్నం. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాన్ని పరామర్శించడానికి తన సెలవులను ఉపయోగిస్తారు. అవసరమైతే సెలవు పెట్టి మరీ వెళతారు. బాధితుల వివరాలు సేకరించి తన మిత్రులు, దాతల ద్వారా సాయమందేలా కృషి చేస్తారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాల్లో వెలుగులు నింపుతూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆయన మన తెలుగువాడే.. తెలంగాణాకు చెందిన పులిరాజు. స్ఫూర్తిదాయకమైన ఆయన కథేంటో తెలుసుకుందాం..
మనిషికి మనిషే తోడు. తోటివారికి సాయం చేయడం కంటే పరమార్థం ఏముంటుంది. ఆ సాయం డబ్బో, మరొకటో కానవసరం లేదు. ఆర్తుల కష్టంలో నేనున్నానంటూ అందించే చిన్న ఓదార్పు, మాట సాయమూ విలువైనదే. ఆ ఉపాధ్యాయుడు అనుసరిస్తున్న మార్గం ఇదే. ఆపదలో ఉన్న వారిని ఓదార్చి, దాతల సాయంతో వారికి సాయం అందేలా కృషి చేస్తున్నారు.
నన్నెంతగానో కలచేసింది
తెలంగాణ సిద్ధిపేట జిల్లా తొగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్‌కు చెందిన పులిరాజు ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు. రెండు దశాబ్దాలుగా రైతు ఆత్మహత్యల బాధిత కుటుంబాలకు అండగా పనిచేస్తున్నారు. ఆయనది వ్యవసాయ కుటుంబం. చిన్నప్పటి నుంచి తన కుటుంబం, స్నేహితులు నీటి సంక్షోభం, మారుతున్న పంటల సరళి, వాతావరణ మార్పులు, కనీస మద్దతు ధర కోసం చేసే పోరాటాలను దగ్గరుండి చూశారు. 'నా స్నేహితుడు అశోక్ 2000 సంవత్సరంలో జర్నలిస్టుగా పనిచేస్తూ ఉండేవాడు. ఒకరోజు అతనిని కలిశాను. అప్పుడే రైతు ఆత్మహత్యలపై ఆయన రాసిన ఒక న్యూస్ చదివాను. రైతులకు ఇలాంటి పరిస్థితి ఎందుకు ఎదురవుతుంది? అనే అంశంపై చాలాసేపు చర్చించుకున్నాం. రైతులను ఆదుకోవడానికి ఏదైనా చేయాలి అనుకున్నాం. ముందుగా ఏ కారణాలతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారో గుర్తించాలని అశోక్ చెప్పాడు. 2002లో మా ప్రాంతంలో జరిగిన రైతు ఆత్మహత్యలపై ఒక డాక్యుమెంట్ చేశాను. బాధిత కుటుంబాలను కలిసినప్పుడు 'మీకు చేతనైన సాయం చేయండి!' అని వారు అడిగారు. అది నన్నెంతగానో కలచి వేసింది' అంటున్నారు పులిరాజు.
మహిళే ఆధారం
'ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను కలవాలని నిర్ణయించుకున్నా. ఎలాంటి పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? వారి కుటుంబ నేపథ్యం ఏమిటి? అసలు కారణాలు ఏమిటి? అనేవి తెలుసుకోవాలని ప్రయత్నించా. అప్పుడే నాకు తెలిసింది. అప్పుల ఊబిలో కూరుకుపోవడమే వారి బలవన్మరణాలకు కారణం అని. నాసిరకమైన వ్యవసాయోత్పత్తుల వల్ల పంట చేతికొచ్చేది కాదు. దాంతో తీవ్ర నిరాశకు గురై, క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం వారి కుటుంబాలను వీధులపాలు చేసిందని తెలుసుకున్నా. గ్రామీణ ప్రాంతాల్లో స్త్రీ, పురుషులకు 18 నుంచి 25 సంవత్సరాల లోపే వివాహం చేస్తుంటారు. కుటుంబ యజమాని హఠాన్మరణంతో చిన్న వయస్సులోనే స్త్రీ ఒంటరి మహిళగా మారిపోతుంది. ఒక్కసారిగా కుటుంబ భారమంతా ఆమె భుజాలకెత్తుకోవాల్సి వస్తోంది. దానికితోడు వడ్డీ వ్యాపారులు, బ్యాంకులు తరచుగా ఆమెపై ఒత్తిడి తీసుకురావడం నేను కళ్లారా చూశా. వారికి ప్రభుత్వ సాయమూ అందటం లేదని తెలిసి ఆశ్చర్యపోయా. ప్రభుత్వ రికార్డుల్లో భూమి కొడుకు పేరు మీద కాకుండా తండ్రి పేరు మీద ఉండటంతో ప్రభుత్వం అందించే రూ.1.5 లక్షల నష్టపరిహారం వారికి దక్కేది కాదు. 2014లో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) నివేదిక, కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన వార్షిక నివేదికలో ఈ ప్రాంతంలో 27,000 మంది రైతులు మరణించారని తెలిపారు. కానీ ఏడువేల మందికి మాత్రమే పరిహారం అందిందని సమాచార హక్కు (ఆర్‌టీఐ) ద్వారా తెలుసుకున్నా' అంటున్నాడు పులిరాజు.
రైతులకు అండగా..
'గతంలో ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీఓ 421, తెలంగాణ జారీ చేసిన జిఓ 194 ప్రకారం బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందించడానికి అధికారులు ఇష్టపడలేదు. ఆత్మహత్య చేసుకున్న రైతు పేరు మీద పట్టా లేదు అనేది వారు కారణంగా చూపారు. ఇదెక్కడి న్యాయం? కౌలు రైతైనా రైతే కదా! అందుకే 2014-18 మధ్యకాలంలో నేను, పి శ్రీహరిరావు కలిసి హైకోర్టులో కేసు వేశాం. దాంతో సుమారు 400 కుటుంబాలకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందింది' అంటున్నారు రాజు.
ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా 2,500 కుటుంబాలకు మానసికంగా, ఆర్థికంగా సహాయాన్ని అందించారు రాజు. సుమారు 40 మంది పిల్లలను ఒక ప్రైవేటు కంపెనీ దత్తత తీసుకుని చదివించేలా చేశారు. 'మా నాన్న ఆత్మహత్య తర్వాత రాజు సార్ మమ్మల్ని ఎంతగానో ఆదుకున్నారు. 2012లో మాకు పరిహారం అందించడంలో ఆయన కృషి మరచిపోలేం. ఇంటర్‌లో ప్రభుత్వ కళాశాలలో అడ్మిషన్ రావడానికి సారే సహాయం చేశారు. అంతేకాదు అవసరమైనప్పుడు డబ్బులు, బట్టలు, ఇతర వస్తువులను నేటికీ అందిస్తూ ఉంటారు' అంటున్నాడు రాజిరెడ్డి అనే యువకుడు. ఇప్పటి వరకు పులిరాజు ప్రభుత్వం నుంచి ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు.