Oct 22,2023 21:02

ఎండిపోతున్న వరిపైరు

వర్షాభావ కారణంగా వరి పంట ఎండిపోయే పరిస్థితితో రైతులు ఆందోళన చెందుతున్నారు. చాలా మండలాల్లో ఈ ఏడాది సాగు నీరందక వరి పంట ఎండిపోయే ప్రమాదంలో పడింది. ముఖ్యంగా పొట్టదశలో నీరందక చాలా చోట్ల వరి ఎండిపోతుంది. అధికారులు సైతం పంట నష్ట పరిహారాన్ని అంచనా వేసే పనిలో దిగారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చును. సాగునీటి ప్రాజెక్టులు కింద ఉన్న పొలాల పరిస్థితి కూడా ఇలాగే ఉందని రైతులు చెబుతున్నారు. కాగా చివరి పోరాటంగా చెరువులో అడపా దడపా ఉన్న నీటిని మోటారు సహాకారంతో తోడించి వరి పంటను బతికించుకునేందుకు రైతులు తంటాలు పడుతున్నారు.
ప్రజాశక్తి- డెంకాడ, వేపాడ : 
డెంకాడ మండలమంతా వర్షాధారంపైనే ఆధారపడి ఉటుంది. 75 శాతం వరకు ఏ పంట పండాలన్నా వర్షం పడితేనే పండుతుంది. కేవలం 25 శాతం బోర్ల ద్వారా పంటలు పండిస్తున్నారు. మండలంలో సుమారు 13,750 ఎకరాల్లో వరి సాధారణ విస్తీర్ణం కాగా ఈ ఏడాది 11,715 ఎకరాల్లో వరి నాట్లు వేశారు. ఆగస్టులో ఉబాలు పడిన తరువాత అనుకున్న స్థాయిలో వర్షాలు పడలేదు. సుమారు రెండు నెలలుగా వర్షాలు పడకపోవడంతో పొట్టదశకు వచ్చిన వరి పంట ఎండిపోతుందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఉబాలు తరువాత వర్షాలు లేకపోవడంతో ఒకటి రెండు సార్లు చెరువులో ఉన్న నీటిని తోడుకుని వరి పంటను బతికించుకున్నారు. ఇప్పుడు కచ్చితంగా పొట్టదశకు వచ్చేసరికి చెరువులో కూడా నీరు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
వేపాడ మండలంలో జగ్గయ్యపేట, వేపాడ, వల్లంపూడి, సింగరాయి, ఆతవ, ఎం.సింగవరం, బానాది, బల్లంకి, కొంపల్లి, కెఆర్‌పేట గ్రామాల్లో కేవలం వర్షాధారంపై ఆధారపడి వరిసాగుతుంది. ప్రస్తుతం తీవ్ర వర్షాభావంతో వరి పొలాలు ఎండిపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం పొట్ట దశలో కొన్నిచోట్ల ఉంది. పూత దశలో, గింజకు పాలు పోసుకునే దశలో ఉండడంతో పంటను ఎలాగైనా కాపాడుకోవాలని రైతులు తాపత్రయ పడుతున్నారు. ఆయిల్‌ ఇంజిన్లతో పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. మండలంలో ఈ వారం రోజుల్లో వర్షాలు రాకుంటే ఐదు వేల ఎకరాల్లో పంట నష్టం తప్పదని అంచనా వేస్తున్నారు.
మరో పది రోజుల్లో వర్షాలు పడకపోతే డెంకాడ మండలంలో 7500 ఎకరాల్లో వరి పంట పూర్తిగా దెబ్బతినే పరిస్థితి ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మిగతా భూముల్లో ప్రస్తుతం తడి ఉన్నా వర్షాలు పడకపోవడంతో తెగుళ్లు వచ్చి పంట నష్టపోయే పరిస్థితి ఉందని చెబుతున్నారు. పైనుంచి వర్షం పడితే తప్ప తెగుళ్లు పోవని చెబుతున్నారు. ముఖ్యంగా అమకాం, గొలగాం, జొన్నాడ, బొడ్డవలస, మోపాడ, డి తాళ్లవలస, డెంకాడలో కొంత భాగం పినతాడివాడలో కొంత భాగం వరి పంట ఎండిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఎకరాకు రూ.20 వేలు నుంచి 40 వేల వరకు మదుపులు పెట్టి వ్యవసాయం చేశామని పంట చేతికి రాకపోతే అప్పుల పాలైపోతామని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.

లక్షకుపైగా ఖర్చుపెట్టాను
మా గ్రామంలో మూడు ఎకరాలు పొలంలో వరి వేశాను. ఇప్పటివరకు సుమారు లక్ష రూపాయలపైన ఖర్చు పెట్టాను. పంట చేతికి వస్తే అప్పులు తీరుతాయనుకున్నాను. కానీ వర్ష భావం వల్ల వరి చేను ఎండిపోయే స్థితికి వచ్చింది. వర్షాలు లేకపోవడంతో పొలంలో ఉన్న నుయ్యి నీరు, పక్కనే ఉన్న పొలం నీరు కూడా చాలడం లేదు. పైగా వీటికి మోటారు పెట్టి నీటిని తోడించడం వల్ల ఖర్చు పెరిగిపోతుంది. ఇప్పుడు వరి పొట్ట దశలో ఉంది. ఈ సమయంలో వర్షం పడితేనే పంట చేతికి వచ్చే అవకాశం ఉంది. లేకపోతే పంట పోతుంది.
- ఆకుల వాసుదేవరావు, రైతు, మోపాడ, డెంకాడ మండలం

పంటంతా పోతుంది
నాకున్న రెండు ఎకరాల భూమిలో వరిసాగుచేస్తున్నాను. సుమారు 60 వేల రూపాయల వరకు పెట్టుబడి పెట్టాను. వర్షాల్లేక పంటంతా ఎండిపోతోంది. వారం రోజుల్లో వర్షం పడకుంటే పంటంతా పోతుంది. కనీసం మదుపులు కూడా వచ్చే అవకాశం లేదు. -మంచిన అప్పలసూరి. రైతు,
ఆకులసీతంపేట, వేపాడ మండలం