Nov 04,2023 21:20

సంబేపల్లె మండలంలోని నాగిరెడ్డిగారిపల్లెలో నీరు లేక ఎండిపోయిన వేరుశనగ

 రాయచోటి : జిల్లాలో 30 మండలాలో దాదాపు అన్ని మండలాల్లో భూగర్భ జలాలు అడుగంటి పంటలకు నీరు అందక రైతులు వెలవెలాడుతున్నారు. ఖరీఫ్‌ 2023 సాధారణ సాగు 82,589 హెక్టార్లు, సాగు చేసిన విస్తీర్ణం 35,942 హెక్టార్లు, రబీ సాధారణ సాగు 26,238 హెక్టార్లు. ఇప్పటి వరకు సాగు చేసిన విస్తీర్ణం 5032 హెక్టార్లు మాత్రమే. వేరుశనగ పంటకు సకాలంలో మీరు లేకపోవడంతో వేసిన పంట ఎండిపోవడం చెట్టు ఎదుగుదల లేక రైతు పెట్టిన పెట్టుబడి అంతా నేలపాలైంది. అయినప్పటికీ రైతులకు పెట్టిన ఖర్చులు కూడా రాకుండా పంట ఎండిపోవడంతో వారు అప్పల ఊబిలో కూరుకుపోయారు. రైతులు వర్షం కోసం ఆకాశం వైపు ఎదురుచూస్తూ ఎప్పుడు తమ ఆశలు చిగురిస్తాయా అని ఎదురు చూస్తున్నారు. 5, 6 నెలలుగా వర్షాలు లేక చెరువుల నిండక రైతులు లబోది మంటున్నారు. ముఖ్యంగా వరి, చెరకు, వేరుశనగ, టమోట, బొప్పాయి, పసుపు వంటి పంటలకు కచ్చితంగా నీరు ఉండాల్సిందే. అలాంటి పంటలకు నీరు లేకపోవడంతో పంటలన్నీ ఎండిపోయే రైతుల ఆశలన్నీ అడియాశలుగా మారాయి. ముఖ్యంగా భూగర్భజాలలో అడుగంటి బోర్ల కింద వ్యవసాయం చేస్తే రైతులకు కూడా నీరందక నీటి కోసం నానాతిప్పలు పడుతున్నారు.
కొన్నే కరువు మండలాల ప్రకటన..
రాష్ట్ర ప్రభుత్వం కేవలం అన్నమయ్య జిల్లాలోని గాలివీడు, రాయచోటి, చిన్నమండెం, లక్కిరెడ్డిపల్లి, రామాపురం, గుర్రంకొండ, కలకడ, కంభంవారిపల్లి, పీలేరు, సుండుపల్లి, వీరబల్లి, తంబళ్లపల్లి, పెద్దమండెం, కురబలకోట, పెద్దతిప్పసముద్రం, బి.కొత్తకోటలను తీవ్రంగా ప్రభావితమైన కరువు మండలాలుగా, నందలూరు, పెనగలూరును మధ్యస్తంగా ప్రకటించి చేతులు దులుపుకొంది. జిల్లాలో అధికారులు పర్యటించి ఎంత మేరకు పంట దెబ్బతిందో అంచనా వేయాల్సిందిపోయి వారు కేవలం కార్యాలయాలకు పరిమితం అవడంతో రైతులు ఆక్రోషంతో ఉన్నారు. కనీసం వారికి సరైనటు వంటి సూచనలు, సలహాలు ఇవ్వకపోవడంతో వర్షాభావంలో ఎలాంటి పంటలు వేయాలో తెలియక సతమతమవుతున్నారు. గత ఖరీఫ్‌, రబీలలో దెబ్బతిన్న పంటలకు కనీసం నష్టపరిహారం అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అన్నమయ్య జిల్లాలోని పింఛా, అన్నమయ్య ప్రాజెక్టులు 2021లో కురిసిన భారీ వర్షాలకు కొట్టుకుపోయాయి. నేడు చుక్క నీరు లేకుండా డ్యాములు వెలవెలబోతున్నాయి. నిర్మాణానికి అధికారులు శ్రద్ధ చూపకపోవడం పట్ల రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటలు లేకపోవడం వల్ల నిత్యావసర, కూరగాయలు ధరలు అందుబాటులో లేకుండా పోయాయి ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి అన్నమయ్య జిల్లాల్లో అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని పలువురు రైతులు కోరుతున్నారు.
నష్టపరిహారం ఇవ్వాలి
ఖరీఫ్‌లో పంటలు సాగు చేశాం. వర్షాలు కురవకపోవడంతో ఎండిపోయాయి. పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు. రబీలో వరి పంట నాటడానికి వరి నారు వేశాను. వర్షాలు కురవకపోవడంతో అదీఎండిపోయింది. ఏడాదిలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి .
- కె.రెడ్డప్ప, రైతు, మాధవరం, రాయచోట.
కరువు మండలాలుగా అన్నింటినీ ప్రకటించాలి
జిల్లాలోని కూలీలను, రైతులను రాష్ట్ర ప్రభుత్వం అడుకోవాలి. కౌలు రైతులతో సహా రైతులందరికీ స్కిల్‌ ఆఫ్‌ ఫైనల్స్‌ ప్రకారం పంట రుణాలు అందించాలి. రైతుల పంట రుణాల బకాయిలను ఒక పర్యాయం రద్దు చేయాలని కేరళ రాష్ట్రంలో ఉన్నట్లు రైతు రుణ ఉపశమనం చట్టం పార్లమెంటులో ఆమోదించి రైతుల ఆత్మహత్యలను అరికట్టాలి. తక్షణం పంట నష్టపోయిన రైతులను రూ. 50 వేలు, పంట వేయని రైతులకు రూ. 25 వేల చొప్పున ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి. పజా పంపిణీ వ్యవస్థను సార్వత్రికం చేయాలి. జిల్లావ్యాప్తంగా వర్షం లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు.జ అన్నమయ్య జిల్లాలోని అన్ని మండలాలను కరువు జిల్లాగా ప్రకటించాలి.
- సిరిపురి రామచంద్ర, ఎపి రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి.