Apr 16,2021 06:39

విశాఖ ఆర్కే బీచ్‌లో ఏప్రిల్‌ 18వ తేదీ సాయంత్రం 4 గంటలకు జరగనున్న రైతాంగ, కార్మిక సమర శంఖారావ సభ కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పోరాటంలో ఒక ఉజ్వల ఘట్టం కాబోతున్నది. ఢిల్లీ పొరుగు రాష్ట్రాల్లో మహత్తర రైతు పోరాటాన్ని నడిపిస్తున్న అఖిల భారత రైతు నాయకులు ఈ సభలో పాల్గొని విశాఖ స్టీల్‌ ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటానికి మద్దతు తెలియజేస్తారు. రైతాంగ చట్టాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వంతో జరుగుతున్న పోరాటంలో వీరు ముందు పీఠిన వున్నారు. వారిలో రాకేష్‌సింగ్‌ టికాయత్‌ (బికెయు జాతీయ నాయకులు), అశోక్‌ ధావలే (ఎఐకెఎస్‌ జాతీయ నాయకులు), బల్‌కరణ్‌ సింగ్‌ (ఆలిండియా కిసాన్‌ సభ జాతీయ నాయకులు), బి.వెంకట్‌ (ఎఐఎడబ్ల్యుయు జాతీయ ప్రధాన కార్యదర్శి), ధన్‌పాల్‌ సింగ్‌ (సంయుక్త కిసాన్‌ మోర్చా జాతీయ నాయకులు), ఆంధ్రప్రదేశ్‌ రైతు, వ్యవసాయ కార్మిక, కౌలుదారీ సంఘాల నాయకులు వడ్డే శోభనాద్రీశ్వరరావు (ఎ.పి రైతుసంఘం సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌), వై. కేశవరావు, రావుల వెంకయ్య, దడాల సుబ్బారావుతో సహా అనేక మంది విశాఖ సభకు వస్తున్నారు.

కేంద్రం లోని బిజెపి ప్రభుత్వం కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను దుర్మార్గంగా అమలు చేస్తున్నది. సర్వసంపదలు సృష్టించే శ్రామికవర్గ హక్కులను హరించివేస్తున్నది. స్వాతంత్య్రం ముందు నుంచి కార్మికులు సాధించుకున్న చట్టాల సారాన్ని పూర్తిగా తీసివేసి లేబర్‌ కోడ్‌లను కార్మికులపై రుద్దుతున్నది. ఇది కార్మికులను కట్టుబానిసత్వం లోకి నెట్టడమే. దేశానికే అన్నం పెట్టే అన్నదాతలు, రైతాంగం, వ్యవసాయ కార్మికులు, కౌలుదారుల కష్టాలు నానాటికి పెరుగుతున్నాయి. వ్యవసాయ ఉత్పత్తికి అవసరమైన ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు వగైరాల ధరలు పెరగడం వల్ల వ్యవసాయం ఖర్చు బాగా పెరిగింది. కేంద్ర ప్రభుత్వ బ్యాంకుల నుంచి ఇచ్చే వ్యవసాయ రుణాలు తగ్గాయి. దాంతో రైతులు రుణాల కోసం (80 శాతం) ప్రైవేట్‌ వడ్డీ వ్యాపారుల మీదే ఆధారపడాల్సి వస్తున్నది. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక వడ్డీల భారాలు చెల్లించలేక దేశవ్యాప్తంగా గత 15 సంవత్సరాలలో 3 లక్షల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కేంద్రంలో బిజెపి అధికారం లోకి వచ్చిన తర్వాత గతంలో వున్న ఎరువుల సబ్సిడీలు తగ్గించారు. అన్నింటిని మించి మూడు రైతు చట్టాలను బలవంతంగా రైతులపై రుద్దాలని బిజెపి ప్రభుత్వం నిర్ణయించింది. కార్పొరేట్‌ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తామని బహిరంగంగా ప్రధానమంత్రి ప్రకటించారు. దీనికి వ్యతిరేకంగా 500 రైతు సంఘాలు ఏకమై రైతు చట్టాలను ప్రతిఘటించడమే పరిష్కారమని నిర్ణయించుకున్నాయి.

స్వాతంత్య్రానంతరం దేశంలో జరుగుతున్న కార్మిక, కర్షక, సమైక్య పోరాటంలో భాగమే విశాఖ శంఖారావ సభ. రైతాంగ చట్టాలకు వ్యతిరేకంగా నవంబరు నుంచి 500 రైతు సంఘాలు టిక్రి, ఘాజిపూర్‌, సింఘీ కేంద్రాలుగా ఢిల్లీ పరిసరాల్లో జరుగుతున్న మహత్తర పోరాటం దేశం మొత్తానికి స్ఫూర్తినిస్తున్నది. గత వంద సంవత్సరాలలో ప్రపంచంలోకెల్లా అతి పెద్ద శాంతియుత పోరాటం ఇది. ఆ పోరాటంలో అగ్రభాగాన నిలబడి చర్చలు సాగిస్తూ, దేశవ్యాప్తంగా అనేక భారీ పిలుపులు అమలు చేస్తున్న నాయకులు విశాఖ స్టీల్‌ ఉద్యమానికి స్వయంగా మద్దతు తెలిపేందుకు విశాఖపట్నం రావడం మనకెంతో గర్వకారణం.

వ్యవసాయ రంగంలో తెచ్చిన మూడు చట్టాల వల్ల రైతుల పంటలకు ఇప్పుడు కనీస మద్దతు ధర కూడా లేకుండా పోతుంది. మార్కెట్లు, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు మూసివేస్తారు. వ్యవసాయం మొత్తం కార్పొరేట్‌ కంపెనీల వశమవుతుంది. ప్రజలకు ఆహార భద్రత లేకుండా పోతుంది. దేశంలోని 500 రైతు సంఘాలు ఏకమై ఈ చట్టాల రద్దు కోసం పోరాడుతున్నాయి. రైతు ఉద్యమాన్ని అణచడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నం చేస్తోంది. రైతులను విదేశీ ఏజెంట్లు, తీవ్రవాదులని ముద్ర వేసే ప్రయత్నం చేసింది. అవేవీ ప్రజలు నమ్మలేదు. దీక్షా శిబిరాల చుట్టూ ముళ్ళ కంచెలు వేయడం, గోడలు నిర్మించడం, కందకాలు తవ్వించడం, మేకులు కొట్టించడం, మంచినీరు, విద్యుత్‌ సరఫరా నిలిపివేయడం, టెలిఫోన్‌, ఇంటర్‌నెట్‌ కనెక్షన్లు తీసివేయడం, ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి గ్యాంగులను ఉసిగొల్పడం వంటి దుశ్చర్యలకు మోడీ ప్రభుత్వం పాల్పడింది. అయినా రైతు ఉద్యమం సడలలేదు. మరింత ఊపందుకుంది.

విశాఖ 'ఉక్కు-ఆంధ్రుల హక్కు' మహోద్యమంలో 32 మంది తెలుగు ప్రజలు ప్రాణాలర్పించి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని సాధించుకున్నారు. 52 మంది కమ్యూనిస్టు ఎమ్మెల్యేలతో సహా 67 మంది రాజీనామాలు చేసి నాడు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి నిరసన తెలిపారు. 16,200 మంది రైతులు త్యాగం చేసి 22 వేల ఎకరాల భూమి ఇవ్వగా ఈ ప్లాంట్‌ ఏర్పడింది. 1991లో ఉత్పత్తి ప్రారంభించినా విశాఖ స్టీల్‌ ప్రైవేటీకరణ విధానాల ఫలితంగా అడుగడుగునా ఆటంకాలు ఎదుర్కొంటున్నది. బిజెపి రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత దూకుడుగా విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణకు పూనుకుంటున్నది. విశాఖ స్టీల్‌పై నష్టాలనే నెపం వేస్తున్నది. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం కేవలం రూ.4,950 కోట్లు మాత్రమే పెట్టుబడిగా పెట్టింది. కాని విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఇప్పటి వరకు రూ.44 వేల కోట్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నులు, డివిడెండ్ల రూపంలో చెల్లించింది. రూ.3 లక్షల కోట్ల విలువైన విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను రూ.1300 కోట్లకు కారుచౌకగా విదేశీ కార్పొరేట్లకు కట్టబెట్టాలని కేంద్ర క్యాబినెట్‌ సబ్‌ కమిటీ (27.1.2021) తీర్మానించింది. విశాఖ స్టీల్‌ను కార్పొరేట్లకు కట్టబెట్టడం దేశద్రోహం కాదా? దేశం లోని అన్ని ప్రభుత్వ రంగ పరిశ్రమలను అమ్ముతామని ప్రధాని ప్రకటించారు. భారీ పరిశ్రమలంటే హోల్‌సేల్‌ షాపులనుకుంటున్నారా? ప్రభుత్వ రంగ పరిశ్రమలు దేశాభివృద్ధికి పట్టుగొమ్మలుగా పనిచేస్తున్నాయి. అన్ని రంగాల్లో స్వయం సమృద్ధిని సాధించాయి. రిజర్వేషన్లు అమలు చేయడం వల్ల సామాజిక న్యాయం సాధ్యమైంది. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి జరిగింది. అందుకే ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవడానికి ఎటువంటి త్యాగానికైనా సిద్ధం కావాలని యావత్‌ రాష్ట్ర ప్రజానీకానికి విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ పిలుపునిస్తున్నది.

కార్మిక, కర్షక ఐక్యత ద్వారానే కేంద్ర ప్రభుత్వ మెడలు వంచగలం. విశాఖలో రైతు, కార్మిక సమర శంఖారావ నినాదం దేశమంతా మారుమోగుతున్నది. దేశంలోని కేంద్ర ప్రభుత్వ పరిశ్రమల ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటాలకు విశాఖ స్టీల్‌ ఉద్యమం కేంద్ర బిందువు కాబోతున్నది.
రైతు, కార్మిక సమర శంఖారావం

 

 

 

    * సిహెచ్‌. నర్సింగరావు /వ్యాసకర్త విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌/