ఇటువంటి హింసాత్మక సంఘటన జరిగేలా రెచ్చగొట్టిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి ఇందుకు బాధ్యులు. పైగా ఇందులో స్వయంగా ఆయన కుమారుడి ప్రమేయం వుంది. వెంటనే ఆయన్ని పదవి నుండి తొలగించడం ప్రధాని, ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత. కానీ ఇదేమీ జరగలేదు. రైతుల హత్యలను ఖండిస్తూ ప్రధాని గానీ కేంద్ర హోం మంత్రి గానీ ఒక్క ప్రకటన చేయలేదు.
ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరి లో ఆందోళన జరుపుతున్న రైతులపై అక్టోబరు 3వ తేదీన జరిపిన దారుణమైన దాడి గత పది మాసాలుగా జరుగుతున్న రైతాంగ ఉద్యమంపై కొత్త స్థాయి హింసను చూపింది.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజరు మిశ్రా తెని ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమానికి హాజరవడం కోసం ఉత్తరప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య వచ్చారు. ఆయన పర్యటనకు వచ్చిన సందర్భంగా రైతులు ఆందోళన చేస్తున్నారు. డిప్యూటీ ముఖ్యమంత్రి రావాల్సిన ప్రాంతానికి సమీపంలో రైతులు గుమిగూడారు. ఈలోగా అజరు మిశ్రాకి చెందిన కారులో ఆయన కుమారుడు ఆశిష్ మిశ్రా వున్న కారు ముందు రాగా వెనుక కార్ల కాన్వారు రైతుల పైకి దూసుకు వెళ్ళింది. ఈ ఘోరమైన దాడిలో నలుగురు రైతులు మరణించగా, పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిలో కిసాన్ నేత తేజిందర్ సింగ్ విర్క్ కూడా వున్నారు. కాగా దూసుకు వచ్చి బోల్తా పడిన కారులో వున్న నలుగురిని చావబాదడంతో వారు కూడా చనిపోయారు. ఘటన జరిగిన వెంటనే ఆశిష్ మిశ్రా సమీపంలోని పొలాల వెంబడి పరిగెత్తి ఎలా పారిపోయాడో అక్కడున్న రైతులు వివరించారు.
వ్యవసాయ చట్టాలు, రైతాంగ ఆందోళనలపై మోడీ ప్రభుత్వ వైఖరి కఠినతరమవుతున్న నేపథ్యంలో ఈ దాడి చోటు చేసుకున్నది. అంతకు ఒక వారం రోజుల ముందు, ప్రధాని ఒక వార్తా పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ, వ్యవసాయ చట్టాలను గట్టిగా సమర్ధించుకున్నారు. ఆ చట్టాలను వ్యతిరేకించడం ద్వారా 'మేథోపరమైన నిజాయితీ'ని, 'రాజకీయ మోసాన్ని' ప్రదర్శిస్తున్నారంటూ ప్రతిపక్షాలను విమర్శించారు. ఆ వెనువెంటనే హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ బిజెపి కిసాన్ మోర్చాలో ప్రసంగించారు. వివిధ ప్రాంతాల్లో బృందాలుగా ఏర్పడి, ఆందోళన జరుపుతున్న రైతాంగంపై 'టిట్ ఫర్ టాట్' విధానాన్ని అనుసరిస్తూ లాఠీలు ఎత్తాల్సిందిగా వలంటీర్లకు పిలుపిచ్చారు.
లఖింపూర్ ఖేరి కేసులో, సెప్టెంబరు 25న మంత్రి అజరు మిశ్రా రెచ్చగొట్టే ప్రసంగం చేశారు. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన జరుపుతున్న రైతాంగంపై హింసకు దిగుతామంటూ బెదిరించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే రైతులపై ఈ దాడి జరిగింది. రైతాంగ ఉద్యమం ఉధృతంగా అలాగే కొనసాగుతుండడం, దాన్ని నిరోధించలేకపోవడం పట్ల బిజెపి మంత్రులు, నేతల్లో తీవ్రంగా అసహనం పెరిగిపోయినట్లు వారి ప్రకటనలే చెబుతున్నాయి. అంతకు ముందు, హర్యానాలో, కర్నాల్ సమీపంలో టోల్ ప్లాజా వద్ద ఆందోళనకారులపై పోలీసులు దారుణమైన రీతిలో లాఠీచార్జి చేసిన తర్వాత ఖట్టర్ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అంతకు ముందు, పోలీసు వలయాన్ని ఛేదించడానికి యత్నించిన రైతుల తలలు పగలగొట్టండి అంటూ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ ఆయుష్ సిన్హా పోలీసులకు పిలుపిచ్చారు.
దిగ్భ్రాంతి కలిగించే ఈ సంఘటన తర్వాత, సంయుక్త కిసాన్ మోర్చా నాయకత్వంలో రైతులు కర్నాల్ వద్ద మినీ సెక్రటేరియట్‌ను దిగ్బంధించారు. నాలుగు రోజుల తర్వాత, పాలనా యంత్రాంగం వెనక్కి తగ్గి రైతుల ప్రధాన డిమాండ్లను ఆమోదించింది. జ్యుడీషియల్ విచారణ జరపాలని, మరణించిన రైతు కుటుంబానికి నష్టపరిహారం, ఉద్యోగం ఇవ్వాలని, అధికారి సిన్హాను శలవుపై పంపాలని రైతులు ప్రధానంగా డిమాండ్ చేశారు.
లఖింపూర్ ఖేరి సంఘటన తర్వాత వేలాదిమంది రైతులు అక్కడ గుమిగూడారు. దాంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కిసాన్ నేతలతో చర్చలు జరిపిన తర్వాత కీలకమైన డిమాండ్లలో కొన్నింటిని ఆమోదించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మంత్రి కుమారుడి చర్యలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం అందులో ఒకటి. దానికి ప్రభుత్వం వారం రోజులు గడువు కావాలని కోరింది. మరణించిన వారి కుటుంబాలకు రూ.45 లక్షల నష్టపరిహారం, గాయపడిన వారికి రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రిటైర్ట్ హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపిస్తామని కూడా ప్రభుత్వం ప్రకటించింది. అయితే పోలీసులు నిష్పాక్షికంగా విచారణ నిర్వహిస్తారా లేదా అనేది చూడాల్సి వుంది.
ప్రతీసారి, రైతాంగ ఉద్యమాన్ని అణచి వేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం పోలీసులను ప్రయోగిస్తోంది. ఇతర పద్ధతులనూ ఉపయోగిస్తూ వస్తోంది. రైతులు కూడా వాటిని తిప్పి కొడుతున్నారు. ఢిల్లీ ఆ చుట్టుపక్కల జనవరి 26 సంఘటనల తర్వాత నెలకొన్న ధోరణి ఇదే.
ఉక్కు పిడికిలితో అణచివేయడం, పోలీసు అకృత్యాలకు ఆదిత్యనాథ్ ప్రభుత్వం పెట్టింది పేరు. దాడి జరిగిన మరుసటి రోజు లఖింపూర్ ఖేరికి వెళ్ళేందుకు ప్రయత్నించిన ప్రతిపక్ష నేతలను అడ్డుకుంది, వారిని నిర్బంధించింది. రాష్ట్రంలో పలు చోట్ల, ఈ సంఘటనకు వ్యతిరేకంగా శాంతియుత నిరసనలు జరిపేందుకు ప్రయత్నించినా ప్రభుత్వం అనుమతించలేదు.
ఇటువంటి హింసాత్మక సంఘటన జరిగేలా రెచ్చగొట్టిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి ఇందుకు బాధ్యులు. పైగా ఇందులో స్వయంగా ఆయన కుమారుడి ప్రమేయం వుంది. వెంటనే ఆయన్ని పదవి నుండి తొలగించడం ప్రధాని, ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత. కానీ ఇదేమీ జరగలేదు. రైతుల హత్యలను ఖండిస్తూ ప్రధాని గానీ కేంద్ర హోం మంత్రి గానీ ఒక్క ప్రకటన చేయలేదు. రెండు రోజుల తర్వాత ప్రధాని లక్నోలో పర్యటించినపుడు కూడా ఈ సంఘటన గురించి ప్రస్తావించలేదు. లఖింపూర్ ఖేరి వద్ద రైతుల ఆందోళనపై జరిగిన హింస అనేది పాలక పార్టీ నిరాశా నిస్పృహలతో పాల్పడిన చర్యలో భాగమే. ఇలాంటి హింస రైతాంగ పోరాటాన్ని ఏమాత్రమూ తగ్గించలేదు.
/ 'పీపుల్స్ డెమోక్రసీ' సంపాదకీయం /










