Dec 06,2020 12:38

చెమట చుక్కలను
నీటి దారాలుగా మార్చి, కండలను కరిగించి
మట్టిముద్దల్లో రంగరించి,
భువిపైన జనానికి
పట్టెడణ్ణం పెడుతున్న రైతన్న,
నేడు తుపాకీ తూటాలకు
భాష్పవాయువులకు బలౌతున్నాడు.
బారికెట్లతో భారీగా మోహరించి
అన్నదాత ఆక్రందనను అణచివేస్తున్నారు.
కార్పొరేట్‌ కాకులకు కార్పెట్లు పరిచి
నిలువుదోపిడి చేసి నిలువునా ముంచుతున్నారు.
నేలను కన్నతల్లిగా భావించి
శ్రమను ఆయుదంగా మలిచి
హాలికుడై విశ్వానికి కూడు పెట్టె
అన్నదాత నేడు
ఢిల్లీ వీధుల్లో నిరసనల సెగలు
చేస్తుంటే...అన్యాయాన్ని వెళ్లగక్కుతుంటే
విశ్వపు వెన్నెముకను లాఠీలతో నిలువరిస్తున్నారు.
రైతు పాదాలనుండి కారుతున్న రుధిరదారలు
భూమాత ఎదపై ఎర్రని గుర్తులై
మిగిలిపోతారు.
మీ పాపిష్టి పాలనకు తరతరాల చేదు
జ్ఞాపకాలు గూడు కట్టుకొని
మిమ్ములను వెంటాడుతారు.
అరచేతులతో అరకను పట్టి
నేలను దున్నిన రైతన్నకు,
అక్కరకు రాని కొత్త చట్టాలు
ఉరితాళ్లయి మెడకు చుట్టుకుంటే
అర్థం కాక నేడు తల పట్టుకుంటున్నాడు.
 

- అశోక్‌ గోనె
9441317361