Nov 18,2023 22:16

సమావేశంలో మాట్లాడుతున్న కురుపాం ఎంపిపి పద్మావతి

కురుపాం: వరి కోతలకు రైతులు సిద్ధమవుతున్న సందర్భంగా ముందస్తుగా వ్యవసాయ అధికారులు ఎక్కడిక్కడ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఎంపిపి శెట్టి పద్మావతి సూచించారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయం వద్ద శనివారం ఎంపిడిఒ వివి శివరామప్ప ఆధ్వర్యంలో ఎంపిపి అధ్యక్షతన మండల పరిషత్‌ సర్వసభ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీపీ శెట్టి పద్మావతి మాట్లాడుతూ ఎన్ని గోనె సంచులైతే సరిపోతున్నాయో ముందస్తుగా ప్రణాళిక బద్దంగా సిద్ధం చేసుకుని రైతు ద్వారా పండిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేయాలని కోరారు. అలాగే కొనుగోలు కేంద్రం ద్వారా కొన్న పంటల ధరలు ప్రతి రైతుకు తెలిసేలా అవగాహన కల్పించే బాధ్యత వ్యవసాయ శాఖ సిబ్బంది తీసుకోవాలని సూచించారు. ఎంఇఒ మాట్లాడుతున్న సమయంలో మరిపల్లి సర్పంచ్‌ బి.రాజయ్య మాట్లాడుతూ తమ గ్రామంలో గతంలో ఎయిడెడ్‌ పాఠశాల ఉండేదని, అది పూర్తిగా మూసివేశారని, కావున కొత్తగా పాఠశాల మంజూరు చేయాలని కోరారు. రస్తాకుంటుబాయి సర్పంచ్‌ మాట్లాడుతూ పాఠశాల పక్కనే విద్యుత్‌ ట్రాన్స్ఫార్మర్‌ ఉందని ఏమైనా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని కావున ట్రాన్స్‌ఫార్మర్‌ను అక్కడి నుండి మార్చాలని కోరారు. పెద్దగొత్తిలి ఎంపిటిసి సభ్యులు వి.కృష్ణకుమారి మాట్లాడుతూ పెదగొత్తిలి పాఠశాలకు నాడు నాడు నిధులు మంజూరై పనులు మధ్యలో ఆగిపోయాయని, దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. నిధులు మంజూరై పాఠశాల భవనాలు నిర్మాణంలా చూడాలని కోరారు. కార్యక్రమంలో తహశీల్దార్‌ ఆర్‌.రమేష్‌ కుమార్‌, జెడ్‌పిటిసి జి.సుజాత, జెడ్‌పి, మండల ఆప్షన్‌ సభ్యులు షేక్‌ నిషార్‌, షేక్‌ జిలాని, మండల అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి
పార్వతీపురంరూరల్‌ : మండలంలో వరికోతలు ప్రారంభమైన దృష్ట్యా రైతులు దళారుల బారిన పడకుండా ప్రభుత్వం ఆర్‌బికెల ద్వారా గోనెసంచులు ముందస్తుగా అందిండమే కాకుండా కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని రావికోన సర్పంచ్‌ కడ్రక రామస్వామి అధికారులను డిమాండ్‌ చేశారు. శనివారం స్థానిక మండల సమావేశ భవనంలో ఎంపిపి మజ్జి శోభారాణి అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రామస్వామి మండలంలో నెలకొన్న కరువు పరిస్ధితులు, రైతు సమస్యలపై అధికారులను నిలదీశారు. సమావేశంలో ముందుగా ఎంపిడిఒ అకిబ్‌జావేద్‌ సమావేశపు ఎజండాను, మూడుమాసాలుగా మండల ప్రగతిని వివరించారు. అనంతరం వివిధ శాఖలకు చెందిన అభివృద్ధిని సమీక్షించారు. మండల వ్యవసాయ అధికారి అశోక్‌ ఖరీఫ్‌ వివరాలు, ఇ-క్రాప్‌, ఈకెవైసిల గురించి వివరిస్తుండగా రావికొన సర్పంచ్‌ రామస్వామి మండలంలో రైతులను ఆదుకొనేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు గురించి నిలదీశారు. అనంతరం హౌసింగ్‌ ఎఇ చిరంజీవులు మాట్లాడుతూ జగనన్న కాలనీలలో 2309 ఇళ్లకు గానూ 418 ఇళ్ల నిర్మాణం పూర్తికాగా, 1371 నిర్మాణ పనులు జరుగుతున్నాయని, వీటిలో 844 బేస్‌మెంట్‌ లెవెల్‌లో ఉన్నాయని తెలిపారు. అలాగే మిగతా శాఖలకు చెందిన అధికారులు తమ శాఖల పనితీరును గణంకాలను వివరించారు. కార్యక్రమంలో జెడ్‌పిటిసి బలగ రేవతమ్మ, ఎఎంసి చైర్మన్‌ భాగ్యలక్ష్మి, వైస్‌ ఎంపిపిలు సిద్దా జగన్నాధరావు, బంకురు రవికుమార్‌, ఒఇపిఆర్‌డి కృష్ణుడు, ఎంపిటిసిలు, సర్పంచ్‌లు హాజరయ్యారు.