Nov 07,2023 20:48

రైతు భరోసా చెక్కును అందజేస్తున్న జెడ్పీ చైర్మన శ్రీనివాసరావు, కలెక్టర్‌ నిశంత్‌కుమార్‌

ప్రజాశక్తి - పార్వతీపురం : రైతు భరోసా - పి.ఎం.కిసాన్‌ పదో సంవత్సరంలో రెండవ విడత జిల్లాలో 1,45,954మంది రైతులకు రూ.59.72కోట్లు నిధులు మంజూరయ్యాయి. వీటిలో 123599 మంది రైతులకు రూ.50.646 కోట్లు, 18803 మంది ఆర్‌ఒఎఫ్‌ఆర్‌ రైతులకు రూ.7.567 కోట్లు, 3552 మంది కౌలు రైతులకు రూ.1.507 కోట్లు రైతుల అకౌంట్‌లో జమయ్యాయి. ఈ మేరకు ఈ నిధుల పంపిణీ కార్యక్రమం కలెక్టరేట్‌లో మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా జెడ్‌పి చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున రైతు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. ఇందులో భాగంగా రైతు భరోసా - పిఎం కిసాన్‌ పథకం కింద రైతులకు ఆర్థిక దన్నుగా నిలుస్తుందన్నారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల వల్ల జిల్లాలో దాదాపు 2,500 ఎకరాల్లో పంట ఎండిపోయిన పరిస్థితి కనిపిస్తుందని, దీని పట్ల రైతాంగం అధైర్యపడవద్దని సూచించారు. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన చెప్పారు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో చెరకు పంటను ప్యారిస్‌ సంస్థతో అనుసంధానం చేశామన్నారు. కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాలు వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందన్నారు. వన్‌ స్టాప్‌ కేంద్రంగా, ఉత్తమ పని విధానంలో ప్రత్యేకత సంతరించుకుందన్నారు. యంత్ర సేవా కార్యక్రమం ద్వారా రైతులు అద్దె ప్రాతిపదికన ఆధునిక వ్యవసాయ పనిముట్లు సద్వినియోగం చేసుకోవచ్చని తెలిపారు. గత ఏడాది కనిపించిన లోటుపాట్లు సరిచేస్తూ ఈ ఏడాది పక్కాగా విజవంతంగా ధాన్యం కొనుగోలు చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేసి రైతులను ఆదుకునేందుకు జిల్లాకు లక్ష్యాలు నిర్దేశించవద్దని ప్రభుత్వాన్ని కోరామని తెలిపారు. జిల్లాలో 98 శాతం ఇ క్రాప్‌, ఇకెవైసి జరిగిందని, రాష్ట్ర వ్యాప్తంగా మొదటి ఐదు స్థానాల్లో జిల్లా ఉందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఎ.జోగారావు, ఎంపిపి మజ్జి శోభారాణి, జిల్లా వ్యవసాయ అధికారి కె రాబర్ట్‌ పాల్‌, టిడ్కో చైర్మన్‌ జమ్మాన ప్రసన్న కుమార్‌, వైసిపి జిల్లా అధ్యక్షులు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, వైసిపి నాయకులు శోభా హైమావతి, లబ్ధిదారులు పాల్గొన్నారు.