ప్రజాశక్తి-చీడికాడ: మండలంలోని అప్పలరాజుపురం, జైతవరం, తురువోలు రైతు భరోసా కేంద్రాలను మాడుగుల ఏరియా పశు వైద్యశాల సహాయ సంచాలకులు చిట్టి నాయుడు ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. రైతు భరోసా కేంద్రాల పరిధిలో లంపీ స్కిన్ వ్యాధి నిరోధక టీకాలపై సచివాలయ సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం రైతులకు సబ్సిడీ పై అందించే సంపూర్ణ మిశ్రమ దాణా, గడ్డి కత్తిరించే యంత్రం, పశు మత్శ్య దర్శిని, గడ్డి విత్తనాలపై రైతులకు వివరించాలని తెలిపారు. అనంతరం చీడికాడ పశు వైద్యశాలను సందర్శించారు. రైతు భరోసా కేంద్రాల పరిధిలో లంపీ స్కిన్ వ్యాధి టీకాల కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని పశువైద్యాధికారికి సూచించారు. ఇప్పటి వరకు మండలంలో 3,770 పశువులకు లంపి స్కిన్ టీకాలు వేశారన్నారు. ఈ వ్యాధి పట్ల రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు.రైతులు సంతలలో కొత్తగా పశువులుకొని గ్రామాల్లోకి తీసుకు రాకుండా జాగ్రతలు తీసుకుంటే ఈ వ్యాధి ప్రబలకుండా చేయవచ్చని సూచించారు. పశువులకు దద్దుర్లు, జ్వరం లక్షణాలు కనిపిస్తే వెంటనే దగ్గరలోని పశు వైద్యాధికారులను సంప్రదించాలన్నారు.










