ప్రజాశక్తి -భీమునిపట్నం : రానున్న వ్యవసాయ సీజన్ నుంచి రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు పంపిణీ చేయనున్నట్లు మండల వ్యవసాయాధికారి బి.శివకోమలి స్పష్టం చేశారు. స్థానిక వ్యవసాయ శాఖ కార్యాలయంలో శనివారం మండల స్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రతి గ్రామంలో మట్టి నమూనాల సేకరణ, ఫలితాల ఆధారంగా మితిమీరిన ఎరువుల వాడకం తగ్గించి తద్వారా రైతులు నాణ్యమైన అధిక దిగుబడులు పొందేలా ప్రతి రైతు భరోసా కేంద్రం సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చినట్లు వివరించారు. వైఎస్‌ఆర్ యంత్ర సేవా పథకం కింద ఏర్పాటుచేయనున్న 13 గ్రూపులకు గానూ 9 గ్రూపులు ఏర్పాటుచేశామన్నారు. మిగిలిన 4 గ్రూపులను వారం రోజుల వ్యవధిలో ఏర్పాటుచేయాలని ఆయా గ్రామాల సలహా మండలి సభ్యులకు సూచించారు. పిఎం కిసాన్, వైఎస్‌ఆర్ రైతు భరోసా లబ్ధిదారులు ఈ నెలాఖరు నాటికి ఇకెవైసి తప్పని సరిగా చేయించుకోవాలని సూచించారు. పశుసంవర్థక శాఖ ద్వారా ఈ నెల 16 నుంచి మేకలు, గొర్రెలకు నట్టల నివారణ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎండిఒ పి.వెంకటరమణ, ఉద్యాన శాఖ అధికారి పి.స్వాతి, ఆర్‌బికె సిబ్బంది జి.స్రవంతి, యు.శివకృష్ణ, డి.భువన ప్రత్యూష, పలువురు సలహా మండలి సభ్యులు పాల్గొన్నారు.










