Jul 21,2023 22:28

మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ చిరంజీవులు
ప్రజాశక్తి - ఏలూరు టౌన్‌

             నిత్యావసర సరుకుల ధరలు బహిరంగ మార్కెట్‌లో పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ద్వారా ప్రజలకు తక్కువ ధరలకే కందిపప్పు, బియ్యం రైతు బజారులో ప్రత్యేక కౌంటర్ల ద్వారా అందిస్తున్నామని ఏలూరు మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ ఎన్‌.చిరంజీవులు తెలిపారు. జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ బి.లావణ్యవేణి ఆదేశాల మేరకు నగరంలో వన్‌టౌన్‌ రైతు బజారు, పత్తేబాద రైతు బజారులోని ప్రత్యేక కౌంటర్ల ద్వారా రూ.134లకే కందిపప్పు అందించే కౌంటర్లు శుక్రవారం ఏర్పాటు చేశారు. ఏలూరు వన్‌టౌన్‌లో ఉన్న రైతు బజారు కౌంటరును ఏలూరు మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ ఎన్‌.చిరం జీవులు, పత్తేబాద రైతు బజారులో కౌంటర్లను జిల్లా పౌరసరఫరాల అధికారి ఆర్‌.సత్యనారాయణరాజు ప్రారం భించారు. ఈ సందర్భంగా మార్కెట్‌ యార్డ్‌ ఛైర్మన్‌ ఎన్‌. చిరంజీవులు మాట్లాడుతూ బియ్యం, కందిపప్పు బహిరంగ మార్కెట్‌లో ఎక్కువ ధరలు పెరగడం ద్వారా ప్రజలకు తక్కువ ధరలకే అందించాలనే సదుద్దేశంతో రైతుబజారుల్లో ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయిస్తున్నామని, ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. జిల్లా పౌర సరఫరాల అధికారి ఆర్‌.సత్యనారాయణరాజు మాట్లాడుతూ పత్తేబాద, వన్‌టౌన్‌ రైతు బజారుల్లో ప్రత్యేక కౌంటర్ల ద్వారా ప్రజలకు కేజీ కందిపప్పు రూ.134కే అందిస్తున్నామని, బియ్యం కౌం టర్‌ ద్వారా స్వర్ణ బియ్యం కిలో 34, పిఎల్‌ 40, సోనామసూ రి రూ.48 అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్ర మంలో అసిస్టెంట్‌ పౌర సరఫరాల అధికారులు లక్ష్మణబాబు, వై.ప్రతాపరెడ్డి, ఎస్టేట్‌ ఆఫీసర్‌ ఎం.సుధాకర్‌ పాల్గొన్నారు.